*శంబల - 24*
💮
*రచన : శ్రీ శార్వరి*
*బై బై శంబల - 4*
ప్రశ్న : “లామా! పొటాలాలో రహస్య గుహల గురించి చెప్పండి. అక్కడ దేవాలయాలు, ఒక సరస్సు ఉన్నాయంటారు. నిజమా!”
లామా : “లాసా గురించి నా కంటే మీకే ఎక్కువ పరిచయం ఉన్నదనిపిస్తోంది. మీరిక్కడకు లోగడ ఎన్నిసార్లు వచ్చారు? ఎలా వచ్చారు? దేవాలయం క్రింది సరస్సు గురించి మీకెవరు చెప్పారు? మీరు గొప్ప లామా అయి ఉండాలి. లేదా కాలజ్ఞానులై ఉండాలి. 'కాలచక్ర' రహస్యం తెలియని వారికి ఆ దేవాలయం గురించి, సరస్సు గురించి తెలిసే అవకాశం లేదు.”
ప్రశ్న : “మహోదయా! హిమాలయ పర్వత గుహలలో తపస్సు చేసే వారికి దేవతలు ఆహారం తెచ్చి పెడతారట నిజమా? అది అసంభవం కదా.”
లామా : “ఏదీ అసంభవం కాదు. మీరు శంబల రావడం అసంభవం అయిందా? వచ్చారు కదా. నన్ను కలవడం అసంభవం అయిందా? కలిశారు గదా. ఇంతకాలంగా అసంభవాలనుకున్నవి ఇప్పుడు సంభవాలవుతున్నాయి.”
ప్రశ్న : “శంబల బయటి ప్రపంచంతో జ్ఞానం యిచ్చి పుచ్చుకోవచ్చు గదా.”
లామా : “ఇవ్వడమే కాని పుచ్చుకునే ప్రసక్తి లేదు.”
భార్గవ : “స్వామీ! ఇక్కడ గురు శిష్య సంబంధం గురించి మీ అభిప్రాయం?
లామా : “గురువా? గురుపీఠమా? ఏది ముఖ్యం. గురువు ఎంత అవసరమో గురుపీఠం అంతే ముఖ్యం. ఒక ఆశ్రమం ఉంటే గురువు ఉన్నట్లు. వ్యక్తిగతంగా గురువులుండరు. ఆశ్రమాలను అంటి పెట్టుకునేవారే గురువులు.”
ప్రశ్న : “మహాత్మా! కాలచక్ర గురించి మీ అభిప్రాయం?”
లామా : “కాలచక్ర అంటే కాలజ్ఞానం. ఎంతదూరం నుండి అయినా శబ్దం వినిపిస్తుంది. అంటే విశ్వనాదాలను వినడం. చాలా కాలం క్రిందట మిలారేపా అనే యోగి తన హృదయంతో దివ్య సందేశాలను వినేవాడు. బట్టలు మార్చినంత మాత్రాన ఎవరూ బుద్ధుడు కారు. మఠంలో ఉన్నంత మాత్రాన లామాలు కారు. హృదయ సంస్కారం ఉండాలి. బోధిసత్వులు కావాలి. మీ దేశంలో లాగా ఇక్కడ అపర బుద్ధులు, బుద్ధి లేనివారు తయారవుతున్నారు.
నాకు కాలచక్రం గురించి తెలియదు బాబూ! అది ఒక విధమైన అవగాహన. మనకు అంతర్దృష్టి ఉంది. జ్ఞానం ఉంది. మన చైతన్యాన్ని మనసుకు బదిలీ చేస్తాం. సాధన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి తేడా ఉంటుంది. జ్ఞానాన్ని ఉత్తినే పంచకూడదు. అవసరమైనంత వరకే చెప్పాలి. కాలచక్రం ఒక రహస్యం.”
భార్గవ : “నాకు తెలిసినంతవరకు కాలచక్రలో తంత్రం ఎక్కువని. గౌతమ బుద్ధుడు తంత్రాన్ని బోధించలేదు.”
లామా : “ఒకప్పుడు బౌద్ధానికి 'చాక్పో' వర్గం పరమ శత్రువులు. వారే క్షుద్ర విద్యల్ని బౌద్ధంలో చొప్పించారు. ఆ వర్గం వారు క్షుద్రపూజలు చేసేవారు. ఉపాసన పేరిట అకృత్యాలు చేసేవారు. మాస్టర్లు ఎవరూ వాటిని అంగీకరించరు. మంగోలియాలో ఒక వర్గం బౌద్ధులు మధు మాంసాలు తీసుకుంటారు. అసలైన బౌద్ధులు తంత్రాన్ని నిషేధించారు. మనిషికి మేలు చేసేదే బౌద్ధం అది ధర్మపధం.”
ప్రశ్న: “భోజనం లేకుండా, నిద్రపోకుండా ఉండడం ఎలా సాధ్యం? అవసరమా?”
లామా : “చెప్పాను గదా! ఏదీ అసాధ్యం కాదని. అజరలకు కాలచక్ర రహస్యం తెలుసు. అది ఇండియా నుంచి వచ్చిన విద్య. అది శ్రీవిద్య అంటారు. భారత్ లో శ్రీచక్రానికి, కాలచక్రానికి పోలికలు ఉన్నాయి. అందరు కాలచక్ర ధర్మాలు పాటించడం లేదు. బుద్ధుని సూత్రాలు అన్నీ మనిషికి మేలు చేసేవే. ఒకప్పుడు బౌద్ధ స్థూపాలలో లింగ ప్రతిష్ట చేశారు. అవి ఆనాటి నుండి శివలింగాలుగా మారాయి. నాటి బౌద్ధ స్తూపాలే నేటి శివాలయాలు, మంచిగా జీవిస్తూ తపస్సు చేయడం అన్నది కాలచక్ర రహస్యం.”
ప్రశ్న: “మహా లామా! థాంక్స్! మీరిచ్చే సందేశం? మమ్మల్ని ఆశీర్వదించండి.”
లామా : “ఆధ్యాత్మిక జీవితం అంటే ధర్మంగా జీవించడం. ధ్యానులుగా జీవించడం. యోగాన్ని నిత్య నైమిత్తికాల ను ఒకటి చేసుకోవడం. శంబల అంటే ధార్మిక జీవనం. అందరికీ ఆనందం కలిగించడం. భూమి పైన సంపాదించేది భూమి పైన అందరికీ ఉపయోగించడం. పై జన్మకు ఏదీ మిగలదు. పుణ్య పాపాలు ఏవీ పై జన్మకు బదిలీ కావు. అవతారాలు ముఖ్యం కాదు. అనవరత కృషి, సాధన ముఖ్యం. హృదయమే పరిశోధనాలయం. బాహ్య జీవితం శుచిగా పవిత్రంగా ఉంటే అంతరంగం పరిశుభ్రంగా ఉంటుంది.
దగ్గర మార్గంలో సంపూర్ణ మానవుడు కావడం కాలచక్ర రహస్యం.”
*తిరుగు ప్రయాణం*
అది ప్రయాణమో, పలాయనమో తెలియనంత ఆనందంగా ఉంది నాకు. ఢిల్లీ నుండి శంబలకు బయలుదేరినప్పు డు ఆనందం, తడబాటుతనం శంబల నుండి తిరిగి ఢిల్లీ ప్రయాణంలో నాలో లేకపోయినా ఆనందంగానే వుంది. తడబాటుతనం బొత్తిగా లేదు. శంబల వెళ్లి ఏం సాధించామంటే నోరు వెళ్లబెట్టా ల్సిందే. ఏమీ సాధించకపోవడమే గొప్ప విజయం.
ఖాట్మండు వదలిన మా ఫ్లయిట్ రెండు గంటల్లో ఢిల్లీ చేరింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం కనిపించగానే ప్రాణం లేచి వచ్చింది. హమ్మయ్య అనుకున్నాం. విమానం ఢిల్లీ వైపు సాగుతున్నా ఆలోచనలు శంబలను వదలడం లేదు. అది ఒక స్వప్నం. మధురమైన స్వప్నం. ఊహల్లో నిలిచిపోయిన స్వప్నం.
అసలు నా ఈ ప్రయాణం కలా, నిజమా అనే సందిగ్ధం. నిజంకలతో మొదలైన ప్రయాణం స్వప్నలోకం వంటి శంబల అనుభవం. నా వరకు అది ఒక జానపద కథ. జానపదులు లేరు గాని జ్ఞానపధాలు చూచాం. ఇది నిజ జ్ఞానపధ కధ. ఒక జీవితకాలం స్మృతుల్లో భద్రపరచుకోదగి న అనుభవం. ఎన్నో జన్మలకు గానీ ఇలాంటి అనుభవం కలగదు ఎవరికైనా.ఖాట్మండులో మా ఫ్లయిట్ టేకాఫ్ తీసుకో గానే భార్గవ నిద్రకు ఉపక్రమించాడు. నిశ్చింత మానవుడికి, మిన్ను విరిగి మీద పడ్డా దులిపివేసుకునే స్వభావం. కారణ జన్ముడు, అకారణగా నా పాలిటపడ్డాడు. తనకు తానే తోడు, నీడ.అలుపుసొలుపు లేని కర్మిష్టి, కర్మయోగి. భార్గవ గుండంటే నాకిష్టం! అతను గుండ్రటి యోగి, గుండు యోగి, పలకరించి కబుర్లు చెప్పాలని ఉంది. సన్నగా గురక తీస్తున్నాడు.
విమానాశ్రయంలో మా కోసం, సారీ, భార్గవ కోసం చాలామంది పూలదండల తో వచ్చారు- స్వాగతం చెప్పడానికి. నాకంత సీన్ లేదు. నా కోసం ఎవరూ రాలేదు. భార్గవ స్వర్గాన్ని జయించిన వీరుడైనాడు వాళ్ల దృష్టిలో. తెలియ కుండా పబ్లిసిటీ చేసుకోవడం భార్గవకు రాజకీయ మిత్రుల వారసత్వం. పాతిక కార్లలో మా ప్రయాణం సాగింది ట్రాఫిక్ జాం.
తన అంతఃపురం దగ్గర కారు దిగి “రేపు అభినందన సభ ఏర్పాటు చేశారట. రెడీగా ఉండండి గురూజీ" అన్నాడు.
"ఎందుకు అభినందన సభ. ఏం ఘనకార్యం చేశామని?” అడిగాను.
"ఏం ఘనకార్యం చేసిందీ రేపటికి వాయిదా వేద్దాం!" అన్నాడు.
నేను మా ఆశ్రమానికి వెళ్లాను. అన్ని పత్రికలు వారం రోజులుగా మా శంబల యాత్రను కవర్ చేశాయి. కొన్ని పత్రికలైతే బ్యానర్ హెడ్డింగులు పెట్టాయి. పెద్ద పెద్ద ఫోటోలేశారు. ఈ కవరేజి ఎట్లా జరిగింది. మా టూర్ ఫొటోలు ఎవరు పంపారు? మేము ఎక్కడా, ఫొటోలు తీయలేదే! అంతా భార్గవ మహత్యం. పగలంతా టి.వి. వాళ్ల హడావుడి. ఇంటర్వ్యూలు.
నిజంగానే నేను స్వర్గం వెళ్లి వచ్చానా?
మర్నాడు పేపర్ల నిండా మా ఇంటర్వ్యూలే వచ్చాయి. సాయంత్రం అభినందన సభకు వెళ్లడం ఇష్టం లేదు. అయినా తప్పదు. ఆశించని పబ్లిసిటి. చచ్చినట్లు ఒప్పుకోవలసి వచ్చింది.
నేను రెడీ అవుతుండగా ఫోన్ మోగింది.
"హలో గురూజీ భార్గవ హియర్."
"చెప్పండి మహాశయా! ఏమిటీ ఆర్భాటం?"
"జోక్ కాదు గురూజీ! నిజం పచ్చి నిజం. చేదు నిజం.”
"ఏమిటా నిజం?"
"ఒకసారి మీరు మా ఇంటికి రావాలి. అర్జంటు?"
"బడలికగా ఉంది భార్గవా.”
"నో ఛాన్స్. మీరు వెంటనే వస్తున్నారు" ఫోన్ పెట్టేశాడు. వెళ్లక తప్పలేదు.
గేటులో ఎదురై "శివాని కనిపించడం లేదు గురూజీ” అన్నాడు. పుట్టెడు దుఃఖం గుండెలోంచి పొంగుకొస్తోంది. దేవుడిచ్చిన కూతురని ఎంత మురిసిపోయాడు. బాధ అనిపించింది!
"నిజమా?” అన్నాను.
"నిజమా, నిజన్నరా! ఒట్టు. శంబల మీద ఒట్టు గురూజీ.”
కళ్లు తుడుచుకున్నాడు. నిజంగానే దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు.
“ఎట్లా జరిగింది భార్గవా?”
"ఏమో గురూజీ! మనం వెళ్లిన రోజునే తనూ మాయమైందిట. ఎవరికీ చెప్పలేదట!"
“పోలీసు రిపోర్టు ఇవ్వలేదా?”
“ఏం ప్రయోజనం? అసలు ఆ అమ్మాయి ఎవరంటే ఏం చెప్పను? కాలికి తగిలిన దాన్ని మెడలో వేసుకున్నట్లయింది గురూజీ.”
"అయ్యో! మరి వరూధిని?”
"వరూధిని ఎవరు? గురూ."
"అదే భార్గవా! దేవుడు పంపిన సితార” అన్నాను.
అంత దుఃఖంలోనూ నవ్వాడు.
"ఆమె ఉంది. నా రాక కోసం ఎదురు చూస్తోంది.”
"ఏమిటి కధ?”
"మేం పెళ్లి చేసుకుందామని నిర్ణయించు కున్నాం. ఈ రోజే మా రిజిస్టర్ మారేజ్. మీరు వచ్చి సంతకం పెట్టి మమ్మల్ని ఆశీర్వదించాలి.”
అంటూ ఘోరంగా సిగ్గుపడిపోయాడు.
"అట్లా చెప్పండి. అందుకా అభినందన సభ. బాగుందయ్యా భార్గవా!”
"అంతేనంటారా గురూజీ!"
"శంబల నీకు కలిసొచ్చింది భార్గవా!"
అభినందించక తప్పలేదు! మన భార్గవ గదా!
“శతమానం భవతు"
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment