*రాళ్ళ* *నెక్లెస్*
*రచన*: *లక్ష్మి* *మదన్*
🌹🌹🌹🌹🌹🌹🌹
చీకటిపడింది, ఇంకా మనవడు రాలేదని కాంతమ్మ ఎదురుచూస్తూ పెద్ద దర్వాజా దగ్గర నిలబడింది. మనవడు వచ్చే జాడే కనపడలేదు..
నిలబడే ఓపిక లేక లోపలికి వెళ్లి అరుగుమీద కూర్చుంది. ఆమె ఆలోచనలన్నీ గతంలోకి వెళ్లాయి..
కాంతమ్మకు పన్నెండు ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. చిన్న ఊరిలో పుట్టి పెరిగిన కాంతమ్మ పట్టణంలోకి వచ్చి పడింది... ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. కానీ పెద్ద కోడలిగా ఇంటికి వచ్చింది.
కొత్త పెళ్లికూతురు అనే ట్యాగ్ పోనేలేదు పాచి పనులన్నీ మీద పడ్డాయి.. వాకిలి ఊడ్చి చానిపి చల్లడం మొదలు అంట్లు కడగడం గోలాల్లో నీళ్లు తోడిపెట్టడం.. పశువులకు గడ్డి వేయడం ఇలా అన్ని పనులు ఒకటి ఒకటి వచ్చి చేరాయి...
ఎన్ని పనులు చేసిన అత్త సూరమ్మకి తృప్తి లేనేలేదు. సూటి పోటీ మాటలు అంటూ ఉండేది.. పుట్టింట్లో తండ్రి గారాబంతో పెరిగిన కాంతమ్మ ఇక్కడ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. అన్నింటినీ భరించుకుంటూ అలాగే కాలం నెట్టుకు వస్తుంది. భర్తకు చెప్పే ధైర్యం లేదు. చెప్పినా కూడా చక్కదిద్దుతాడని ఆశ అంతకన్నా లేదు. ఎందుకంటే ఇంట్లో అంతా సూరమ్మ పెత్తనమే! చివరికి మామగారు కూడా గంగిరెద్దులా తల ఊపే వాడే..
కాంతమ్మ పెళ్లయి వచ్చేటప్పుడు కాంతమ్మ తండ్రి...
"కాంతి! నాకు చేతనైనంత కట్నం నీ పెళ్ళికి ఇచ్చానమ్మా! కానీ నాకు చాలా ఇష్టమైన కోర్కె ఒకటి ఉంది" అంటూ ఒక రాళ్ల నెక్లెస్ తీసి కాంతమ్మ మెడలో వేశాడు.
తెల్లరాళ్లతో మామిడి పిందెల నెక్లెస్ దగదగా మెరిసిపోతుంది. అప్పుడే చేయించినంత కొత్తగా ఉంది...
"నాన్నా! ఇంత విలువైన నెక్లెస్ నాకోసం తెచ్చావా అప్పుచేసి తెచ్చావా నాన్న" అని బాధపడుతూ అడిగింది కాంతమ్మ.
"లేదురా తల్లి ఇది మీ నాయనమ్మ నెక్లెస్ ఇన్నాళ్లు ఎవ్వరికి ఇవ్వకుండా దాచి పెట్టాను. చివరికి మీ అమ్మకి కూడా నేను చూపించలేదు. నువ్వు పుట్టిన తర్వాత ఇది నీకే ఇవ్వాలని నిశ్చయించుకున్నాను.. నేను నీకు ఇచ్చే విలువైన కానుక" అన్నాడు కాంతమ్మ తండ్రి.
సంతోషంతో నెక్లెస్ చూసుకొని మురిసిపోయింది కాంతమ్మ.
అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇంటేడు చాకిరీవల్ల కనీసం తయారు అవ్వడం కూడా మర్చిపోయింది... చిన్న ఊరు కాబట్టి ఎవరింట్లోనో ఒకరింట్లో పేరంటాలు జరిగేవి. వాళ్ళు తాంబూలం తీసుకెళ్లమని పిలిచేవారు. వాడకట్టులో ముగ్గురు నలుగురు కలిసి తాంబూలాలకు వెళ్లేవాళ్లు.
ముఖం కడుక్కున్నా కడుక్కోకపోయినా.. కొత్త చీర కట్టుకున్న కట్టుకోకపోయినా.. చిటుక్కున నెక్లెస్ మాత్రం ధరించేది కాంతమ్మ. అది తండ్రి ఇచ్చిన నెక్లెస్ కావడం వల్ల తనకు ఎంతో ఇష్టం. అదే కాక ఆనెక్లెస్ మెరుస్తూ ఎంతో అందంగా ఉండేది.
ఒకరోజు ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల కాంతమ్మ మామగారు రాఘవయ్య కొడుకు కుమారస్వామిని పిలిచి..." ఏరా! ఒక చిన్న సహాయం చేస్తావా" అని అడిగాడు.
"ఏంటి నాన్నా" అని అడిగాడు కుమారస్వామి.
"నీకు తెలుసు కదా పొలంలో ఈసారి పంటలు పండలేదు షావుకారు దగ్గర అప్పు కట్టాలి డబ్బులకు కష్టంగా ఉంది. కోడలు మెడలో ఉన్న నెక్లెస్ తీసి ఇస్తే తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి షావుకారు గారికి ఇస్తాను" అన్నాడు రాఘవయ్య
"కాంతిని ఒక మాట అడిగి చెప్తాను నాన్నా" అన్నాడు నసుగతూ కుమారస్వామి.
అప్పుడే అక్కడికి వచ్చిన సూరమ్మ..
"ఏంట్రా! నీ పెళ్ళాన్ని అడిగి చెప్తావా ? పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతున్నావురా ? సిగ్గులేదు పెళ్ళాంకు భయపడడానికి" అన్నది సూరమ్మ ఉరుముతూ..
"అయ్యో అదేం లేదమ్మా తెచ్చి ఇస్తాను" అని భయపడుతూ లోపలికి వెళ్ళిపోయాడు కుమారస్వామి.
"కాంతీ" అని మెల్లగా పిలుస్తూ లోపలికి వెళ్ళాడు..
అప్పటికే ఇదంతా విన్న కాంతమ్మ పెట్టెలోనుండి గొలుసు తీసి భర్త కుమారస్వామి చేతిలో పెట్టింది..
అప్పటికి కాంతమ్మ వయసు పదహారు ఏళ్లు మాత్రమే..
ఇలా ఏ అవసరం వచ్చినా చీటికిమాటికి నెక్లెస్ తాకట్టు పెట్టడం డబ్బు తేవడం...
ఇంట్లో ఆనెక్లెస్ పది రోజులు మాత్రమే ఉండేది.. ఇంట్లో ఉన్న ఆ పదిరోజుల్లో ఏదైనా ఫంక్షన్ వస్తే మెడలో వేసుకుని వెళ్ళేది కాంతమ్మ. తాకట్టులో ఉన్నప్పుడు నెక్లెస్ వేసుకోకుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ..." కాంతక్కా! నెక్లెస్ ఏది"? అని అడిగేవాళ్లు. అప్పుడు ఎంతో బాధపడేది కాంతమ్మ
ఇలా రోజులు గడిచిపోయాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వయసైపోయి అత్తా మామ చనిపోతే భర్త అర్ధాంతరంగా పోయాడు...
దిక్కుతోచనిదై పోయింది కాంతమ్మ... అప్పటికే పిల్లల పెళ్లిళ్లు అయినందువల్ల కొంతలో కొంత నయమైంది కాంతమ్మకు ఇలా అప్పుల కోసం కుదువ పెట్టిన నెక్లెస్ అలాగే షావుకారు దగ్గరే ఉండిపోయింది.
నగరంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు ఇటువైపు తొంగి చూడలేదు. ఉన్న ఊరు వదిలి ఎక్కడికి రానని అదే పెంకుటింట్లో ఉండ సాగింది కాంతమ్మ.
ఈమె కష్టాలు తెలుసుకున్న పెద్ద మనవడు ఊరికి వచ్చాడు. అక్కడి పరిస్థితి చూసి నాలుగు రోజులు అక్కడే ఉండిపోయాడు. మాటల సందర్భంలో నాయనమ్మ నెక్లెస్ షావుకారు వద్ద ఉందని తెలుసుకున్న మనవడు విక్రాంత్ కొంచెం బాధపడ్డాడు. నాయనమ్మ ఇంటికోసమే తన నెక్లెస్ కుదువ పెట్టడానికి ఇచ్చేది అని తెలుసుకున్న అతడు ఎలాగైనా ఆ నెక్లెస్ విడిపించుకుని రావాలని అనుకున్నాడు.
రాత్రి పది గంటలు కావస్తుంది మనవడు ఇంకా రాలేదని వీధి చివరిదాకా వెళ్లి చూసింది కాంతమ్మ. దూరంగా నీడ కనబడింది మనవడిలాగే ఉన్నాడని అనిపించింది. దగ్గరికి వచ్చి చూసేవరకు అతను మనవడు విక్రాంతే...
"ఇంతసేపయిందేంటి నాయన! నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నాకు చాలా భయమేసింది అసలే నీకు ఊరు కొత్త" అని మనవడి చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళింది కాంతమ్మ.
ఇంట్లోకి వచ్చిన విక్రాంత్ కాళ్లు చేతులు కడుక్కొని వచ్చి నాయనమ్మ కంచంలో పెట్టిన అన్నం తినసాగాడు.
"నువ్వు తిన్నావా నాయనమ్మ" అని అడిగాడు.
"నేను రాత్రులు ఏమీ తినటం లేదు నాయనా., వయసు పెరిగిపోయింది కదా జీర్ణం కావడం లేదు" అన్నది కాంతమ్మ.
"అలా కాదు ఏదో ఒకటి తినాల్సిందే. అలా ఏమీ తినకుండా పడుకోకూడదు అని చెప్పి తన బ్యాగులో ఉన్న కార్న్ ఫ్లెక్స్ తెచ్చిపెట్టాడు.
"నాకు పళ్ళు లేవు కదా నాయనా నేను తినలేను" అన్నది కాంతమ్మ.
అన్నం తిని చేయి కడుక్కొని వచ్చిన విక్రాంత్ ఒక గిన్నెలో పాలు పోసి దానిలో ఫ్లెక్స్ వేసి మెత్తగా చేసి "ఇప్పుడు తిను" అని ఇచ్చాడు.
సంతోషంగా తిన్నది కాంతమ్మ. ఆమె తిన్న తర్వాత తన బ్యాగ్ లోనుండి ఒక పొట్లం తీశాడు.
"నాయనమ్మ ఇటు వచ్చి కూర్చో" అని పిలిచాడు విక్రాంత్.
నాయనమ్మ దగ్గరికి రాగానే బ్యాగులో నుండి తీసిన పొట్లం లోనుంచి దగధగా మెరుస్తున్న రాళ్ల నెక్లెస్ తీసి చూపించాడు.
"చూసావా ఇది నీకు మీ నాన్నగారు ఇచ్చిన నెక్లెస్. దీని గురించి బాధపడ్డావు కదా! అందుకనే షావుకారు దగ్గర నుండి విడిపించుకుని తెచ్చాను" అన్నాడు విక్రాంత్.
కాంతమ్మ కళ్లనుండి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి... ఎవ్వరు చేయలేని పని మనవడు విక్రాంత్ చేసినందుకు ఆమె మనసు ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ వయసులో ఆమె నెక్లెస్ వేసుకునేది లేదు.. తిరిగేది లేదు, అయినా కూడా తన తండ్రి జ్ఞాపకంగా ఇచ్చిన ఆ నెక్లెస్ తన వద్దనే ఉండాలని ఒక చిన్న ఆశ. మనవడిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది కాంతమ్మ.
"నాయనమ్మ! నువ్వు కూడా మాతో పాటు ఉండాలి.. పట్నానికి పోదాం" అన్నాడు మనవడు విక్రాంత్.
"నేను అక్కడ ఉండలేను నాయనా అలవాటైనా స్థలం నేను ఇక్కడే ఉంటాను. చేతనైనన్ని రోజులు చేసుకుంటాను లేదంటే మీరు ఉన్నారు కదా" అన్నది కాంతమ్మ.
మరో రెండు రోజులు ఉన్న మనవడు నగరానికి వెళ్లిపోయాడు.
అతనికి పెళ్లి కుదిరింది అనే వార్త విని నగరానికి వెళ్ళింది కాంతమ్మ. మనవడి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది.
పెళ్లి జరిగాక గృహప్రవేశం జరిగిన మనవడి భార్య స్వర్ణను చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లి దేవుడి గదిలో దీపం పెట్టించింది కాంతమ్మ. మనవడు మనవరాలిని ఆశీర్వదిస్తూ తన చేతిలో ఉన్న రాళ్ల నెక్లెస్ మనవరాలి మెడలో అలంకరించింది కాంతమ్మ.
ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు తనకు ఎంతగానో ఇష్టమైన రాళ్ల నెక్లెస్ మనవరాలికి బహుమతిగా ఇవ్వడం చూసి.
కాంతమ్మ మాత్రం తృప్తిగా తల ఊపింది నా తండ్రి ఇచ్చిన రాళ్ళ నెక్లెస్ చేరవలసిన వాళ్లకే చేరిందని అనుకున్నది.
No comments:
Post a Comment