Thursday, February 6, 2025

 కథ 
మనిషి 
- కర్లపాలెం హనుమంతరావు 

మధ్యాహ్నం మూడింటప్పుడు జానకి కాల్ చేసింది 'మామయ్యగారు కనిపించడంలేదండీ!' అంటూ కంగారుపడుతూ. 

లంచ్ ముగించుకుని 'డే బుక్' రాసే పనిలో పడబోతున్నానప్పుడే! జానకి మాటలు ముందు అస్సలు బుర్రకెక్కలేదు. 'బాబాయి కనిపించకపోవడమేంటీ? ఆయనేమన్నా చిన్న పిల్లాడా.. తప్పిపోడానికి' అనిపించింది. 
'అసలేం జరిగింది జానకీ?' అనడిగాను ఆదుర్దాగా!
పొద్దున పదకొండు గంటల ప్రాంతంలో ఏవో మందులు తెచ్చుకుంటానని బయటకుపోయాట్ట! ఇంత వరకు ఇంటికి రాలేదుట! 
మందుల దుకాణం ఉండేది మా వీధి చివర్లోనే. నత్తలాగా నడిచి వెళ్ళొచ్చినా పావుగంటకు మించి పట్టదు. ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు దాటింది. ఎట్లాంటి కండిషన్లో కూడా పన్నెండు గంటలకు విసరి ముందు కూర్చోడం బాబాయికి అలవాటు. అట్లాంటి మనిషి ఇంకా ఇంటికి రాకపోవడమేమిటి?!
 
నా మనసునేదో కీడు శంకిస్తోంది. పని ముందుకు సాగలేదు. మేనేజరుగారికి విషయం చెప్పి పర్మిషన్ తీసుకుని బ్యాంకు నుంచి బైటపడ్డాను.
ఇంట్లో జానకి తిండి తిప్పలు మానేసి దిగాలుగా కూలబడివుందో మూల. డైనింగ్ టేబుల్ మీద ఎక్కడి గిన్నెలుఅక్కడనే ఉన్నాయి. 
'వీధి చివర్లోని మందుల షాపులో అడిగి చూశావా?' అని అడిగాను జానకిని. 
'ఎట్లా ఊరుకుంటానండీ! ముందు చేసిన పని అదే! ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు. పక్కనున్న హోటల్లో వాళ్లు ఏదో అన్నారు గానీ, నాకు సరిగ్గా అర్థం కాక మీకు ఫోన్ చేశా!' అంది జానకి. 
మరోసారి మందుల షాపుదాకా వెళ్లి చూశాను. షాపు తెరిచిలేదు. హోటల్లోని మనిషి ఏదో దాస్తున్నట్లు అనుమానంగా అనిపించింది. బాబాయికి సెల్ ఫోన్ వాడే అలవాటు లేదు.. ఎక్కడున్నాడో తెలుసుకోడానికి.  
బాబాయిది వేటపాలెం. మా నాన్నకు అందరికన్నా చిన్న తమ్ముడు.పోయినేడాదే షష్టిపూర్తి అయింది. మా ఊరి హైస్కూల్లో సంస్కృతం ఉపాధ్యాయుడుగా చేసి రిటైరయ్యాడు. పిన్ని పోయి చాలా కాలమయింది. ఆదుకునే పిల్లలెవరూ ప్రస్తుతం లేరు. 
'ఒంటరిగా ఆ ఊళ్లో ఏం ఉంటావ్! మా ఊరొచ్చేయమని చాలా సార్లు పోరుపెట్టాను. 'ఇప్పట్నుంచే ఒకళ్ల మీద ఆధారపడ్డం దేనికిలేరా! ఒంట్లో ఓపికున్నంత కాలం లాగిస్తాను. తప్పదనుకున్నప్పుడు నీ దగ్గరకు కాక ఇంకెవరి దగ్గరకు వెళతానులే! అని తప్పించుకుని తిరుగుతుండటంతో అడగడం మానేశాను. ఇప్పుడైనా ఆ కంటికి 'గ్లాకోమా' జబ్బేదో వచ్చిందని, చూపించుకోడానికి నా బలవంతం మీద వచ్చాడు..  గానీ లేకపోతే ఒక పట్టాన ఆ రథాన్ని కదిలించడం ఎవరి తరమూ కాదు. 
'నిన్న ఆసుపత్రికి వెళ్లొచ్చారు కదా! ఇవాళ కూడా అక్కడికే వెళ్లారేమో!' అని అనుమానం వెలిబుచ్చింది శ్రీమతి. 
ఆసుపత్రిలో విచారించినా ఫలితం లేకపోయింది. మందుల దుకాణం దార్లో ఉన్న తెలిసిన వాళ్ల ఇళ్లల్లోనూ విచారించాను. ఏదైనా యాక్సిడెంటు లాంటిది జరిగితే తెలుస్తుందని ఆశ. ఎవరి దగ్గరా ఏ సమాచరమూ లేదు. 
'ఇంకో గంట ఆగి చూద్దాం. చీకటి పడితే బాబాయి బైట ఉండలేడు. రేజీకటి సమస్య. ఎంత అర్జంటు పనున్నా దీపాలు పెట్టే వేళకు ఇల్లు చేరాల్సిందే! నీకూ తెల్సు కదా?' అన్నా జానకితో. 
దీపాలు పెట్టే వేళా దాటిపోయింది. బాబాయి జాడ లేదు! పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడం తప్ప మరో మార్గం లేదు. 
కంప్లైంట్ బుక్ చేసుకునే  స్టేషన్లోని వ్యక్తి ఒకటే గొణుకుడు 'పసిపిల్లలంటే తెలీక దారి తప్పుతారు. వయసులో ఉన్న ఆడపిల్లలంటే అదో లెక్క. కాటిక్కాళ్లు చాచుకున్న తాతలు కూడా ఇట్లా మిస్సయిపోతుంటే ఇహ మా పని గోవిందే!' ఇట్లా సాగాయి ఆయనగారి  సెటైర్లు. 
బాబాయి వివరాలు, మా చిరునామా అయిష్టంగానే తీసుకున్నాడు, 'విషయమేదన్నా ఉంటే కబురుచేస్తాం. మీ ప్రయత్నంలో మీరుండాలి' అని పంపించేశాడు చివరికి.
సభ్యత కాదని తెలిసినా చివరికి బాబాయి బ్యాగ్ ఓపెన్ చేసి చూశాం. స్పేర్ కళ్లజోడు సెట్టు, నాలుగు జతల పంచెలు, జుబ్బాలు, మందుల పెట్టె,చలంగారి 'బిడ్డల శిక్షణ' పుస్తకం కనిపించాయి. పిల్లల పెంపకం బాబాయి అభిమాన అంశం. పథకం ప్రకారం ఇల్లొదిలి పోలేదన్న విషయం స్పష్టమయినందున కొంత రిలీఫ్ ఇచ్చినా, మందుల పెట్టె చూసే సరికి దిగులు రెట్టింపయింది. 
బాబాయికి అస్త్మా, బిపి, షుగర్! వేళకు మందులు పడాల్సిన జబ్బులే ఇవన్నీ!  ఉదయం నుండి ఈదురుగాలిగా ఉంది. ఆకాశం మబ్బుగా ఉంది.ఎప్పుడు పడుతుందో వర్షం అన్నట్లుగా ఉంది వాతావరణం.   
చలిలో, చీకట్లో రేజీకటి మనిషి కొత్త ఊర్లో కొత్తగా సంక్రమించిన గ్లాకోమా వ్యాధితో పాటు గట్టిగా నాలుగడుగులు వేసినా ఆయాసం ముంచుకొచ్చే'ఉబ్బసం' రోగంతో  ఇంత సేపు బైట ఏం చేస్తున్నట్లు?ఎక్కడున్నట్లు?ఎక్కడున్నా కాస్త సమాచారం అందించవచ్చు కదా!
నా చిరాకు, అసహనం చూసి సముదాయించే పనిలో పడింది జానకి. 'పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాం గదా! తెల్లారేలోగా ఏదో ఓ సమాచారం తెలుస్తుంది లెండి' అంటూ. 
తెల్లార్లూ కళ్లు గుమ్మానికి, చెవులు ఫోన్లకు అర్పించి నట్లింటో నిరాహారంగా జాగారం చేసినా ప్రయోజనం శూన్యం. రాత్రి కురిసిన కుండపోతకు మా స్పిరిట్స్ అన్నీ డౌన్ అయిపోయాయి. 
బ్యాడ్ న్యూస్ వినడానికే పూర్తిగా సిద్ధమయిపోయి  కూర్చున్నాం ఇద్దరం. బ్యాంకు డ్యూటీకి వెళ్లబుద్ధి కాలేదు. సెలవు పెట్టేసి వేటపాలెంలోని  నా బాల్యమిత్రుడు శాయికి ఫోన్ చేసి వివరాలు అవీ  చెప్పి 'ఒకసారి బాబాయి ఇంటికి వెళ్లి చూసి ఇన్ ఫామ్ చెయ్యరా!' అనడిగాను. 
పది నిమిషాలల్లో వాడి దగ్గర నుంచి రిటన్ కాల్..  'ఇంటికి తాళమేసుంద'ని. 
ఏడుపు ఆపుకోవడం ఇక నా వల్ల కాలేదు. చిన్నప్పట్నుంచి బాబాయంటే చాలా ఇష్టం. 
మా నాన్నగారు మహాస్ట్రిక్ట్. లెకల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని రోజంతా అన్నం పెట్టద్దని అమ్మకు హుకుం జారీచేశారొకసారి. అమ్మ నన్ను  బాబాయి దగ్గరకు పంపించింది రహస్యంగా. పిన్ని బైట ఉన్నా నాకు ఇష్టమని ఆలుగడ్డ కూర స్వయంగా చేసి, తినిపించి చీకటి పడే లోపు  మా ఇంట్లో దించిపోయాడు. 'మళ్లీ వచ్చే పరీక్షల్లో వంద శాతం మార్కులు తెచ్చుకుంటానని నా చేత ప్రమాణం చేయించి నాన్నగారి కోపాన్ని చల్లార్చింది బాబాయే! ఆ పరీక్షల్లో నేను మాట నిలబెట్టుకోవాలని రోజూ ఇంటికొచ్చి నా చేత గణితంలో అభ్యాసం చేయించాడాయన ఎన్ని పని వత్తిళ్లున్నా. . 
బాబాయివాళ్లకు బాబూరావని నా ఈడు కొడుకు ఒకడుండేవాడు. చదువు సంధ్యలు అబ్బక జులాయిలా తిరుగుతున్నా వాడిని ఏమీ  అనేవాడు కాదు బాబాయ్. బిడ్డల చేత ఇష్టం లేని పనిచేయించ కూడదన్న చలంగారి సిద్ధాంతం ఆయనది. పదో తరగతిలో వాడు ఇంట్లో దొరికింది లంకించుకుని చెన్నయ్ పారిపోయాడు. ఎంత వెదికించినా లాభం లేకపోయింది. మూడు రోజుల తరువాత వాడి బాడీ దొరికిందని చెన్నయ్ నుంచి కబురు!  దేశం కాని దేశంలొ భాషే రాని ప్రాంతంలో వాడి ఘోష పట్టించుకునే నాథుడు దొరక్క నడుస్తున్న  ఎలక్ట్రిక్ ట్రైన్  ముందు ఉరికేశాట్ట! 
ఉన్న ఒక్క కొడుకు అట్లా దక్కకుండా పోయినప్పట్నుంచి బాబాయి మరీ చాదస్తంగా తయారయ్యాడు. పిన్నయితే కొడుకు మీద దిగులుతోనే పోయిందంటారు. 
ప్రస్తుతం బాబాయి ఏకాకి. సహజంగా  మొండి మనిషి కనక వేటపాలెం విచిడిపెట్టి వచ్చేందుకు  'ససేమిరా' అన్నాడు.  వచ్చింది గ్లాకోమా కనక, పెద్ద డాక్టర్లకు చూపించడం తక్షణావసరం కనక హైదరాబాద్ తరలి వచ్చాడు ఎట్లాగో. 
నిన్ననే ఆసుపత్రిలో  చూపించాను. పంజగుట్టలోని విజన్ ఫీల్డ్ సెంటర్లో టెస్టులూ అవీ చేయిచుకుని రిపోర్టులు పట్టుకు రమ్మనాడు డాక్టర్. ఈ రోజు బ్యాంక్ నుంచి రాగానే అక్కడకు పోవాలని ప్లాన్. ఇంతలో ఇలాగయింది!
'బాబాయిని ఇక్కడకు పిలిపించి పొరపాటు చేశానా? వేటపాలెంలోనే ఉండుంటే ఆయన తిప్పలేవో ఆయన పడుతుండేవాడు'. ఇదీ నా గిల్ట్ ఫీలింగ్ రాత్రి నుంచి.
'ఇలాగవుతుందని మనమేమైనా కలగన్నామా? కడుపున పుట్టిన బిడ్డలే పట్టించుకోని ఈ రోజుల్లో బాబాయి అనే  అభిమానం కొద్దీ ఏదో సాయం చేద్దామని  పిలిపించుకున్నారు. అయినా బైటికెళ్లిన మనిషి అట్నుంచటే వెళ్లిపోవడమేనా? మరీ అంత ముంచుకుపోయే పని ఉంటే ఇంటికొచ్చి చెప్పిపోవాలి. లేదా కబురన్నా చేయాలి. ఇదేం మనిషి? ఇవతల మనమెంత కంగారు పడతామో చుసుకోవద్దా?' అని నన్ను ఊరడించబోతూ బాబాయిని ఝాడించడం మొదలుపెట్టింది నా భార్య. 
తనకూ బాబాయంటే తగని అభిమానమే. నిన్నటి నుంచి పడుతున్న యాతన అట్లా అనిపిస్తోంది. ఇప్పుడు ఎవర్ననుకుని ఏం లాభం? బాబాయిని ఇట్లా మాయం చేసిన ఆ మహానుభావుడే ఈ మిస్టరీని విడదీయాలి. పోలీసుల వల్ల ఏమీ కాలేదు లాగుంది.. కబురు లేదు!
మధ్యాహ్నం సమయంలో నా సెల్ ఫోన్ మోగింది. 'రామచంద్రంగారేనాండీ?' ఎవరిదో అపరిచితమైన గొంతు. 
'అవును. మీరెవరూ?'
'మాది నరసారావుపేట  దగ్గర మురికిపూడి అండీ! సుబ్రహ్మణ్యంగారు మీ బాబాయేనాండీ?'
'అవునవును. నిన్నటి నుంచి ఆయన  ఆచూకీ  తెలియడంలేదు. మీకేమైనా తెలుసాండీ?' నా గుండెలు దడదడకొట్టుకుంటున్నాయి. 
'కంగారు పడకండి సార్! ఆయన ఇక్కడే ఉన్నారు!'
'ఇక్కడంటే? మురికిపూడిలోనా?!  అంత దూఆం ఎందుకెళ్లాడసలు? ఏం చేస్తున్నాడక్కడ? బాగానే ఉన్నాడా?' నాకంతా అయోమయంగా ఉంది. 
'బాగానే ఉన్నారు. ఆందోళన పడాల్సిందేంలేదు. ఇప్పుడే తెల్సింది ఆయన ఇట్లా మీ బాబాయిగారని. అందుకే ఫోన్ చేస్తోంది'
'ముందొకసారి  ఆయనకు ఫోనివ్వండి. మాట్లాడాలి’ కంగారుగా అడిగాను. 
'ఇస్తా గానీ.. ముందు నా మాట కాస్తాలకించండి సార్! తెల్లారుఝామున వచ్చారిక్కడికి. వచ్చీ రాగానే సొమ్మసిల్లిపోయారు.  మా ఊళ్లో మంచి డాక్టరు లేడండీ! పేట నుంచి డాక్టర్ని తెచ్చేసరికి ఈ ఝామయింది. ఇప్పుడు నయంగానే ఉంది'
'ముందు మీరెక్కడున్నారో చెప్పండి! వెంటనే బైలుదేరి వచ్చేస్తా!' అని ఫోనులోనే అరిచేశాను ఉద్వేగాన్నాపుకోలేక. 
ఒక్క నిముషం నిశ్శబ్దం తరువాత బాబాయి లైనులోకి వచ్చాడు 'నువ్వేం రానక్కర్లేదు గానీ.. ముందొక పని చెయ్యరా! మీ వీధి చివర మందుల షాపుంది కదా! దాని ఫోను నెంబరొకసారి కనుక్కొనివ్వు ఒక అయిదునిమిషాల్లో! నువ్వేం రావద్దు. మేమే ఓ గంటలో బైలుదేరి వస్తున్నాం. మీ ఇంటి వివరాలు అవీ ఈయనకు చెప్పు!' అన్నాడు. 
మందుల షాపు నెంబరు, మా ఇంటి అడ్రసు కనుక్కొని 'రాత్రి ఏ టైముకైనా సరే  మీ బాబాయిగారిని మీ ఇంట్లో దించుతాం.. 'అని ఫోన్ కట్ చేశాడు అవతలి మురికిపూడి పెద్దమనిషి.  
బాబాయి యొగక్షేమాలు తెలిసినందుకు ఆనందంగా ఉంది. క్షేమంగా ఉన్నందుకు రెట్టింపు రిలీఫుగానూ ఉంది. ఎక్కడి హైదరాబాదు? ఎక్కడి మురికిపూడి? మందులకని బైటికెళ్లిన బాబాయి అన్నొందల కిలోమీటర్లవతల తేలడమేమిటి? మధ్యలో ఈ మందుల షాపు నెంబరెందుకు? 
బాబాయిని దించడానికని వచ్చిన పెద్దమనిషి చెప్పిన వివరాలు తెలుగు చలనచిత్ర  కథలను మించి విచిత్రంగా ఉన్నాయి. బాబాయీ ఆయనా కలిపి వినిపించిన కథ. సారాంశం  వింటే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే! 
మందులకని బాబాయి దుకాణానికి వెళ్లినప్పుడు ఎవరో పదేళ్ల పిల్లగాడు పొట్ట పిసుక్కుంటూ నిలబడున్నాడుట దుకాణం ముందు! పక్కనే కాకా హోటలుంది. ఆకలికి ఏమైన ఏమైనా పెట్టించమని అడుగుతున్నాడేమో అనుకుని బాబాయే ఏదో టిఫిన్ పెట్టించబోయాట్ట. 
'వాడి ప్రాబ్లమ్ లోడింగ్ కాదండీ! అన్ లోడింగ్! ఎక్కడ్నించొచ్చాడో.. ఎందుకొచ్చాడో!.. తెల్లారుఝామున పాక వెనకాల కూర్చోబొతుంటే పిండి రుబ్బుకునే  మా ఆడంగులు  పట్టుకున్నార్ట సార్! ఇట్లాంటి ఛండాలాలు ఇక్కడ చూస్తే ..సిటీ  కదా.. వ్యావారాలు నడుస్తాయా? మరీ మీ కంత దయగా ఉంటే ముందు మీ ఇంటికి తీసుకెళ్లి  వాడి కడుపుబ్బరం తీర్చండి!'అన్నాట్ట హోటలాయన  వెటకారంగా.
బాబాయి ముందు వాణ్ణి మా యింటికే తెద్దామనుకున్నాట్ట. వాడి బాధేందో తీర్చి .. ఎవరి పిల్లాడో కనుక్కుని.. ఎక్కడి నుంచొచ్చాడో విషయం రాబట్టి.. వాణ్ణి వాడింటికి చేర్చాలని బాబాయి తాపత్రయం! 
కొడుకు దిక్కులేని చావు చచ్చిపోయినప్పటి నుంచి దిక్కులేని ఏ పిల్లాడిని చూసినా తన కొడుకే గుర్తుకొస్తుండేవాడు బాబాయికి. మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నా కారాపినప్పుడు అడుక్కునే పిల్లలకు తలా ఇరవై  దానం చేశాడు.  అంత డబ్బు  పిల్లల చేతుల్లో పోయడం పరోక్షంగా సోమరితనాన్ని మరింత ఎంకరేజ్ చెయ్యడమే'నని నా అభిప్రాయం. 'మీరు తాగి పడేసే సిగిరెట్లకూ,మందు బుడ్లకూ అయ్యే దుబారానో? ఒకట్లో  అర్ధం  శాతం కూడా అవదురా ఈ ఖర్చు' అని పెద్ద ఉపన్యాసమే దంచాడారోజీ  బాబాయి.  లోకానికి చాదస్తంగా కనిపించేది కూడా  అదే!
ఆయన చాదస్తం,  స్పీచులు మాకు అలవాటే గాని, బయట వాళ్లు ఎందుకు ఊరుకుంటారు?! మెడికల్ షాప్ ముందున్న కుర్రాడిని బలవంతంగా ఆపి బాబాయి వివరాలు రాబట్టే పనిలో  ఉంటే.. షాప్ ఓనర్  'పోనీయండి మాష్టారూ! మన కెందుకొచ్చిన పీడాకారం! ఎక్కడివాడో? ఎందుకిక్కడ తిరుగుతున్నాడో? ఏదైనా గొడవైతే చివరికి మనకు చుట్టుకుంటుంది. మన పనులు మానుకుని పోలీసులు, కోర్టుల చుట్టూతా  తిరగాల్సొస్తుంది' అన్నాట్ట. దాంతో బాబాయి ఉగ్రుడయిపోయాట్ట. 
'అట్లా ఎట్లా వదిలేస్తామండీ! ఈ పిల్లాడి ఇంట్లోవాళ్లు ఎంత కంగారు పడుతుంటారు? అదే మీ పిల్లాడయితే వదిలేస్తారా? మానవ  సమాజంలో బతుకుతున్నాం మనం. ప్రతి మనిషికీ కొన్ని బాధ్యతలున్నాయి. వట్టి హక్కుల కోసమే గోల పెడితే ఎట్లా?' అని ఉపన్యాసం దంచేసరికి షాపాయన హర్ట్ అయ్యాట్ట, 'నీతులు చెప్పేవాళ్లు తక్కువయి కాదు లోకం ఇట్లా ఏడ్చింది. నాకు చెప్పడం కాదు.. మీరు చేసి చూపించండి ముందు!' అని ఛాలెంజికి దిగాట్ట. మాటా మాటా పెరిగింది ఇద్దరి మధ్యా. 
'మెడికల్ షాపాయన అన్నాడని కాదుగానీ.. ఎట్లాగైనా ఈ పిల్లాడి వాళ్లింట్లో చేర్చాలనిపించిందిరా. వీడి వివరాలు రాబట్టటమే బ్రహ్మప్రళయమైంది. పెద్ద బస్టాండులో ముందు వీడి 'కడుపు'ఇబ్బంది  తీర్చి ఇంత పెట్టించడం దగ్గర్నుంచి.. బస్సులో అంత దూరం కట్టేసినట్లు కూర్చోబెట్టడం దాకా నా తాతల్ని మళ్ళీ నాకు చూపించాడురా ఈ భడవా. ఎట్లాగూ మెడికల్ షాపులో నా కోసమని  కొనుక్కున్న నిద్రమాత్రలు ఉన్నాయిగా! ఓ గోళీ తగిలించా!' అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. 
'అది సరే బాబాయ్! ఇట్లా వెళుతున్నానని ఇంటికి ఒక ఫోన్ కాల్ చేసైనా చెప్పాలి కదా! ఇంట్లో నేనూ, జానకీ నిన్నట్నుంచి ఎంతలా కంగారు పడుతున్నామో తెలుసా?' అని బాబాయి మీద గయ్యిఁ మన్నాను కోపం పట్టలేక. 
'సాగర్ బస్టాండ్ లో నీ నంబరుకి కాల్ చేయించానురా! ఎంత సేపటికీ ఎత్తకపోతివి.. నేనేం చెయ్యాలీ!' అని ఎదురు ప్రశ్నించాదు బాబాయి. 
'మీరు చేసిన నెంబరు రాంగ్ సార్! ఆ నెంబరుకు కాల్ చేస్తే నాకూ ఎవరూ ఎత్తలేదు. మా బుడ్డోడి అయిడియాతో ఈ నెంబరు చివరి మూడుకు బదులు ఎనిమిది కలిపి చేస్తే రామచంద్రంగారి నెంబరు కలిసింది' అన్నాడు మురికిపూడి పెద్దాయన. ఇక్కడి కొచ్చిన తరువాత  బాబాయి నా నెంబర్ తన  కొత్త   ఫోన్ బుక్కులో  చివరి నెంబరు తప్పు రాసుకున్నాడు. చూపు సమస్య వల్ల! 
అదే చెబితే 'అవునా!' అంటూ  ఆశ్చర్యపోయాడు బాబాయి.  తెప్పరిల్లి మురికిపూడి పెద్దాయనతో 'ఏ మాటకు ఆ మాటేనయ్యా! మీ బుడ్డోడిది మాత్రం ప్రహ్లాదుడి బుద్ధి. ఇట్లాంటి పిల్లల్ను చదువులోనే పెట్టాలి. బడికి పోతానంటే గొడ్డులా బాదడమేంటి! నీ దెబ్బలకు తాళలేకే ఇంటి నుంచి వీడు  పారిపోయింది. పిల్లాడు   ఏదన్నా చేసుకోనుంటే.. జీవితాంతం అఘోరించేవాడివి..' బాబాయి కళ్లల్లో నీళ్లు! బాబూరావు గుర్తుకొచ్చి ఉంటాడు.. పాపం!
' బ్యాంకు లోను పెడితే గాని బడ్డీ కొట్టయినా నడపలేని దరిద్రుడిని. వేలూ లక్షలూ పోసే చదువులు నా వల్లయే పనేనా సారూ?! స్థితి అర్థం చేసుకోడు.. రోజూ బడి కోసం మొండికేస్తుంటే ప్రాణం విసిగి రెండు తగిలించా!   నా లాంటి బక్కాడి  కొంపలో పడ్డం వాడిదే తప్పు!..'  అన్నాడు గాని.. మురికిపూడి పెద్దాయన గొంతులో పశ్చాత్తాపం  స్పష్టంగా కనిపిస్తోందిప్పుడు. 
పోతూ పోతూ బిడ్డను ఊరి దాకా తెచ్చి భద్రంగా  అప్పగించినందుకు బాబాయి చేతిలో ‘ఇంతకు మించి ఇచ్చుకోలేనం’టూ  ఓ రెండువేలు పెట్టబోయాడు మురికిపేట పెద్దాయన. బాబాయి తీసుకోలేదు. 'ముందు ఈ డబ్బు పెట్టి పిల్లాడిని ఏదన్నా మంచి బళ్ళో వెయ్యి! ముందు ముందు దారేదో దొరక్కపోదు!' అన్నాడు. 
బాబాయి మాట ఆ గంటలోనే  నిజమయింది. మురికిపూడి నుంచి బాబాయి బిడ్డ తండ్రి చేత చేయించిన  ఫోన్ కాల్ కు మెడికల్ షాపాయనలోని మానవత్వం నిద్రలేచింది.  బుడ్డోడి తండ్రి ఇట్లా వచ్చాడని తెలిసి మా ఇల్లు వెదుక్కుంటు వచ్చాడాయన. 'పిల్లోడి కథంతా విని 'నాకు ఎట్లాగూ  పిల్లలు లేరు. మీ వాడిని పదో తరగతి వరకు చదివించే పూచీ నాదీ' అంటు అక్కడికక్కడే వాగ్దానం చేశాడు. 
ఇప్పుడు చెప్పండి! ఇదంతా నిజంగా ఒక సినిమా కథలాగా లేదూ! 'పిల్లాడి తండ్రిని  పిలిపిస్తే పోదా! ఈ వయసులో నువ్వు అంత దూరం వెళ్లి అప్పగింతలు పెట్టిరావాలా?' అని  నువ్వు ఫోనులో నిలదీశావు చూడురామచంద్రం! నేను  అంతలా శ్రమపడ్డందుకేరా  ఈ మెడికల్ షాపాయన మనసులోని మానవత్వం నిద్రలేచింది. నీతులు చెప్పేవాళ్లు తప్ప చేతల్లో చూపించేవాళ్లు లోకంలో ఎవ్వరూ ఉండరని ఈ షాపాయన ఇప్పటి వరకు గట్టి విశ్వాసంతో ఉన్నాడు. మానవత్వం మీద నమ్మకం పోగొట్టుకునే మనుషులకు మించి సమాజానికి మరో పెద్ద ప్రమాదం లేదు. ఈ రోజూ నేను కష్టపడితే పడ్డాను గానీ.. సమాజం ఒక మనిషిని పోగొట్టుకోకుండా కాపాడగలిగాను. అదే నాకు ఆనందం' అన్నాడు బాబాయి తృప్తిగా. 
 
బాబాయికి తెలియని సంగతి మరొకటి ఉంది. సమాజం మరో మనిషిని కూడా పోగొట్టుకోకుండా  నిలబెట్టుకుంది. మొదటినుంచి బాబాయి అత్యుత్సాహాన్ని చాదస్తంగా  కొట్టిపారేస్తూ వస్తోన్న నేనే ఆ మరో మనిషిని.
***

 విపుల మాసపత్రిక - జనవరి 2015లో ప్రచురితం)

No comments:

Post a Comment