పేదల పెన్నిది సంజీవయ్య
దామోదరం సంజీవయ్య జయంతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. రాష్ట్ర ముఖ్యమంత్రి కారు.. ఓ మారుమూల పల్లెలో పొలం గట్ల మీద నుంచి వెడుతోంది. ఆ పక్కనే నెత్తిన గడ్డిమోపుతో ఒక వృద్ధురాలు నడుచుకుంటూ పోతున్నది. ఒక్కసారిగా ఆ రాష్ట్రాధినేత చూపు ఆమెపై పడింది. తనను నవ మాసాలు మోసి ఇంతవాడిని చేసి, అతి సాధారణంగా సాగుతున్న ఆ తల్లిని గుర్తించి ముఖ్యమంత్రి కారు ఆపి ఆమెను ఎక్కమని బతిమలాడాడు. కారులో కన్నా కాలినడకే తనకు తగినదని ఆ తల్లి సున్నితంగా నిరాకరించింది. దాంతో ఆయన తాను కూడా కారు విడిచి కాలినడకనే అనుసరించాడు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జీవితంలో వాస్తవ ఘటన ఇది. కొడుకు రాష్ట్రానికే అధినేత అయినా, సాధారణ జీవితానికి విలువనిచ్చింది ఆ తల్లి. కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ మాతృమూర్తి వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఆయన కూడా ఆ నిరాడంబరతనే పుణికి పుచ్చుకున్నాడు. అందుకే ఆ బిడ్డ జాతిరత్నంగా నిలిచిపోయాడు. పదవులకే వన్నె తెచ్చాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామంలో సుంకులమ్మ, మునిదాసు దంపతులకు 1921 ఫిబ్రవరి 14న సంజీవయ్య జన్మించారు. తండ్రి మరణంతో మేనమామ ఇంట పెరిగారు. పెద్దపాడులో ఐదవ తరగతి వరకు చదువుకొని హైస్కూల్ చదువు కోసం ప్రతి రోజు కాలినడకన కర్నూలుకు వెళ్లేవారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చేరి 1942లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై విధి నిర్వహణలో మేటిగా పేరు పొందారు. మద్రాసు వెళ్లి న్యాయశాస్త్రం అభ్యసించారు. సీనియర్ న్యాయవాదులైన గణపతి, జాస్తి సీతామహాలక్ష్మమ్మ వద్ద జూనియర్ న్యాయవాదిగా పని చేశారు. సంజీవయ్య చురుకుదనం, చొరవను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకువచ్చింది.
1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రొవిన్షియల్ సభ్యునిగా నియమితులయ్యారు. ఇదే సందర్భంలో ‘హోం విభాగ సభ్యుని’గా ఆయన సమర్థవంతంగా వ్యవహరించారు. 1952లో మద్రాస్ అసెంబ్లీకి కర్నూలు రిజర్వుడు నియోజకవర్గం నుండి గెలుపొంది చిన్న వయసులోనే రాజాజీ కేబినెట్‌లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1954 మే 7న సికింద్రాబాద్‌కు చెందిన బుచ్చయ్య కూతురు కృష్ణవేణమ్మను కులాంతర వివాహం చేసుకొని అభ్యుదయ భావాలకు ఆనాడే బీజం వేశారు. 1955 ఆంధ్ర రాష్ట్ర మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మిగనూరు–కోడుమూరు ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రిజర్వుడు స్థానం నుండి దామోదరం సంజీవయ్య గెలుపొందారు. బెజవాడ గోపాల్‌రెడ్డి మంత్రివర్గంలో రవాణా, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గ సహచరుడుగా పనిచేశారు.
1960 జనవరి 11న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే నాటికి ఆయన వయస్సు కేవలం 38 ఏళ్లు. 1962 మార్చి 29 వరకు ఆయన పాలన కొనసాగింది. ముఖ్యమంత్రిగా సంజీవయ్య అనేక విప్లవాత్మక విధాన నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమంతో ప్రజలకు చేరువయ్యారు. భూసంస్కరణలు అమలుచేసి, ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను భూమిలేని వ్యవసాయ కూలీలకు పంచిపెట్టారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టుకు, కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పేరు నేడు ‘సంజీవయ్య సాగర్’గా ప్రసిద్ధికెక్కింది. గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు మొదటి శంకుస్థాపన చేసింది సంజీవయ్యే.
ప్రాజెక్టుల స్థాపనే కాకుండా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలుపరిచారు. రిజర్వేషన్ల శాతాన్ని ఎస్సీ, ఎస్టీలకు 14 నుంచి 17 శాతానికి, బలహీన వర్గాలకు 24 నుంచి 38 శాతానికి పెంచారు. వృద్ధాప్య పింఛన్లు, కార్మికులకు బోనస్ ఇచ్చే పద్ధతికి శ్రీకారం చుట్టారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని ఉత్తర్వులు జారీ చేశారు. ‘లా’ కమిషన్‌ను, లిడ్ క్యాప్, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్, భూగర్భ గనుల సంస్థలను నెలకొల్పారు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి చేయూతనిచ్చే ప్రత్యేక ఆర్థిక సహకార సంస్థలను ఏర్పాటు చేశారు. దళిత విద్యార్థులకు ఉపకార వేతనాలను, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు.
సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆయనంటే గిట్టనివారు ప్రధాని నెహ్రుకి అనేక ఫిర్యాదులు చేశారు. నిజానిజాలను తేల్చేందుకు నెహ్రూ అప్పటి హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పర్మార్‌ను పంపిచారు. పర్మార్‌తో పాటు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా పనిచేసిన) చక్రపాణి కూడా సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును సందర్శించారు. వారు ప్రయాణిస్తున్న కారు ఓ పూరింటి ముందు ఆగింది. దాన్ని చూసి ఇక్కడెందుకు ఆపారు, మనం వెళ్లాల్సింది సంజీవయ్య ఇంటికి కదా! అని పర్మార్ అడిగారట. అప్పుడు చక్రపాణి ఇదే సంజీవయ్య ఇల్లు అని చెప్పడంతో పర్మార్ ఆశ్చర్యపోయారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే వృద్ధురాలయిన సంజీవయ్య తల్లి సుంకులమ్మ చిరిగిన ముతక గుడ్డలతో కట్టె పొయ్యి దగ్గర వంట చేస్తూ కనిపించారు. ఈ దృశ్యం చూసి పర్మార్ చలించిపోయి వెంటనే తిరుగు ప్రయాణమయ్యారట. ఇది సంజీవయ్య నిజాయితీకి నిలువుటద్దం.
సంజీవయ్య 1972 మే 7న అనారోగ్యంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ అధికార నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సంపద లేకుండా ‘సంతతి’ లేకుండా జీవించిన అతి కొద్ది మంది రాజకీయవేత్తలలో సంజీవయ్య ఒకరు.
No comments:
Post a Comment