"మొదట ఉన్నది వేద మతమే- 1931లో కంచి మహాస్వామి వారి ఉపన్యాసం"
🌹మెక్సికో దేశంలో దసరా పండుగ పేరు "రామసీత"
🌹ఆస్ట్రేలియాలో "శివనాట్యం".
🌹 కాలిఫోర్నియా కపిలారణ్యమా?
ఒకానొకప్పుడు మొత్తం ప్రపంచానికి మనది ఒక్కటే మతం. దానికి అనేక ఆధారాలున్నవి. ఈజిప్టులో క్రీ.పూ. 1280 సంవత్సరం నాటి (ఇప్పటికి 3220 సం. అయినది) శాసనం ఒకటి కనుగొన్నారు. అందులో "రెండవ రామేశస్ కూ, హిట్టెటసకూ మధ్య జరిగిన సంధి షరతులు పేర్కొనబడ్డాయి. ఈ సంధిలో 'మైత్రావరుణ' అనే వేదంలోని దేవతను సాక్షిగా ఉదహరించారు" (H.R.హాల్ వ్రాసిన Ancient history of the near East -364 పుట). ఇదిగాక ఈజిప్టు రాజవంశంలో 1వ రామేశస్, 2వ రామేశస్, 3వ రామేశస్ అంటూ "రామ" శబ్ధానికి సంబంధించిన రాజుల పేర్లు ఎన్నో ఉన్నాయి!
దక్షిణాఫ్రికా తూర్పుతీరాన మెడగాస్కర్ ద్వీపంలోని స్ధలాల పేర్లు 75% సంస్కృత భాషకు చెందినవే. వాటిలో చాలా భాగం రామాయణ కథానాయకుడైన శ్రీరాముని పేరుతో సంబంధం కలవి.
"సాగర - సహార" :-- ఉత్తర ఆఫ్రికాలోని 'సహార డిసర్ట్' అనే పేరుతో గొప్ప ఎడారి ఉన్నదని మనకందరికీ తెలుసు. ఎడారులన్నీ ఒకప్పుడు సముద్రాలనే సిద్ధాంతం ఉన్నది. 'సాగర' అనే సంస్కృత శబ్దం భ్రష్టమై 'సహార' కావడం అసంభవం కాదు! సహార ప్రదేశం జలమయమై ఉన్నప్పుడు దానిచుట్టూ ఉన్న భూమి జనావాసంగా ఉండేదని, అక్కడి ప్రజల పేర్లు సంస్కృత భాషకు సంబంధించినవేగాక, రామ శబ్దంతో కూడా జతపడి ఉండేవని చెప్పబడుతుంది. (ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా, 13వ సంపుటం, శీర్షిక- సహారా)
మన భూగోళంలో అవతలి దిక్కున ఇట్టి సాక్షాధారాలు కోకొల్లలు! మనకెంతో దూరంగా ఉన్న మెక్సికోలో ఇంచుమించు మన దసరా పండుగ సమయంలోనే, ఆ దేశస్థులు ఒక పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ పేరు "రామసీత" (T.W.యఫ్గాన్ రచించిన "Maya Indians of Southern Yucaton, North and British Honduras" -24 పుట)
ఇదొక్కటే కాదు. మెక్సికో దేశంలో జరిగిన తవ్వకాలలో ఎన్నో "గణేశ" విగ్రహాలు బయటపడ్డాయి (బేరన్ హోమ్ బోల్ట్ రాసిన ఈ విషయాన్ని హరవిలాస్ శారదా "హిందూ సుపీరియారిటీ" అనే గ్రంధంలో ఉదహరించారు). ప్రాచీనకాలంలో ఆ దేశంలో నివసించిన ప్రజల పేరు Astikas (ఆస్తికులు) అనగా వేద పారాయణంలో నమ్మకం కలవారు. ఆ తెగకు చెందిన వారి పేరు ఈనాడు "అజ్ టెక్స్".
దక్షిణ అమెరికాలోని "పెరూ" దేశంలోని ప్రజలు సూర్యుని ఆరాధించేవారు! వారిని "ఇన్ కాస్" అని పిలిచేవారు. 'ఇన' అనేది సంస్కృతంలో సూర్యునికి పర్యాయపదం. వారి ముఖ్యమైన పండుగలు అయనాంతంలో జరుగుతాయి (ఏషియాటిక్ రిసెర్చెస్ 1వ సంపుటం, 426 పుట)
కాలిఫోర్నియా కపిలారణ్యమా? :- కాలిఫోర్నియాలోని అనేక ప్రదేశాల పేర్లకూ, మన పురాణాలలోని పేర్లకు పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి! కపిలముని శాపం వల్ల 60 వేలమంది సగరచక్రవర్తి కుమారులు దగ్ధమై, బూడిద అయ్యారనే కధ సుప్రసిద్ధం! వారి ఆత్మలను కాపాడేందుకు వారి వంశీయుడైన భగీరధుడు గంగను ఆకాశం నుండి భూమికి కొనివచ్చాడని పురాణగాధ.
సగరుని కుమారులు వెతుకుతూ వెళ్ళిన గుర్రం పాతాళలోకంలో (Netherland) కనిపించిందని మన పురాణం చెబుతుంది. అమెరికా, భారతదేశాలు భూగోళం మీద ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నవి. కాలిఫోర్నియా అన్నది 'కపిలారణ్యం' అనే దానికి భ్రష్టరూపమే. దానికి కొద్ది దూరంలో ఉన్నవి "The Horse Island (హయ అనగా గుర్రం ద్వీపము), The Ash Island (భస్మ ద్వీపము) అనేవి. Horse Island సగర చక్రవర్తి గుర్రం పట్టుబడిన ప్రదేశమూ, Ash Island సగరుని 60 వేలమంది కుమారులు శాపవశాన భస్మంగా మారిన స్ధలమూ అనుకోవడం కూడా ఊహకు మించిన విషయం కాదు!
"ఆస్ట్రేలియాలో శివనాట్యం" :- స్పెన్సర్, గిలెన్ అనే ఇద్దరు 1899 సం.లో రాసిన 'Native Tribes of Central Asia' అనే పుస్తకం 621వ పుటలో ఆటవిక జాతుల నాట్యాలు చిత్రీకరించారు. ఆ నాట్యాలలో ఒకటి "The Siva Dance (శివనాట్యం)". జాగ్రత్తగా పరిశీలిస్తే నాట్యం చేస్తున్న ఆ ఆటవికుల ముఖాలపై మూడవ నేత్రం చిత్రించబడ్డట్టు కనిపిస్తుంది! ఆస్ట్రేలియా వంటి దూరదేశంలో సైతం ఆనాటి ప్రజలకు వైదిక సంస్కృతితో సంబంధం ఉండేదని దీనినిబట్టి తెలుస్తుంది!
జావా, బోర్నియా వంటి దేశాల సంగతి ఇక అడగవలసిన పనే లేదు. ఆ దేశాల్లో హిందూ సంస్కృతికి సంబంధించిన నిదర్శనాలు లెక్కలేనన్ని ఉన్నాయి! హిందూ సంస్కారాలకు, హిందువుల పూజా పురస్కారాలకు తార్కాణాలుగా చెప్పదగినవి జావాలో కావలసినన్ని. బోర్నియాలో మానవులు ఎన్నడూ అడుగుపెట్టని ఒక అరణ్యం ఉన్నట్టు చాలాకాలంగా పాశ్చాత్య రచయితలు వ్రాస్తూ వచ్చారు (వాలస్ వ్రాసిన "The Malay Archipelago). ఆ తర్వాత ఒక పరిశోధక బృందం ఆ అడవిలో ప్రవేశించి కొన్ని వందల మైళ్ళు ప్రయాణించగా, వారికొక శిలాశాసనం దొరికింది. దానిపైన ఒక రాజు కొన్ని యజ్ఞయాగాదులు చేసినట్టు వ్రాయబడింది (Yupa Inscriptions of Mulavarman of Koeti, Borneo). ఒకానొకప్పుడు మన మతం ఒక్కటే ప్రపంచ వ్యాప్తంగా ఉండేది అనడానికి పైన చెప్పినవన్నీ తార్కాణాలు.
భూమి గుండ్రంగా ఉన్నదని ప్రథమంగా పాశ్చాత్యులే మనకు తెలియచేశారని మనం భావిస్తాము. 'జాగ్రఫీ' అనే ఇంగ్లీషు మాటకు సంస్కృత పదం "భూగోళం". గోళమనే పదమే సూచిస్తుంది భూమి గుండ్రంగా ఉన్నదని. భూమి వలయాకారంగా ఉన్నట్టు మన పూర్వీకులు విశ్వసించారని ఆ పదం వల్లనే మనకు తెలియడం లేదా? మన ప్రాచీన గణితశాస్త్రాల్లో అంతటా 'ఖగోళం', 'భూగోళం' అనే పదాలు ఉండడం కూడా దీనిని బలపరుస్తుంది. మన సంకల్ప మంత్రలలో భూమిని "బ్రహ్మాండం" అని చెబుతాము. 'అండం' అంటే గుడ్డు అని అర్థం. కొంచెం ఏటవాలుగా ఉన్నా గుడ్డు గుండ్రనిదే కదా! ... ... ఆధునిక భూగోళ శాస్త్రజ్ఞులు భూమిని గురించి చెప్పే సూత్రాలు మన ప్రాచీన ఋష్యాదులకు తెలియనివి కావు! .... ....!
(నీలంరాజు వెంకటశేషయ్య గారు కంచి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి రాసిన "నడిచే దేవుడు" పుస్తకం నుండి గ్రహించినది)
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
No comments:
Post a Comment