Wednesday, August 24, 2022

సుఖాన్ని సాధించడం 'సులభం'!

 ★★★సుఖాన్ని సాధించడం 'సులభం'!★★★

          మనకి జీవితంలో తరుచుగా ఎదురయ్యే అతిపెద్ద సమస్య - సుఖపడటం ఎలా? ఎంత ప్రశాంతంగా జీవించే వాళ్ళని పలకరించినా, "ఏదో బండి నడుపుతున్నాం" అనే అంటారు తప్ప, సుఖంగా వున్నామని చెప్పరు. వాళ్ళ దృష్టిలో ఇంకా ఏదో గొప్ప సుఖాన్ని తాము పొందలేక పోతున్నామనుకుంటారు.
           కోటీశ్వరుడూ ఇదే మాట చెబుతాడు. కూటికి ఠికాణా లేనివాడూ ఇదే మాటలు చెబుతాడు ఎందుకని? 
          ఎందుకంటే - అసలు సమస్యంతా వాళ్ళ దృక్పథంలోనే మొదలవుతోంది. 
          ఒక్కసారి మన చుట్టూ వున్న సమాజంలో కనిపించే వాళ్ళందరినీ పరిశీలించి చూడండి. వాళ్ళ మనస్సుల్లోకి తొంగి చూస్తే ఏం కనిపిస్తుంది? 
          'సుఖపడాలి!' 
          ఇదే అందరి లక్ష్యం. అందుకోసమే అందరి ప్రయత్నం.
          కానీ, జీవితంలో సుఖం మాత్రమే లేదు. మనం ప్రయత్నించకపోయినా కష్టం అనుభవించక తప్పదు. ఈ కష్టాలు కొన్ని మన ప్రమేయం లేకుండా వచ్చిపడ్డవే. కానీ చాలాభాగం మనం చేతులారా కొని తెచ్చుకున్నవే. కొన్ని శారీరక వ్యాధి రూపమైన బాధలు, మానసిక రుగ్మతలు కూడా - కొంచెం వెనక్కి విచారిస్తే మన అనాలోచిత, అవివేక ప్రవర్తనల వల్ల అనుభవిస్తున్నవేనని స్పష్టమవుతుంది. 
          సుఖం కోసం కొన్ని నియమాల్ని ఉల్లంఘించడం, క్రమంగా కష్టానికి తీస్తుంది. తాత్కాలిక సుఖం దీర్ఘకాలిక వేదనకి కారణమవుతోంది. 
          అందుకే మన ధార్మిక గ్రంథాలలో సుఖాల్లోని భేదాలను వివరించారు. 
          మొదట విషంలా అనిపించినా, పరిణామంలో అమృతంతో సమానమనిపించేది 'సాత్విక సుఖం'. 
          మొదట తీయగా తోచినా, క్రమంగా విషంగా రాజస సుఖం. సుఖభ్రాంతి తామసం.
          ఇందులో నిజమైన సుఖం మొదటిది. మిగిలిన రెండింటి కోసం తాపత్రయ పడితే, పరిణామంలో దుఃఖమే మిగుల్తుంది. ఈ ఒక్క సూత్రాన్ని గుర్తు పెట్టుకున్నవాడు నిత్యసుఖి. 
          తాగరానివి, తినరానివి చూడగానే వాటిని సేవించాలని బుద్ధి పుడుతుంది. చేయరానివి, అవినీతితో కూడినవి చేసి తొందరగా ఏదో సంపాదించాలని, సుఖపడాలని ఉబలాటం పుడుతుంది. కామక్రోధ వికారాలున్న రాజసతత్త్వం ఉన్నవారి అవస్థ ఇది. దీని ప్రభావం వల్ల తెగించి వాటిని అనుభవిస్తాం. ఆ సమయానికి ఆ ఆనందాలు హాయిగా అనిపిస్తాయి. తరువాత తప్పకుండా వేదనకి గురి చేస్తాయి.
           దీనికి మన జీవితంలోనూ, చుట్టూ సమాజంలోని ఇతరుల జీవితాల్లోనూ, గత చరిత్రల్లో వెతికితే దొరికే ఉదాహరణలు ఎన్నెన్నో. 
          ఈ ఉబలాటం కలిగిన ప్రతిసారీ - కొంచెం నిదానించి, వివేకాన్ని ఉపయోగించి, నిగ్రహాన్ని అలవరుచుకుంటే, 'కూడని వాటి కోసం' తెగించకుండా మనల్ని మనం నిరోధించుకోగలం. ఆ క్షణం గడిచిందంటే - ఒక తాత్కాలిక సుఖాన్ని పోగొట్టుకోవటం కన్నా మిన్నగా ఒక పెద్ద గండాన్ని దాటి, శాశ్వత క్షేమాన్ని కాపాడుకున్నట్లే.
          ఈ నిగ్రహాన్నే 'శమం - దమం' అంటారు. బాహ్యేంద్రియాల్ని నిగ్రహిస్తే 'శమం'. అంతరేంద్రియాల్ని (మనస్సుని) నిగ్రహిస్తే 'దమం'. ఇవి యోగానికో, ఆధ్యాత్మికతకో సంబంధించిన పదాలు అని తేలిగ్గా తీసిపారేసి, నిజజీవితానికి వీటిని దూరంగా పెడతాం. కానీ, ముందు మన వ్యక్తిత్వ నిర్మాణానికి, మెరుగైన జీవితానికి పనికొచ్చే అంశాలు ఈ రెండేనని గ్రహిస్తే - అదే వివేకం. 
          ఒక వ్యాయామం చేయడానికో, యోగాభ్యాసం చేయడానికి సిద్ధపడినప్పుడు ఒళ్ళు వంచడానికి మనస్సు ఒప్పుకోదు. అది తత్కాలానికి విష సమానమే. ఒక పట్టాన కాళ్ళూ, చేతులూ వంగవు. 
          కానీ...
          కొద్దిపాటి సహనంతో కాళ్ళూ, చేతులూ వంచి కృషి చేస్తే, క్రమంగా శరీరం, మనస్సు చైతన్యవంతమై, పరిణామంలో నూతనోత్తేజం, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. ఇది సాత్విక సుఖ లక్షణం. 
          మరికాసేపు నిద్రపోవాలనీ, నిద్రే సుఖమనీ, కదలకుండా కూర్చోవడమే సుఖమనీ - శ్రమించడానికి వెనకాడే సోమరితనంలోని సుఖభ్రాంతి తామసికం. ఇది అప్పటికి హాయిగా అనిపించినా, నిజమైన సుఖం కాదది. అందుకే 'భ్రాంతి' అన్నారు. కుంభకర్ణుడు దీనికి ఉదాహరణ.
         తమ తత్కాల సుఖం కోసం బలాన్నీ, బుద్ధినీ వినియోగించి, ధర్మాన్ని అతిక్రమించిన వాళ్ళు కాలక్రమంలో తామూ, తమ బలగం కూడా దెబ్బతింటారు. రావణుడే దీనికి తార్కాణం.  
           పురాణ కథల ద్వారా సుఖం అంటే ఏమిటో, దాన్ని ఎలా పొందాలో తెలియజేస్తూ మానవుని తీర్చిదిద్దేందుకు మన ఋషులు ప్రయత్నించారు. వాటిని ప్రతిస్థాయిలోనూ గమనించి, అమలు పరుచుకోవడం మన విధి. ఈ 'ఇంద్రియ నిగ్రహం' అనే సూత్రం ధార్మికతకు ప్రాణం. 
          అన్ని ధర్మాలకు పునాది వంటిది నిగ్రహం. ఇదే మనల్ని పతనం కాకుండా ఆపుతుంది. దీన్ని ప్రతి వ్యక్తి, సమాజం అలవరుచుకోగలిగితే క్రమంగా అవినీతి, అలసత్వం, కర్తవ్య రాహిత్యం వంటి దుర్గుణాలు తొలగిపోతాయి. నిజమైన సుఖశాంతులతో కళకళలాడవచ్చు.

No comments:

Post a Comment