Wednesday, August 24, 2022

🔥🔥 అంతర్యామి 🔥🔥 🪔🪔మోక్షం🪔🪔

 🔥🔥 అంతర్యామి 🔥🔥

   🪔🪔మోక్షం🪔🪔

    🍁మనుషుల్లో మూడు రకాల వాళ్లుంటారు. ఐహిక సుఖం కోరుకునేవారు, పరం చాలనుకునేవారు, ఇహపర సుఖాలు రెండూ కోరుకునేవారు. పరసుఖం అంటే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ ప్రాప్తించదు.

🍁 ఎన్నేళ్లు సాధన చేసినా, తపస్సు చేసినా రుషులందరికీ మోక్షం లభించలేదు. అందుకు పూర్వజన్మ సుకృతమూ ఉండాలి. ఈ జీవితంలో చేసే అవిరళ కృషీ ఉండాలి.

🍁భారతీయ దార్శనికక్షేత్రంలో మోక్షం అద్వితీయమైన పరమార్థం. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మచింతనలోను కనిపించని ప్రాధాన్యం మోక్షానికి మన సనాతన ధర్మచింతనలోనే గోచరిస్తుంది. దేశంలోని సర్వ సంప్రదాయాల దర్శనమిది. చింతన అనేది అన్ని రకాలైన సత్యాన్వేషణకు పునాది. 

🍁జీవితంలోని అన్ని లోపాలను సవరించి, దుఃఖాలనుంచి విముక్తి కలిగించే మార్గమే చింతన. 🍁అప్పుడే శాశ్వతానందపథం గోచరిస్తుంది. అదే మోక్షం. 
🍁చతుర్విధ పురుషార్థ ఫలాల్లో మోక్షమే అగ్రేసర స్థానంలో నిలబడి ఉంది. 
🍁మానవుడి చరమలక్ష్యం మోక్షప్రాప్తి.

 🍁భారతీయ తత్వదర్శనంలో మోక్షం పరమోత్కృష్ట మూల్యం, సర్వశ్రేష్ఠ పురుషార్థం. దార్శినికులు ఆస్తికులు, నాస్తికులుగా విభిన్న అభిప్రాయాలు కలవారుగా ఉన్నప్పటికీ, భారతీయ సంప్రదాయాలన్నీ ఏకగ్రీవంగా మోక్షాన్నే సమర్థిస్తాయి. 
🍁జీవితానికి చరమలక్ష్యంగా అంగీకరిస్తాయి. 

🍁మోక్షం ఆత్మకు సంబంధించింది. నాస్తిక సంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది. 

🍁మోక్షానికి బౌద్ధం 'నిర్వాణం' అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవటమే నిర్వాణం. మోక్షేచ్ఛకు నిర్వచనం కూడా దాదాపు అదే. 

🍁జైనమతమూ మోక్ష సిద్ధాంతాన్నే చరమ లక్ష్యంగా భావిస్తుంది. మోక్షప్రాప్తికి సమ్యక్‌ జ్ఞానం, సమ్యక్‌ దర్శనం, సమ్యక్‌ చరిత్ర ఆవశ్యకమని చెబుతుంది.

🍁మోక్షం నిరానందస్థితి. ఇది తత్వజ్ఞానం వల్ల లభిస్తుంది. న్యాయ ధర్మ సిద్ధాంతాల అనుసారం తత్వజ్ఞానమంటే ఆత్మను శరీరం, మనసు ఇంద్రియాల నుంచి వేరుగా తెలుసుకోవడం. ఈ జ్ఞానం పఠన, శ్రవణ, మనన విధి ధ్యాసలవల్ల కలుగుతుంది. ఇవే మోక్షమార్గాలు. మోక్షం కోరుకునే జాతిలో ఏ అరిష్టమూ, అశుభమూ చోటు చేసుకోలేదు. విశ్వశాంతికి అటువంటి జాతే సర్వదా సహకరిస్తుంది.

🍁సాంఖ్య-యోగ దర్శనాలను అనుసరించి మోక్షమంటే కైవల్యం. దుఃఖం నుంచి సర్వులకూ విముక్తి కలిగించేది అదే. కైవల్యంలో సుఖం కూడా ఉండదు. అంటే అది శుద్ధచైతన్యావస్థ. ఈ స్థితి జ్ఞానంవల్లనే సిద్ధిస్తుంది. మోక్షసాధనాల్లో సర్వోత్కృమైన సాధనం భక్తే. 

🍁భక్తి వల్లనే అంతర్యామి అనురాగం, ఆశ్రయం లభిస్తాయి. 
🍁అద్వైతం జ్ఞానానికి ప్రాధాన్యమిస్తుంది. 
🍁విశిష్టాద్వైతం భక్తికి ప్రాముఖ్యమిస్తుంది.

🍁స్థూలంగా మోక్షం అంటే సమర్పణభావం. 
🍁ఇది అంత సులువు కాదు. 
🍁అది ఒక పావన భావన. అందులో నిరహంకారం, వినయం, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం నిండుగా ఉండాలి. అత్యంత ప్రియతముణ్ని ఆత్మసమర్పణ చేసుకొమ్మంటాడు వాసుదేవుడు. ఆ ప్రియతముడే అర్జునుడు.

🍁అత్యంత దుర్లభమైన ఈ మానవ జన్మ లభించాక కూడా మోక్షప్రాప్తికి యత్నించని, తపించని మానవుడు మూఢుడు. జడుడు, మహాపాపి. పాపానికైనా, పుణ్యానికైనా ఈ శరీరం సహకరించాల్సిందే కద! 

🍁అందుచేత సత్కర్మల కోసమే ఈ శరీరాన్ని స్వస్థతతో కాపాడుకోవాలి. ముక్తి కోసం ధ్యానయోగాల్ని, ధ్యానయోగాల కోసం జ్ఞానాన్ని, జ్ఞానం కోసం ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ధర్మాచరణ కోసం శరీరాన్ని ఆరోగ్యవంతంగా సంరక్షించుకోవాలి. కనుక మోక్షప్రాప్తికి శరీరారోగ్య పరిరక్షణ అత్యావశ్యకం, అనివార్యం.

🍁'ఇది నాది' అనుకుంటే మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు. 'ఇది నాది కాదు' అనుకుంటే మోక్షార్హుడవుతాడు. సాంసారిక వాసనలతో నిండి ఇంద్రియచాపల్యం కలిగించే కర్మలు చేస్తున్న మానవుడికి పరమ తత్వజ్ఞానం అవగాహన కాదు. 

🍁త్రికరణ శుద్ధిగా పవిత్రుణ్ని చేసే విద్యే విద్య. అటువంటి విద్యనే సాధకుడు హస్తగతం, మనోగతం చేసుకోవాలి. దాన్ని ఆచరణతో సమన్వయపరచుకోవాలి. దాన్ని జీవనలక్ష్యంగా స్వీకరించాలి. అందుకు సద్గురువు సహకారం అనివార్యం. 

🍁ప్రాణ, మానమోహాలు వీడి, మమతాను బంధాలు త్యజించి, ధర్మవ్రతుడై ఏకాగ్రతతో ప్రణవం జరిపించి, జితేంద్రియుడై, ఐహిక శృంఖలాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. అటువంటి మోక్షానికి మనసు దర్పణమై ప్రకాశిస్తుంది. 
🍁అందులో విశ్వపురుషుడి ప్రతిబింబమే ప్రభాసిస్తుంది. 
🍁ఆ అలౌకిక దర్శనానుభూతే మోక్షం!

,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment