Saturday, August 27, 2022

భక్తి లేని జ్ఞానం వృథా!

 🌺🪔భక్తి లేని జ్ఞానం వృథా!🪔🌺

🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼

🌿‘సంపూర్ణ జ్ఞానం’ ఉన్నవారు (ఆత్మజ్ఞానులు) నిండుకుండల వంటివారు.

🌿తొణకరు, బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు.

 🌿జ్ఞానులు మంచి భక్తులుగా మారి భగవంతునికి దగ్గర కావాలని కోరుకుంటారు. లోకంలో వీరు చాలా కొద్దిమంది, అత్యంత అరుదుగానే ఉంటారు. వీరు దేనినీ పెద్దగా కోరుకోరు. లౌకిక విషయాలేవీ పట్టవు. వీరికి కావలసిందల్లా భగవంతునికి ఆత్మార్పణం చేసుకొని, అతనిలో ఐక్యం కావడమే. అందుకోసమే నిరంతరం సాధన చేస్తుంటారు.

 🌺‘ఆత్మజ్ఞానులు’ చేసే పనులు ఎంతో విజ్ఞతతో కూడుకొని ఉంటాయి.

🌿మానవుడు తన జ్ఞానంతో ఎన్నింటినో (విద్యుత్‌ బల్బ్‌, ఫ్యాన్‌, రిఫ్రిజిటర్‌ వంటి విద్యుత్‌ పరికరాలు) కనుగొన్నాడు. ఇవన్నీ కూడా స్వయంప్రతిపత్తి (స్వీయశక్తి)ని కలిగినవి కావు. వాటిని విద్యుచ్ఛక్తితో అనుసంధానిస్తేనే పనిచేస్తాయి. ఎలాంటి జ్ఞానం ఉపయోగించకుండానే వాటి స్విచ్‌ ఆన్‌ చేస్తే సరి. జ్ఞానం లేనివారు కూడా ఇంతే. అజ్ఞానంతో లోపభూయిష్టమైన జీవితాలు గడుపుతుంటారు. జ్ఞానం లేనివాని జీవితం కష్టాలమయంగా ఉంటుంది. అతను తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కుంటుంటాడు. 

🌿ఒకసారి ఈ దృశ్యాన్ని ఆకాశంలో విహరిస్తున్న ‘పార్వతీ పరమేశ్వరులు’ చూసి, తమలో తాము ఇలా అనుకున్నారట. ‘జ్ఞానం లేని ఇతను నిజంగానే పెద్ద మూర్ఖుడు. కొమ్మ విరిగాక అతను కిందపడి పోవడం ఖాయం. అప్పుడు అతను ‘అమ్మా’ అని అరిస్తే నేను రక్షిస్తాను. ‘నాన్నా’ అని కేక వేస్తే మీరు రక్షించండి’ అందిట పార్వతి. 

🌿ఇద్దరూ ‘సరే’ అని ఆ వ్యక్తివైపు చూడసాగారు. అతడు పడిపోతూ, ‘చచ్చాను..’ అని అరిచాడు. ఇద్దరిలో ఎవరినీ తలచుకోలేదు. ‘ఆపదల నుంచి గట్టెక్కించమని’ ఆపద్భాందవుని వేడుకుంటేనే కదా కాపాడేది!

🌿ఇటువంటి ‘బుద్ధి’ (వివేచన) నిజానికి మనిషికి జ్ఞానం ‘ఉంటేనే’ పుడుతుంది. ‘కొంత ధీశక్తి, పరిశీలనా పటిమతో ఈ సమస్త విశ్వాన్ని నడిపించేవాడు ఎక్కడ, ఎలా ఉంటాడు?’ అనే కుతూహలంతో నిరంతరం సాధన చేసేవాడే జ్ఞాని.

 🌿అతనిపై ఎలాంటి ఐహికమైన కోరికలు ప్రభావం చూపవు. ఒక్క పరమాత్మ సాన్నిధ్యం తప్ప, అతనికి మరేదీ అక్కరలేదు.

🌿 ‘ప్రియో హి జ్ఞానినో త్యర్థం అహం సచ మమ ప్రియః’ (భగవద్గీత: 7-17).

🌿 ‘నాకు జ్ఞాని అయినవాడు అత్యంత ప్రియుడు. నేనూ అతనికే మిక్కిలి ప్రియుడను’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు.

 🌿‘జ్ఞానికి నేను తప్ప ఇంకేమీ అవసరం లేదు. తన్ను తాను నాకు సమర్పించుకుంటాడు. ఆత్మార్పణ బుద్ధితో, శరణాగత భావంతో నన్ను సమీపిస్తాడు. నేను అతనిని కృపాదృష్టితో, ప్రేమభావంతో చూడకపోతే అతని శరణాగతి, ఆత్మార్పణం అర్థం లేకపోగా, అవి వృథా అవుతాయి కదా. అందుకే, నేను అతణ్నే ప్రేమిస్తాను. అతనంటేనే నాకంత ఇష్టం.’ అన్నది పరమాత్మ భావన.

🌿మనస్తత్వ శాస్త్రం ప్రకారం స్వార్థరహిత ప్రేమ చూపగలిగితే దీర్ఘకాలిక శత్రువు కూడా ప్రేమమూర్తిగా మారిపోతాడు. 

🌿ఈ లోకంలో భక్తి, జ్ఞాన మార్గాలు రెండూ వేర్వేరు. ఒకరకంగా ఇవి రెండు ‘విరుద్ధాలు’ కూడా. ఇక్కడ జ్ఞానియే భక్తుడు కూడా అవటం విశేషం. ‘భక్తి లేని జ్ఞానం’ నిస్సారమైంది. ‘ఆత్మజ్ఞానం’ అనేది సాధన ద్వారానే సాధ్యం. ఆత్మజ్ఞానులు సమస్త జీవకోటి, మానవ కల్యాణానికి బాటలు వేస్తారు.

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 

No comments:

Post a Comment