Wednesday, August 31, 2022

అన్ని కాలములలోను, అన్ని అవస్థలలోను చైతన్యము ఒక్కటి మాత్రమే నిలచి ఉంటుంది.

 🕉️  శ్రీ గురుభ్యోనమః*   
         
 అందరిలోను  సత్యం  ఉన్నది*

 జిన్నూరు  సెప్టెంబర్  23,  1994*

అందరిలోను  సత్యం  ఉన్నది.  మానవుడు  తన  హృదయములో  ఉన్న  సత్యమును  గురించి  శ్రవణము  చేసి,  మననం  చేస్తే  అమృతత్త్వమును  పొందుతాడు.  

          సత్యం  హృదయంలో  సిద్ధంగానే  యున్నది.  అది  అనుభవైకవేద్యము.  దేశ  కాలములు  దానిని  తాకవు.  దేహము,  మనస్సు  దానిని  పరిమితము  చేయలేవు.  సత్యం  తెలియకపోవటమే  అజ్ఞానం.  సమాజములో  ఉన్న  అన్ని  అనర్ధములకు  అజ్ఞానమే  కారణం.

          జ్ఞానఫలం  శాంతి!  అజ్ఞానఫలం  అశాంతి!  జ్ఞానమునకు,  కర్మకు  విరోధము  లేదు.  జ్ఞానము,  అజ్ఞానము  పరస్పర  విరుద్ధములు.  

          ఏనాటికైనా  సత్యమును  మానవుడు  తనలోనే  కనుగొనవలెను.  అది  వెలుపల  దొరకదు.  సత్యాన్వేషకుడు  కానివాడిని  ప్రపంచం  నిరంతరం  వ్యామోహపరుస్తూ  ఉంటుంది.  మానవ  మానసం  జ్ఞానాన్ని  లోపల  వెతకటం  మాని  వెలుపల  వెతకటానికి  అలవాటు  పడిపోయింది.  అందువలన  మానవ  హృదయంలో  ఉన్న  సద్వస్తువు  నిజమైనప్పటికి  నిజము  కాని  దానివలె  కనిపిస్తున్నది.  

 అజ్ఞానము  కల్ల  విషయములను  సృష్టించి  వాటితోనే  తిరుగుతూ  ఉంటుంది.  ప్రయత్నము  చేసి  అజ్ఞానమును  తొలగించుకుంటే  దానికి  సంబంధించిన  బాధలు,  వ్యధలు  నశిస్తాయి.  అజ్ఞానము  తలంపులకు  లోబడి  ఉంటుంది.  చైతన్యము  తలంపులకు  అతీతమై  ఉంటుంది.  అన్ని  కాలములలోను,  అన్ని  అవస్థలలోను  చైతన్యము  ఒక్కటి  మాత్రమే  నిలచి  ఉంటుంది. 

చైతన్యమే  పూర్ణజ్ఞానము!*

No comments:

Post a Comment