శ్రీ దత్త వాక్సుధారసం....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏 జై గురుదత్త 🙏
✳️ మనిషి మనసు ఆధ్యాత్మికత వైపు మరలాలంటే ముందుగా బుధ్ధి వికసించాలి. అప్పుడే మనిషి అజ్ఞానమనే చీకటి నుంచి వెలుగు అనే జ్ఞానం వైపు ప్రయాణిస్తాడు.
✳️ నిజమైన ఆధ్యాత్మికత - మనసును నిగ్రహపరచి, దృష్టిని అంతర్ముఖం చేసి ఆత్మసాక్షాత్కారం పొందడంలోనే ఉంది. అందుకే ఆధ్యాత్మిక జీవనంలో మనిషి తనను తాను గమనించుకుంటూ ఆత్మదృష్టిని అలవరచుకోవాలి.
✳️ ఆత్మబోధనలోనే సత్య దర్శనం అవుతుంది. మనిషిలోని తమోగుణాన్ని నిరోధించి, రజోగుణాన్ని అణచివేసి, మనిషిని సత్వగుణ సంపన్నుడిగా చేస్తుంది ఆధ్యాత్మికత.
✳️ ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు ఎల్లప్పుడూ సత్యజీవనానికి కట్టుబడి ఉంటారు.
✳️ కొండ శిఖరంమీద కూర్చున్న వ్యక్తి కిందికి చూస్తే, అంతా సమతులంగా అనిపిస్తుంది. అలాగే, ఆధ్యాత్మిక శిఖరం చేరుకున్నవారికి తరతమభేదాలు, ఆధిక్యతా భావాలు ఉండవు. వారు అందరినీ సమానంగా చూస్తారు. గగనంలా గంభీరంగా, సముద్రంలా గాఢంగా, ప్రకృతిలా పవిత్రంగా, చంద్రుడిలా ఆత్మీయంగా ఉంటారు.
✳️ ఆధ్యాత్మిక జీవనంలో ప్రతి వ్యక్తీ కర్మలన్నింటినీ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. సాధ్యమైనంత వరకూ ఇతరులకు ఉపకారం చేయాలి. స్వచ్ఛమైన ప్రేమ, దయ, కరుణ, కృతజ్ఞత, పవిత్రత వంటి దైవీగుణాలు అలవరచుకోవాలి.
✳️ పర్వతం ఎక్కినవారు బరువులన్నీ ఒక్కొక్కటీ వదిలించుకుంటారు. లేకపోతే ప్రయాణం ముందుకు సాగదు. అలాగే…ఆధ్యాత్మిక జీవనంలో బహుకాలం ఆశ్రయించి ఉన్న ప్రాపంచిక బంధాలను, భావాలను వదిలేస్తూ ముందుకు సాగాలి. అప్పుడే మనిషి ఆధ్యాత్మికత శిఖర స్థాయికి చేరుకుంటాడు.
✳️ ఆధ్యాత్మిక జీవనం అంటే పూజలు, జపాలు, భజనలు చేయడం కాదు. ఇవన్నీ సత్కర్మలు. ఆధ్యాత్మికత అంటే మనిషి తనలోని పశుత్వాన్ని జయించడం.
✳️ పశుత్వ గుణాలైన అహంకారం, దురాశ, కోపం, మదమాత్సర్యాలు, ఈర్ష్యాద్వేషాలు తొలగించుకోవాలి. మానవత్వం నుంచి దివ్యత్వానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి.
✳️ ఆధ్యాత్మిక జీవనంలో మనిషికి అతిగా ఆశలు, ఆశయాలు, కోరికలు వంటివి ఉండవు. రాగద్వేషాలకు అవకాశమే ఉండదు. తాత్విక చింతన, స్థితప్రజ్ఞత కలిగిన ఆ మనిషి విమర్శలను, వ్యతిరేకతలను ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సోపానాలుగా ఉపయోగించుకుంటాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకంజ వేయడు.
✳️ ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించిన మనిషి ప్రాపంచిక సుఖాల కోసం ఆరాటపడడు. ఆధ్యాత్మిక జ్ఞానసంపద మనిషికి మంచి జీవన విధానాన్ని నేర్పుతుంది. పరమార్థాన్ని బోధించి మనిషిని స్థితప్రజ్ఞుడిగా మారుస్తుంది.
✳️ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదిగినట్లయితే, అతడి జీవనవిధానంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. దృష్టిలో పవిత్రత, సేవలో నమ్రత, స్నేహంలో ఆత్మీయత, సంస్కారంలో శ్రేష్ఠత, మాటల్లో మాధుర్యం వంటి గుణాలను అతడు అలవరచుకుంటాడు. జన్మను సార్థకం చేసుకుంటాడు.
✳️ భగవంతుడు చాలా శక్తిమంతుడు. భక్తుల పాలిట కల్పవృక్షం. కష్టమైనా, సుఖమైనా అంతా భగవంతుడు ఇచ్చినవే అని భావించాలి. కోరికలు నెరవేరకపోయినా భగవద్భక్తిని విడవకూడదు. భగవంతుడికి అన్ని విధాలా శరణాగతుడై సాధకుడు జీవితాన్ని కొనసాగించాలి.
No comments:
Post a Comment