Wednesday, August 24, 2022

🌷వ్యక్తి-జగత్తు - జగదీశ్వరుడు - పూర్ణబ్రహ్మం🌷

 🌷వ్యక్తి-జగత్తు - జగదీశ్వరుడు - పూర్ణబ్రహ్మం🌷

ప్ర): భక్తులెవరూ లేక భగవంతుడు ఒక్కడే మిగలడం భక్తియోగం...అన్నారు కొంచెం వివరించండీ...
* * *
జ): నిజమే...
భక్తియోగం అనేది మార్గం కాదు.
అదొక సిద్ధ్యావస్థ.
భగవంతుడు దొరికాక...
తనలో కలిగే పారవశ్యతే భక్తి...

తనకు అస్సలు బొత్తిగా పరిచయం లేని వ్యక్తిపై ప్రేమ ఎలా కలుగుతుంది?

కాబట్టి భక్తి వలన భగవంతుడు దొరకడం కాదు.
భగవంతుడు దొరికాక కలిగేది భక్తి.

* * *

రూపాయి చిల్లరను(అనగా నాలుగు పావలాలను)
ఒకే  రూపాయి నాణెంగా మార్చుకోవడమే భక్తియోగము.

రూపాయి నాణెంగా మార్చుకున్న ఆ నాణెంలో
నాలుగు పావలాల వాల్యూ ఉంటుందిగాని...
నాలుగు పావలాలుగా లేకుండా
"రూపాయి నాణెం" ఒక్కటే మిగిలినట్లుగా...

భక్తులెవరూ లేకుండా "భగవంతుడు" ఒక్కడే మిగలడం కూడా అలాంటిదే...

ఒకటవ పావలా - వ్యక్తి (పావలా)
రెండవ పావలా - జగత్తు (అర్థరూపాయి)
మూడవ పావలా - జగదీశ్వరుడు (ముప్పావు)
నాల్గవ పావలా - పూర్ణపరబ్రహ్మం (రూపాయి నాణెం)

వ్యక్తి జగత్తులో...
జగత్తు జగదీశ్వరునిలో...
జగదీశ్వరుడు పూర్ణబ్రహ్మంలో...
కలిసే ప్రాసెస్సే ఉపాసన.
మొత్తంగా అందరూ "ఒకటే"

వ్యక్తిమాత్రంగానే ఉంటూ
జగత్-ఈశ్వరుడు-పూర్ణపరబ్రహ్మము అనేవి
పరోక్షవిషయాలుగా అనుభవంలో ఉన్నప్పుడు 
నీవు పావలాగా ఉన్నట్టు.

ప్రపంచంలో నేనున్నాను...అని కాకుండా
'నాలో ప్రపంచం ఉంది' అనే అనుభవం కలిగినప్పుడు 
నీవు అర్థరూపాయిగా ఉన్నట్టు.

ఆ ప్రపంచం ప్రపంచంగా కాకుండా
ఈశ్వరరూపంగా దర్శించినప్పుడు
నీవు ముప్పావు రూపాయి ఉన్నట్టు.

"నేను" అన్నప్పుడు ఆ నేను మొత్తానికి ప్రతీకగా
అనుభవం అయినప్పుడు
నీవు పూర్ణరూపాయిగా అయినట్టు.

నాల్గవ తరగతి విద్యార్థిలో
మిగతా మూడు తరగతుల విద్యార్థులూ ఉన్నట్లు...

పూర్ణపరబ్రహ్మంలో-
జీవ-జగత్-జగదీశ్వరులు మూడూ ఉంటాయి...

* * *

భగవాన్ అంటారు-
ఏ మతమైనా 1.జీవుడు 2.జగత్తు 3.ఈశ్వరుడు
అనే మూడు వస్తువులను బట్టే ఆరంభమౌతుంది.
ఒక వస్తువే మూడవుతుంది.
అహంకారం ఉన్నంతవరకే మూడూ మూడు ముక్కలుగా ఎప్పుడూ కనబడతాయి. 
కాబట్టి నేను(అహంకారం) చచ్చి
తన స్థితిలో (అనగా ఆత్మస్థితిలో) తానుండడం ఉత్తమం.

* * *

"నేను కర్త"ను అను భావమే అహంకారం.
అహంకార నాశనమే మోక్షం.
శరణాగతే అందుకు ఉత్తమమార్గం.
తన పరిమితుల్ని గుర్తించడమే శరణాగతి.
ఆత్మలో స్థిరపడుటయే శరణాగతి ఫలం.

* * *

"నేను" అన్నా, భగవంతుడు అన్నా
అర్థం ఒక్కటే.

"నేను"సాకారంగా ఉంటే భగవంతుడు.
భగవంతుడు నిరాకారంగా ఉంటే "నేను".

నేను - అన్నప్పుడు వ్యక్తి మాత్రంగా తోచకుండా
జీవ-జగత్-జగదీశ్వర సమిష్ట్యానుభవం కలిగినప్పుడు దానినే 'పరమపదం' అనదగును.

ఆ సమిష్ట్యానుభవం కలగాలంటే ఏం చేయాలి?
అని తప్పకుండా మీరు ప్రశ్నిస్తారు...

దానికి ఒకటే సమాధానం-
సద్గురువును ఆశ్రయించు...

సద్గురు సన్నిధిలో-
సమస్యే సమాధానమవుతుంది. 
శూన్యమే పూర్ణమవుతుంది.
మౌనమే ఉపదేశమవుతుంది.
అహమే ఆత్మ అవుతుంది.

* * *

ఈ ఆధ్యాత్మికంలో ఉన్న తమాషా ఏమంటే-
ఇందులో ఓటమే విజయం అవుతుంది.
మృత్యువే అమృతత్వం అవుతుంది.
పోగొట్టుకోవడమే పొందటం అవుతుంది.
నిస్సహాయతే బలం అవుతుంది.
దుఃఖమే సుఖం అవుతుంది.

* * *

వ్యక్తిగా నటించు...
ఆత్మగా జీవించు...

No comments:

Post a Comment