Wednesday, August 31, 2022

భగవాన్ శ్రీరమణుల నిరాడంబరత్వం వర్ణనాతీతం

 ఒకరోజు భగవాన్ దగ్గర చనువుగల ఒక భక్తుడు వచ్చి, తన్ను ఎవరో సదా దూషిస్తున్నారని భగవానుతో పదేపదే చెప్పసాగాడు. భగవాన్ విని ఊరుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సమాధానం రాకపోవటం వల్ల ఆ భక్తుడు ఆగలేక "అనవసరంగా అలా తిడుతుంటే నాకు కోపం వస్తోంది. ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగడం లేదు, ఏం చెయ్యాలి?" అన్నాడు. భగవాన్ నవ్వుతూ "ఏం చెయ్యాలా? నీవు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో, సరిపోతుంది" అన్నారు. అక్కడున్న భక్తులందరూ నవ్వసాగారు. ఆ భక్తునికి ఏమీ తోచక, "సరిపోయింది, నన్ను నేనే తిట్టుకోవాలా?" అన్నారు.

"అవునయ్యా! నీ శరీరాన్ని గదా వారు దూషించేది. కోపతాపాలకు నిలయమైన ఈ శరీరం కంటే, మనకు శత్రువులెవరు? దీన్ని స్వతహా మనమే ద్వేషించవలసి ఉంది. మనమట్లా చేయక ఏమరి ఉన్నప్పుడు, ఎవరైనా దూషిస్తే, మనల్ని ప్రబోధిస్తున్నారని తెలివి తెచ్చుకొన, వారితో కలసి దాన్ని నిరసించాలి. అంతేకానీ ఎదురు తిడితే ఏం లాభం? మనల్ని దూషించేవారినేమ మిత్రులుగా భావించాలి. వారి మధ్య ఉంటేనే మనకు మేలు. పొగిడేవారి మధ్య
ఏమరిపోతాం అన్నారు భగవాన్.                                 
 ఆ చమత్కార సమాధానంలోఎంత ఆధ్యాత్మిక బోధ ఇమిడి ఉందో?                                                   నిరాడంబరుడు :::;                   భగవాన్ శ్రీరమణుల నిరాడంబరత్వం వర్ణనాతీతం భక్తులు విలువైన వస్తువులు తెచ్చి యిస్తే, "ఇది మనకెందుకండోయ్" అంటూ వాటిని తాకేవారు కూడా కాదు. వారి నిరాడంబరతను తెలిపే కొన్ని సంఘటనలు.... 1. 1947 సం.లో బెంగుళూరు నుండి బోసు అనే భక్తుడు వచ్చి ఖరీదైన పెన్సిళ్ళు భగవానుకి ఇచ్చి వెళ్ళాడు. అతను వెళ్ళాక భగవాన్ వాటిని కృష్ణస్వామికిస్తూ "ఇవి భద్రంగా దాచి ఉంచవయ్యా, మన సొంత పెన్సిలు ఎక్కడో ఉండాలి అది తెచ్చి యివ్వు" అన్నారు.

అవి తీసుకొని,ఇంకొక మంచి పెన్సిలు ఇచ్చాడు కృష్ణస్వామి. దాన్ని అటు ఇటు తీప్పి చూసి, "ఇదెందుకయ్యోయ్, ఇది దేవరాజు మొదలియారుది. ఇది కూడ భద్రంగా ఉంచు. మన సొంత పెన్సిలు ఉండాలి కదా! అది తెచ్చివ్వు" అన్నారు భగవాన్. కృష్ణస్వామి వెతికి అది కనిపించలేదన్నాడు. "అయ్యయ్యో! అది మన సొంత పెన్సిలయ్యా, సరిగ్గా చూడండి" అన్నారు భగవాన్. ప్రక్కనే ఉన్న మొదలియార్ "అదేమిటి భగవాన్! ఇవన్నీ మాత్రం సొంతం కాదా?" అన్నారు.

భగవాన్ పవ్వుతూ"అది కాదండీ ఇది మీరిచ్చారు, అవి బోసు తెచ్చాడు, ఇవి ఎంతో ఖరీదైనవి. అజాగ్రత్తగా ఉంటే ఎవరైనా ఎత్తుకుపోతారు. స్వామి అందరికీ ఉమ్మడియేకదా. అయ్యో! ఇంత ఖరీదైనది భగవానుకు ఇచ్చామే, పోయిందే అని మీరు అనుకుంటారు. ఇదంతా ఎందుకు? మన సొంత పెన్సిలైతే ఎలా ఉనచుకున్నా పరవాలేదు. దాని వెల అర్దణా. అది కూడా కొన్నది కాదు. ఎక్కడో దొరికిందని ఎవరో తెచ్చి ఇచ్చారు. అది మన సొంతం. అది పోయినా ఎవరూ అడగరు.అందుకే అది కావాలంటున్నాను. ఇవన్ని గొప్పవారు వాడేవి, మనకెందుకు? మనమేమీ పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? మన వ్రాతకు ఇది సరిపోతుంది" అని చెప్పి చివరికి దాన్ని వెతికించి తెప్పించుకున్నారు భగవాన్. 

No comments:

Post a Comment