2ix.ix. 1-2. 260822-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
భగవద్…
వాసనలు:
➖➖➖✍️
వేదాంత పరిభాషలో వాసనలు మూడు రకాలు. దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన. అసలీ వాసన అంటే ఏమిటో, అది ఎలా వస్తుందో తెలుసుకుందాం.
శరీరం ధరించిన ప్రతివాడికీ ఆ శరీరం ఉన్నంతవరకు ఏదో ఒక పని చేస్తూ ఉండక తప్పదు. కానీ గరిటతో కలపవలసిన సాంబారు చేత్తో కలిపితే ఆ చేతికి వాసన అంటుకున్నట్టు, శరీరంతో చేయవలసిన పనులకు మనస్సును జత చేస్తే మనస్సుకు ఆ వాసన అంటుకుంటుంది.
శరీరానికి ఆకలి వేసిందనుకోండి, తినగలిగిన పదార్ధం అప్పటికి ఏది దొరికితే అది లోపల వేస్తే ఆ ఆకలి తీరిపోతుంది. కానీ ఆ సమయానికి మనం ఏ శరవణ భవన్ కో వెళ్ళామనుకోండి, శరీరం ఆకలి తీరటంతోపాటు అక్కడ వంటకాలు బాగుంటాయి అనే ఒక గుర్తు మనస్సులో నాటుకుపోతుంది….అదే వాసన!
అయితే మీరు మనస్సు పెట్టి తినకపోతే ఈ వాసన అంటదు. నిజానికి ఆకలి వేయటం, ఆహారం తినటం, కడుపు నిండటం ఇవన్నీ కేవలం దేహానికి సంబంధించిన విషయాలు.
కేవలం ఒక దేహ క్రియగా ఉండవలసినదానికి మనసు చేర్చటంతో అది వాసనగా అంటుకొని చివరికి కర్మగా మారుతుంది.
ఇక దేహ వాసన అంటే ఈ దేహం నేను అనే నిశ్చితమైన నమ్మకం. అది ఈ దేహానికి పెట్టుకున్న పేరుపై కూడా అంతే గాఢంగా ఉంటుంది. నా పేరు ప్రసాదు అనుకోండి, పిలిచేది నన్నే అని తెలిసినా ప్రసాదరావు అంటే పలకను. పేరు కేవలం దేహానిదే అయినా, అది కేవలం సౌలభ్యం కోసం పెట్టుకునన్నదే అయినా, మహాత్ముల సన్నిధిలో కూడా దాని మీద అభిమానాన్ని వదులుకోలేము.
శాస్త్ర వాసన అంటే మనం చదువుకున్న పుస్తకాలలో, విన్న విషయాలలో ఉన్న విజ్ఞానమే సర్వస్వం అని బలంగా విశ్వసించటం. పరిమితమైన మానవ జీవితకాలంలో పరిపూర్ణ విజ్ఞానాన్ని కేవలం చదువుద్వారా పొందటం ఎవరికీ సాధ్యం కాదు. కేవలం తనను తాను తెలుసుకొన్న బ్రహ్మజ్ఞానికే సర్వం తెలియబడుతుంది. కానీ మనం మనకున్న పరిమిత జ్ఞానంతోనే అనంతుడైన భగవంతుణ్ణి, ఆయన ప్రతిరూపాలైన అవతార పురుషుల్ని, మహాత్ముల్ని అంచనా వేయాలని చూస్తాం. మనకు తెలిసిన గుప్పెడు ధర్మ సూత్రాలతో ధర్మాధిష్టానమైన పరమాత్మనే అంచనా వేస్తూ రాముడు అలా ఎందుకు చేసాడు? కృష్ణుడు ఇలా ఎందుకు చేసాడు? అని వాదిస్తాం. అనంత విశ్వంలో అతి చిన్న భాగమైన మన సమాజపు కట్టుబాట్లతో అనంతుడైన భగవంతుణ్ణి బంధించాలని చూస్తాం. మనమీద కరుణించి ఆ భగవంతుడే ఏ కుక్క రూపంలోనో ప్రత్యక్షమైతే శాస్త్రాలలో చెప్పిన ఆకారంలో రాలేదని గుర్తించటానికి నిరాకరిస్తాం. తులసీదాసు అంతటి మహాభక్తుడికే ఈ పరిస్థితి తప్పలేదు.
ఇక లోక వాసన - ఈ లోకంలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ కొన్ని అభిప్రాయాలూ అలవాట్లూ ముందే ఏర్పరుచుకొని ప్రతిదానిని ఆ కోణంలోనే చూస్తాం. ఒక వ్యక్తి మనకు ఏదో మంచో చెడో చేస్తే, అలాంటి వేషభాషలు, ఆ కులం, ఆ మతం, ఆ జాతికి సంబంధించిన వారందరికీ, వాళ్ళెవరో మనకు తెలియకపోయినా, అవే గుణాలు అంటగడతాం. సిగరెట్టు కోసం పరాయి వాళ్ళని అగ్గిపెట్టె అడగడానికి కూడా సిగ్గుపడం కానీ ఏ ఆశ్రమనికో సత్సంగానికో వెళ్ళాలంటే నలుగురూ ఏమనుకుంటారో అని సిగ్గుపడతాం.
మన కంటికి కనపడకుండా ఎక్కడో గోడవతల ఉన్న పువ్వు వాసన కూడా మనదాకా చేరినట్లు, ఈ వాసనలు మనను జన్మజన్మలదాకా వెంటాడుతూనే ఉంటాయి.
సాధనద్వారా మన మనస్సు ప్రక్షాళన చేసుకొనేదాకా ఈ వాసనలు తప్పవు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
No comments:
Post a Comment