అగ్నిచే కాల్చబడిన విత్తనాలు మొలకెత్తలేవు. అట్లే జ్ఞానాగ్నిచే దగ్ధమైన కర్మలు జీవుని అంటుకోలేవు. నేతితో వండిన పదార్థములైనను అవి నాలుకకు అంటుకోవు. అద్దములో పడిన ప్రతిబింబము అద్దానికి అంటుకోదు. అట్లే శివజ్ఞానము పొందిన వారికిని లోకవ్యవహారములు అంటుకోవు. అట్టివారు దగ్ధరజ్ఞువులగుదురు.
హృదయ పద్మమనెడి పీఠమున జ్ఞానమనెడి దీపము గల ఈ శరీరాన్ని శివుని గృహంగా మలచుకోవాలి. శివపరమాత్మ సర్వప్రాణుల హృదయములనెడి గృహమందున్నాడు. కావున సర్వప్రాణులను ప్రేమించాలి.
సూర్యుడు ఒక్కడే అయినను తన తేజస్సు చేత విశ్వమంతా ప్రకాశంతో నింపుచున్నాడం. ఆత్మస్వరూపుడైన శివుడు ఇచ్చా, జ్ఞాన, క్రియ, శక్తి భేదములచే విశ్వవ్యాపకుడై శోభించుచున్నాడు. ఆకాశమున పుట్టిన మబ్బులు ఆకాశమందే అణగిపోయినట్లు శివజ్ఞానము పొందిన వారి యందు వివిధ వికారాదులన్నియు అణగిపోవును.
సూర్యోదయము నుండి పనిచేయకుండా వ్యర్థంగా కాలము గడిపివేసి, ఆత్రపడకుండా సాయంసంధ్యాసమయము సమీపిస్తున్నదని తలంచి కాయకష్టము చేసి రేపటికేదైనా తినడానికి సంపాదించుకోవడానికి పనికోసం వెంపర్లాడుచున్నట్లు ఆశత్ర పడకుండా వయస్సుండగనే పరమేశ్వరుని శరణాగతి పొంది తరించాలి. దీపముండగనే ఇల్లు చక్కబెట్టుకోవాలి గదా!
No comments:
Post a Comment