Wednesday, August 24, 2022

ఒక భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళి స్వామీ! ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా సంసారలంపటం వదలడం లేదు. ఏం చేయాలి?

 ఒక భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరకు వెళ్ళి స్వామీ! ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా సంసారలంపటం వదలడం లేదు. ఏం చేయాలి? అని అడిగాడు.

 దానికి చిరునవ్వుతో చిన్న పిల్లవాడు స్తంభాన్ని గట్టిగా పట్టుకొని స్తంభం నన్ను వదలడంలేదని ఏడ్చినట్టు... సంసారం నిన్ను పట్టుకుందా, నువ్వు సంసారాన్ని పట్టుకున్నావా? ఆలోచించుకో' సమాధానం దొరుకుతుంది...' అన్నారు.

సంసారమనే సరస్సులో మోహమనే మొసలికి చిక్కిన గజేంద్రుడు వంటి ప్రతి జీవి ఎంతకాలం ప్రయత్నించినా సు-దర్శనం అనే బుద్ధితో మోహమనే బంధనాన్ని ఖండించకపోతే సంసార బంధనాలు వదులుకోలేడు. జడభరతుడు పరమ భాగవతోత్తముడు, బ్రహ్మజ్ఞాని. రాజ్యాన్ని సంసారాన్ని త్యజించి మోక్షార్డియై తపస్సు చేసుకోసాగాడు. 

ఒకరోజు తల్లిని కోల్పోయిన ఒక లేడి పిల్లను రక్షించి దాన్ని పోషించసాగాడు. క్రమంగా దానిపై మమకారం పెరిగి మరల సంసారబంధనాల్లో చిక్కుకున్నాడు.

 మరణకాలంలో భగవన్నామ స్మరణ మరచి ఆ లేడిపిల్లనే తలచుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఫలితంగా మరుజన్మలో లేడిగా జన్మించాడని కథ.

 విశ్వామిత్రుడు త్రిశంకుస్వర్గ సృష్టికర్త గాయత్రీమంత్రస్రష్ట ప్రపంచాన్నే జయించగల ఆస్త్రశస్త్ర శక్తి సంపన్నుడు. కానీ అరిషడ్వర్గాలను జయించలేక పలుమార్లు మోహబందనాల్లో చిక్కుకున్నాడు.

"నాది' అనే భావన ప్రతి జీవిలో ఉంటుంది. అదే మోహానికి మూలం 'మోహం అత్యంత వినాశకారియైన మృత్యువు వంటిది. మోహాన్ని జయించిన వ్యక్తే మోక్షాకాంక్షతో ముక్తిమార్గం చేపట్టడానికి అర్హుడు' అంటారు వివేకచూడామణిలో శంకరులు, మోహం ఆహాన్ని, ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది. ఇవి మనిషిని చింతలపాలు చేస్తాయి. ఈ చింతలు రగిల్చే చింతాన్ని చితాగ్ని కంటే ఘోరమైంది. చితాగ్ని శవాన్ని మాత్రమే కాల్చి బూడిద చేస్తుంది. కానీ చింతాన్ని బడబాగ్నిలా మనసును కంటికి కనపడకుండా అనుక్షణం దహిస్తూనే ఉంటుంది అన్నాడు
ముల్లును ముల్లుతోనే తీయాలి. కాలిలో దిగిన ముల్లు తీయడానికి మరో ముల్లు ఉపయోగిస్తాం. కాలిలో బాద కలిగించిన ముల్లుతోపాటు, బాధానివృత్తి చేసిన ముల్లునూ అవతల పారేస్తాం. చెడుభావాలను మంచిభావాలతో తొలగించాలి.. తరవాత మంచిచెడులు రెంటికీ అతీతంగా ఉండగలగాలి. అప్పుడు వాటి ఫలితాలు మనసుకు బంధనాలు కావు. బంధహేతువైన మననే మోక్ష హేతువుగా మారుతుంది.

కొలనులోని బురదలో తామర మొక్క పుడుతుంది. కానీ బురదను అంటదు. దాని ఆకు నీటిపైన తేలుతూ ఉంటుంది. పైనపడిన నీటిబిందువును ముత్యంలా మెరిపిస్తుంది కానీ ఆ నీటిబిందువులను తనకు అంటనీయదు. పూల సౌరభాన్ని వెదజల్లుతూ, ప్రకృతికి శోభ కలిగిస్తూ, తుమ్మెదలకు మకరందాన్నిస్తూ ప్రశాంతంగా జీవిస్తుంది. అలా ఉన్నవాడే నిస్సంగుడవుతాడు.

నిస్సంగత్వం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల క్రమంగా మోహం నశిస్తుంది. మనసు చలించకుండా భగవంతుడిపై నిలుస్తుంది (నిశ్చలతత్వం), తద్వారా సమస్త కర్మబంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది.

అదే మోక్షం.. జీవన్ముక్తి! సంసారమనే విషవృక్షానికి రెండే రెండు అమృతఫలాలు. సజ్జనసాంగత్యం, సద్దందపరనం. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సూక్ష్యాన్ని శంకర భగవత్పాదులు 'భజగోవిందం'లో 'సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వ నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వం జీవన్ముక్తి అని సూత్రీకరించారు. నిస్సంగత్వ సిద్ధికి నిరంతర సాధనే మార్గం..

🔹🔸🔹🔸🔹🔸

No comments:

Post a Comment