Monday, August 29, 2022

🌺మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి?🌺

🌺మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి?🌺

🌷🌷🌷🌷🌷🌷

🌿ఇది అందరూ అడిగే ప్రశ్న. దానికంటూ బోలెడు ప్రయత్నాలు - పద్ధతులు అవలంబిస్తుంటారు. అన్వేషిస్తుంటారు. కానీ ఎంతమేరకు సాధించగలుగుతున్నారు? 

🌿ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతున్న రోజులివి. పరుగుల జీవితంలో నిదానం కరువౌతోంది! ఈ పరిస్థితుల్లో సరియైన పరిష్కారం దేని నుండి సాధించగలం?

🌿నిజానికి ఈ ప్రశ్న ఏ కాలంలోనైనా సహజమే.
మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది?

🌿ఈ 'శాంతి' అనే వస్తువు ఎక్కడో దాగి ఉండలేదు మనస్సులోనే ఉంది. దానిని గ్రహించలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.

🌿'ఉన్నదానితో సంతృప్తి చెందితే జీవితంలో ఎదగలేం' అన్నది ఎంత నిజమో, 'సంతృప్తి లేనివాడు ఎన్నడూ హాయిగా ఉండలేడు. అంతులేని ఆశతో యాతన పడతాడు' అనేదీ నిజమే. ఈ రెండు సత్యాలు పరస్పర విరుద్దాలుగా కనబడడం సహజం.
ఇలాంటి ఎన్నో జీవితంలో తారసపడతాయి. 'ఆలస్యం అమృతం విషం' అన్న సూక్తి మాదిరిగానే 'నిదానమే ప్రధానము' అనే సుభాషితం ఉంది. 'విద్యా విహీనః పశుః' అనే మాటతో పాటు, 'చదువుకున్న వాని కంటే సంస్కారవంతుడు మేలు' అనే అర్థం వచ్చే సామెతలూ ఉన్నాయి.

🌿అంటే ఏదీ పూర్తి సత్యంగా తీర్మానించి జీవితాన్ని వెళ్లదీయలేం. ప్రతి దానికీ ఒక 'సమతౌల్య కేంద్రం' ఉన్నదిగా అని పై ప్రసిద్ధ వాక్యాల నడుమ సమన్వయ సూత్రం. ఆ కేంద్రాన్ని పట్టుకోగలిగినప్పుడు శాంతిని సాధించగలం.

🌿కొన్ని లక్ష్యాల ఆశయాలు కలిగి ఉండడం సహజం. అలాగే కొన్ని అంచనాలు, ఆశలు ఉంటాయి. వాటికి విరుద్ధంగా సంఘటనలుంటే అశాంతి. కానీ మనం ఊహించినట్టే అన్నీ ఉండాలనీ, ఉంటాయని అనుకోవడమూ పొరపాటే.
జీవితం గురించి లోతుగా ఆలోచించలేని వారు ఆశల సాఫల్యాల వైఫల్యాలకు పొంగి, కుంగి పోతుంటారు.
మనస్సును అదుపులో ఉంచుకోవడమే శాంతికి మూలం. కానీ అది అంత తేలిక కాదు. కానీ ప్రయత్నిస్తే అసాధ్యం కాదు.

🌺1. మనం చేయదగినంత చేసినప్పుడు ఫలితంగా లభించిన దానితో తృప్తిగా, సర్దుకుని జీవించగలగాలి దీనిని మన తత్త్వశాస్త్రం 'యదృచ్ఛా లాభ సంతృష్టి' అన్నది. ధర్మబద్ధంగా, శ్రమతో సాధించిన దానితో తగిన విధంగా జీవన శైలిని మలచుకునే వారు శాంతిగా ఉంటాడు.

🌺2. ఒక లక్ష్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా లభించనప్పుడు, ఇంక దానికోసమే కాలయాపన లేకుండా - మన ప్రయత్నంతో సాధించగలిగే మరో ప్రయోజనం కోసం ప్రయత్నించడం శ్రేష్ఠం. పరిష్కరించలేని, ఊహించని కష్టం వచ్చినప్పుడు - దానిని తొలగించడం అసాధ్యమన్నప్పుడు - ఆ సమస్యతోనే మరో విధంగా ఎలా సుఖంగా జీవించగలమో చూడాలి.

ఉదా: అనుకోకుండా ఆధారమైన ఆత్మీయులు అస్తమిస్తే హతాశులమైనా, నెమ్మదిగా కోలుకుంటూ ఆ లోటు నుండే మరో బ్రతుకు తీరును మలచుకొని జీవించడాలను చూస్తున్నాం.

🌺3. పోల్చి చూసుకోవడం కూడా అశాంతికి హేతువు. ఆదర్శానికి పనికి వచ్చే పోలికలు, కొన్ని సార్లు ఆందోళనకీ, ఆవేదనలకీ హేతువౌతాయి. ఒకరికి ఉన్నది మనకి లేదే, అనే వేదన కంటే - నాకు అవసరమైనవి ఉన్నవా లేవా అని పరిశీలించడం ముఖ్యం.

🌺4. మన చుట్టూ ఉన్న ఆనందాలను గమనించడం నేర్చుకోవాలి. అవకాశాలను పరికించాలి. దిక్కులేని బ్రతుకు వల్ల ఏమీ సాధించలేని వారిని చూసినప్పుడు - తల్లిదండ్రులు పాలనలో పెరిగిన అదృష్టానికి ఆనందించాలి. అన్ని అవయవాలు పని చేస్తున్నందుకు సంతోషించాలి. అదే విధంగా - ఇంద్రియాల లోపాలున్నా ఉత్సాహంగా, ఎన్నిటినో సాధించిన వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండడం స్వభావం చేసుకున్నప్పుడు శాంతి సహజంగా ఉంటుంది.

🌺5. పరిస్థితులపై, మనుష్యులపై 'తమ అశాంతికి కారణం' అని ఆరోపించే ధోరణీ తప్పే, సర్దుబాటు, సవరణ - జీవితంలో తప్పవు. మనకి లభించిన శరీరంతో, దాని శక్తితో సర్దుకుంటూనే సాధ్యమైనంత సవరించుకుంటున్నాం. సవరించుకోలేని వాటిని సరిపెట్టుకుంటున్నాం.
ఇదే ధోరణి మానవ సంబంధాలలోనూ, సంఘటనలలోనూ కూడా కొనసాగాలి.

🌺6. అనుకోని దుఃఖం ఇవాళ వచ్చినట్లే, అనుకోని సుఖమూ ఎప్పటికైనా రావచ్చు- అనే ఆశావాదమూ ముఖ్యమే.

🌺7. ' వేదాంత వాక్యాలు' అని తోసిపుచ్చినప్పటికీ - వివేక వైరాగ్యాలు శాంతికి, మనసు నిబ్బరానికి దోహదపడతాయి. కలవరపరచేవేవీ స్థిరం కాదనీ, కేవలం తన ఆలోచనలే ఆందోళనకి గానీ, ఆనందానికి గానీ ఆలంబనలౌతున్నాయని గమనించగలిగితే చాలు.
ఒక ప్రవాహానికి కాసింత తలవంచినా, అది దాటగానే తిరిగి నిలబడగలిగే వృక్షంగా తలఒగ్గడం, తల ఎత్తడం... అనేదీ ఆయా పరిస్థితుల్లో అనుగుణంగా చేయగలిగినవాడు విజయవంతుడౌతాడు.
ఏ విషయంలోనూ, ఎవరితోనూ ఎక్కువ రాగద్వేషాలను పెంచుకోరాదంటుంది వేదాంత శాస్త్రం. అదే రీతిలో లక్ష్యాలను అతిగా ఏర్పరచుకొని వాటి కోసం ఆరోగ్యాన్నీ, ధర్మాన్నీ కూడా పట్టించుకోని రీతిగా శ్రమించడమూ అశాంతికి హేతువే.

''మన యేవ మనుష్యాణాం కారణం బన్ధమోక్షయోః" అనే వేదాంత వాక్యం అక్షర సత్యం. మన మనస్సే మన బంధానికీ, మోక్షానికి కారణం.

🌿అఖండ మనశ్శక్తిని అల్ప సుఖాల కోసం, అల్ప ప్రయోజనాల కోసం వెచ్చించి - దానిని గుర్తించలేక పోతున్నాం. వినియోగించుకోలేక పోతున్నాం.
తగిన సరళిలో అదుపులో పెట్టుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు సమస్యలకు చలించిపోము.

🌿ఒకే సంఘటనకు ఒకడు విలవిలలాడి కుప్పకూలితే, అదే సంఘటనకు మరొకడు నిబ్బరంగా ముందుకు సాగడం - మనం నిత్యం జీవితంలో చూస్తూనే ఉన్నాం.
అందుకే పరిస్థితులు శాంతికీ, అశాంతికీ హేతువులు కావు. మనస్సు స్పందించే తీరే ప్రధానం.🙏

-✍️ ''బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు" రచించిన వ్యాసం.]🙏🙏

🌷🌷🌷🌷🌷🌷 

No comments:

Post a Comment