🚩🌷భగవంతుని ముందు మనం సాధారణంగా అది కావాలనీ, ఇది కావాలనీ కామ్యార్థంగా ప్రార్థిస్తూ ఉంటాం🌷🚩
భగవంతుని ముందు మనం సాధారణంగా అది కావాలనీ, ఇది కావాలనీ కామ్యార్థంగా ప్రార్థిస్తూ ఉంటాం. కొంచెం యోచించి చూస్తే మనం ప్రార్థించవలసిన అవసరమే కనిపించదు. భగవంతుడు మనకు తండ్రియే కాదు, తల్లి కూడా. మన యోగ్యత ననుసరించి మనకు ఏది ఏ కాలంలో ఇవ్వాలో స్వయంగా ఆ జగన్మాత ప్రసాదిస్తుంది. కానీ ఈ వివేకం మనకు ఏ కారణం చేతనో ఉండడం లేదు.
అయితే ఈవిధంగా కామ్యార్థం ప్రార్థించడం పూర్తిగా తప్పు అని చెప్పడానికి వీలులేదు
గీతలో కృష్ణపరమాత్మ తన భక్తులను నాలుగు విధములుగా విభజించినాడు. కష్టములలో చిక్కుకొని దైవ సహాయమును అపెక్షిస్తూ ప్రార్థించేవాడు ఆర్తుడు. ఇహలోక సౌఖ్యములను అపెక్షిస్తూ ధనసహాయం కోరేవాడు అర్థార్థి. శాస్త్రములు, కళలు, దివ్యజ్ఞానము మొదలైన వానిని తెలుసుకోవాలని కోరేవాడు జిజ్ఞాసువు. నాలుగవ తరగతికి చెందినవాడు జ్ఞాని. అతడు నిష్కాముడు. భగవత్తత్త్వమును తెలుసుకున్న వాడు. ఈవిధంగా నాలుగు రకాల భక్తులను భగవంతుడు పేర్కొన్నాడు.
ప్రప్రథమంలోనే కర్మసన్యాసం చేయడమనేది కాని పని. అందరూ మొదటనే మోక్షకాములు కాలేరు. కోరికలున్న స్థితిలో కూడా, అంతా మనచేతులలోనే ఉందని భావించకుండా మనకు పైన ఈ ప్రపంచాన్ని నడిపే ఒక మహత్తర శక్తి ఉందని గ్రహించి ఆ అనుగ్రహ శక్తికి వినమ్రులై ప్రార్థించడం వివేకమున్నవారి లక్షణం
అలాంటపుడే అహంకారము నుంచి విముక్తులం కాగలం. మొదట కామ్యార్థం ప్రార్థించడం, పిదప చిత్తశుద్ధికొరకు, జ్ఞానప్రాప్తి కొరకూ, స్తోత్ర, ధ్యాన, నుతి ప్రదక్షిణాదులు చేయడం – అట్లా చేస్తే క్రమంగా మనకు వైరాగ్యం కలుగుతుంది. అందులకే లక్ష్మీ కటాక్షాన్ని అర్థించే వారిని భగవానుడు అర్థార్థులని నిర్వచనం చేశాడు. వారినీ భగవంతుడు భక్తవర్గంలోనే చేర్చినాడు.
మన ఆశలకు ఒక అవధి లేదు. అందులో దుర్జయమైనది ఐశ్వర్యం కావాలనే ఆశ. కానీ అర్థం అనర్థమని గ్రహించడానికి ఎంతో కాలం పడుతుంది. ఐహిక విషయాలపై పోయే మనస్సుకు, మోక్షార్థం ప్రార్తించాలన్న ఉద్దేశ్యం కూడా మాయమౌతుంది. మంచి సంస్కారాలుంటే కానీ మోక్షకాములము కాలేము. ఆ సంస్కారం వర్థిల్లాలంటే జ్ఞానం అంటే విద్య ఉండాలి. విద్యా స్వరూపిణి, భాగ్యలక్ష్మి, మోక్షలక్ష్మీ, - అన్నీ ఆ పరాశక్తి యొక్క వివిధ రూపములే. అనన్య భక్తికి మించిన అర్థం లేదు. అట్టి భక్తియే మన పాలిట భాగ్యలక్ష్మి.*
సేకరణ
No comments:
Post a Comment