Thursday, August 18, 2022

మోక్షమంటే ఆ అలౌకిక దర్శనానుభూతే తప్ప మరొకటి కాదు.

ॐశ్రీవేంకటేశాయ నమః
💝 ’ఐహిక సుఖం కోరుకునేవారు’, “పరం చాలనుకునేవారు”, ఇహపర సుఖాలు రెండూ కోరుకునేవారు’ అని మూడు రకాలవాళ్లుంటారు మనలో.
💖 పరసుఖం అంటే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ ప్రాప్తించదు. ఎన్నేళ్లు సాధన చేసినా, తపస్సు చేసినా రుషులందరికీ మోక్షం లభించలేదు. అందుకు పూర్వజన్మ సుకృతమూ ఉండాలి.
💓 మన దార్శనికక్షేత్రంలో మోక్షం అద్వితీయమైన పరమార్థం. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మచింతనలోను కనిపించని ప్రాధాన్యం మోక్షానికి మన సనాతన ధర్మచింతనలోనే గోచరిస్తుంది.
💕 సకల సంప్రదాయాల దర్శనమిది. చింతన అనేది అన్ని రకాలైన సత్యాన్వేషణకు పునాది. జీవితంలోని అన్ని లోపాలను సవరించి, దుఃఖాలనుంచి విముక్తి కలిగించే మార్గమే చింతన. అప్పుడే శాశ్వతానందపథం గోచరిస్తుంది. అదే మోక్షం. చతుర్విధ పురుషార్థ ఫలాల్లో మోక్షమే ఉన్నత స్థానంలో నిలబడి ఉన్నది.
💞 మనిషిచరమలక్ష్యం మోక్షప్రాప్తి. భారతీయ తత్వదర్శనంలో మోక్షం పరమోత్కృష్ట మూల్యం, సర్వశ్రేష్ఠ పురుషార్థం. దార్శినికులు ఆస్తికులు, నాస్తికులుగా విభిన్న అభిప్రాయాలు కలవారుగా ఉన్నప్పటికీ, భారతీయ సంప్రదాయాలన్నీ ఏకగ్రీవంగా మోక్షాన్నే సమర్థిస్తాయి. జీవితానికి చరమలక్ష్యంగా అంగీకరిస్తాయి.
❤️ మోక్షం ఆత్మకు సంబంధించింది. నాస్తిక సంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది. మోక్షానికి బౌద్ధం 'నిర్వాణం' అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవటమే నిర్వాణం. మోక్షేచ్ఛకు నిర్వచనం కూడా దాదాపు అదే. జైనమతమూ మోక్ష సిద్ధాంతాన్నే చరమ లక్ష్యంగా భావిస్తుంది.
💝 మోక్షం ఒక నిరానందస్థితి. ఇది తత్వజ్ఞానం వల్ల లభిస్తుంది. న్యాయ ధర్మ సిద్ధాంతాల అనుసారం తత్వజ్ఞానమంటే ఆత్మను శరీరం, మనసు ఇంద్రియాల నుంచి వేరుగా తెలుసుకోవడం. ఈ జ్ఞానం పఠన, శ్రవణ, మనన విధి ధ్యాసలవల్ల కలుగుతుంది. ఇవే మోక్షమార్గాలు.

💝 సాంఖ్య-యోగ దర్శనాలు మోక్షమంటే కైవల్యమనే చెబుతున్నాయి. దుఃఖం నుంచి సర్వులకూ విముక్తి కలిగించేది అదే. కైవల్యంలో సుఖం కూడా ఉండదు. అంటే అది శుద్ధచైతన్యావస్థ. ఈ స్థితి జ్ఞానంవల్లనే సిద్ధిస్తుంది.
💓 మోక్షసాధనాల్లో సర్వోత్కృమైన సాధనం భక్తే. భక్తి వల్లనే అంతర్యామి అనురాగం, ఆశ్రయం లభిస్తాయి. అద్వైతం జ్ఞానానికి ప్రాధాన్యమిస్తుంది. విశిష్టాద్వైతం భక్తికి ప్రాముఖ్యమిస్తుంది.
💓 ఒక్కమాటలో చెప్పాలంటే మోక్షం ఒక సమర్పణభావం. ఇది అంత సులువు కాదు. అది ఒక పావన భావన. అందులో నిరహంకారం, వినయం, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం నిండుగా ఉండాలి.
💖 అత్యంత దుర్లభమైన ఈ మానవ జన్మ లభించాక కూడా మోక్షప్రాప్తికి యత్నించని, తపించని మానవుడు మూఢుడు. జడుడే.
💕 పాపానికైనా, పుణ్యానికైనా ఈ శరీరం సహకరించాల్సిందే. కనుక సత్కర్మల కోసమే ఈ శరీరాన్ని స్వస్థతతో కాపాడుకోవాలి. ముక్తి కోసం ధ్యానయోగాల్ని, ధ్యానయోగాల కోసం జ్ఞానాన్ని, జ్ఞానం కోసం ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ధర్మాచరణ కోసం శరీరాన్ని ఆరోగ్యవంతంగా సంరక్షించుకోవాలి. కనుక మోక్షప్రాప్తికి శరీరారోగ్య పరిరక్షణ అత్యావశ్యకం.
💞 సాంసారిక వాసనలతో నిండి ఇంద్రియచాపల్యం కలిగించే కర్మలు చేస్తున్న మానవుడికి పరమ తత్వజ్ఞానం అవగాహన కాదు. త్రికరణ శుద్ధిగా పవిత్రుణ్ని చేసే విద్యే విద్య. అటువంటి విద్యనే సాధకుడు హస్తగతం, మనోగతం చేసుకోవాలి. ఆచరణతో జీవనలక్ష్యంగా స్వీకరించాలి. అందుకు సద్గురువు సహకారం అనివార్యం.
❤️ ప్రాణ, మానమోహాలు వీడి, మమతాను బంధాలు త్యజించి, ధర్మవ్రతుడై ఏకాగ్రతతో ప్రణవం జరిపించి, జితేంద్రియుడై, ఐహిక శృంఖలాల నుంచి విముక్తి పొందడమే మోక్షం. అటువంటి మోక్షానికి మనసు దర్పణమై ప్రకాశిస్తుంది. అందులో విశ్వపురుషుడి ప్రతిబింబమే ప్రభాసిస్తుంది. మోక్షమంటే ఆ అలౌకిక దర్శనానుభూతే తప్ప మరొకటి కాదు.
❤️ ॐశ్రీవేంకటేశాయ నమః

సేకరణ# 

No comments:

Post a Comment