Monday, August 15, 2022

గీతామృతం* 👌 *ఆత్మదర్శనంతో...

👌 *గీతామృతం* 👌
*ఆత్మదర్శనంతో...*
✍️ డాక్టర్ వైష్ణవాంఘ్రి సేవకదాసు 
అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘము (ఇస్కాన్)
(భగవద్గీత యథాతథము ఆధారంగా...)
💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

🌈 భౌతికరంగంలో అయినా ఆధ్యాత్మిక రంగంలో అయినా పురోగ మించాలంటే ఆత్మవైపు ప్రయాణం తప్పదు. సహజంగా ఏ మనిషైనా శారీరక మానసిక స్థితులలోనే ఎక్కువగా స్థితుడై ఉంటాడు. నిజానికి జంతువు సర్వదా ఈ స్థితులలోనే ఉంటుంది. అయితే మనిషి భౌతిక రంగంలో పురోగమించాలంటే శారీరక, మానసిక స్థితులను దాటుతూ బుద్ధి వైపు ప్రయాణించాలి. బుద్ధి స్థితి తర్వాత ఉన్నదే ఆత్మస్థితి.

🌈 భౌతిక విజయాలను సాధించగోరే వ్యక్తి ప్రయాణం బుద్ధి దగ్గరే ఆగి పోతుంది. కాని ఆధ్యాత్మిక రంగంలో పురోగమించాలనుకునే వ్యక్తి ప్రయాణం బుద్ధి వైపుగా సాగినా, బుద్ధి స్థితిలో ఆగిపోకుండా ఆత్మవైపు కొనసాగుతుంది. భౌతిక విజయాలను పరమాశ్చర్యకరమైన స్థాయిలో సాధించిన వ్యక్తులు దేహమానసిక స్థితులకు ఎక్కువగా పాధాన్యం ఇవ్వకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.

❓ *అయితే, ఆత్మ వైపు ప్రయాణం ఎట్లా మొదలవుతుంది?*

🌈 ఆత్మ అనేది మూడు ఆవరణలతో కప్పబడి ఉన్నదని అర్థం చేసుకోవడమే మొదటి అడుగు. సూటు బూటు వేసుకున్న వ్యక్తిని చూస్తే మనకు అతని కోటే కనిపిస్తుంది. కాని కోటు లోపల చొక్కా ఉంటుంది. దాని లోపల బనియన్ ఉంటుంది. బనియన్ లోపల వ్యక్తి ఉంటాడు. కోటును దేహంతో పోలిస్తే, చొక్కాను మనసుతోను, బనియన్ను బుద్ధితోను, అందులోని వ్యక్తిని ఆత్మతోనూ పోల్చవచ్చు. కోటు, చొక్కా, బనియన్ మార్చినా లోపలి వ్యక్తి అలాగే ఉన్నట్లే శరీరం, మనసు, బుద్ధి అనే మూడు ఆవరణలలో ఉన్నట్టి ఆత్మ శాశ్వతం.

🌈 ఈ విషయాన్నే శ్రీకృష్ణుడు భగవద్గీ తలో (2.22) విశదపరుస్తూ *“చివికిపో యిన వస్త్రాలను విడిచి మనిషి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తాడో ఆత్మ జీర్ణమైన దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని ధరిస్తుంది"* అని చెప్పాడు. చిన్నపిల్లవాడికి ఏ బట్టలు వేసుకోవాలో, ఏవి తీసివేయాలో తెలియదు. తల్లే అతనికి బట్టలు మారుస్తుంది. కాని ఆ పిల్లాడు పెద్దయ్యాక తనకు కావాల్సిన వస్త్రాలను తానే ధరిస్తాడు. అలాగే ఆత్మ గురించి తెలియనంత వరకు జీవులు పిల్లల్లాంటి వారే. అప్పుడు వారు ప్రకృతి ఏ దేహాలను ఇస్తే వాటిని ధరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో జీవుడు ఆశక్తుడు. 

🌈 కాని, ఆత్మను దర్శించిన వ్యక్తి తనకు ఎటువంటి దేహం కావాలో నిర్ణయించుకోగల్గుతాడు. దానిని సాధించగల్గుతాడు. ఉత్తమ జన్మలను పొందాలంటే ఆధోజన్మలను తప్పించుకోవాలంటే ఆత్మ దర్శనం అత్యవసరం!

🌈 ఆత్మ దర్శనం అంటే కాషాయాలు కట్టుకుని. గడ్డాలు పెంచడం కాదు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఇవేవీ చేయలేదు. శరీర మానసిక బుద్ధి స్థితులకు పరంగా ఉన్నట్టి ఆత్మ దర్శనం చేసి, దేహాన్ని యుద్ధ కర్మలలో నిలిపాడు. మనసులో కృష్ణపరమాత్మనే నిలుపుకున్నాడు. బుద్ధిని యుద్ధకార్యం చాకచక్యంగా చేయడానికి వినియోగించాడు. ఇదీ ఆత్మదర్శనం చేసిన వ్యక్తి వ్యవహారం. 

🌈 ఆత్మ దర్శనం చేయని వ్యక్తి శరీరానికే ప్రాధాన్యం ఇస్తాడు. మానసిక చింతలలో కుంగిపోతాడు. బుద్ధిని తగినంత ఉపయోగించడు. పశువుగా వ్యవహరిస్తూ తదుపరి జన్మలో పశువుగా పుడతాడు. అందుకే ఆత్మ దర్శనం అనివార్యం. దానితోనే శరీరం మనసు, బుద్ధి అన్నీ బాగుపడతాయి. 

No comments:

Post a Comment