0302. 2-5. 220223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రామానుజాచార్యులు గారి*
*మహిమ*
➖➖➖✍️
*యాదవ ప్రకాశాచార్యులు జ్ఞానోపదేశం చేయడంలో సమర్థులుగా పేరుగాంచారు. విశిష్టాద్వైత సంప్రదాయానికి మూలపురుషుడైన శ్రీ రామానుజాచార్యులు ఆయన వద్ద చదువుకొనే రోజుల్లో ఒక సంఘటన జరిగింది.*
*శిష్యుడైన రామానుజాచార్యులవారి తేజస్సును, బుద్ధికుశలతను చూసి గురువు యాదవ ప్రకాశాచార్యులు లోలోపల అసూయ చెందేవారు.*
*ఆ రోజుల్లో కాంచీపురాధీశ్వరుడి కుమార్తెను ఒక పిశాచం ఆవహించింది. అందుచేత ఆప్తులందరికీ మనస్తాపం కలిగింది. దేశదేశాల నుంచి మాంత్రికులు రప్పించబడ్డారు. రాజకుమార్తెను ఆవహించిన పిశాచాన్ని వదలించడానికి వారంతా శాయశక్తులా ప్రయత్నించారు కాని ఫలితం శూన్యమే అయింది.*
*సదాచారసంపన్నులు, జ్ఞానమూర్తులు, మంత్రసిద్ధులు అయిన యాదవ ప్రకాశాచార్యులు తపోమహిమాన్వితులు కనుక వారిని కూడ రప్పించమని రాజుకు కొందరు సూచించారు.*
*తక్షణమే బయలుదేరి రమ్మని యాదవ ప్రకాశాచార్యులవారికి రాజునుంచి ఆహ్వానం వచ్చింది. వెంటనే ఆయన తన శిష్యులతో బయలుదేరాడు. రాజాస్థానం చేరుకొని రాజకుమార్తెను చూసి మంత్రపఠనం ప్రారంభించారు.*
*అప్పటివరకు ఒక మూల కూర్చుని శూన్యంలోనికి చూస్తున్న రాజకుమారి భయంకరరూపం దాల్చి గంభీరంగా ఇలా అన్నది: “ఓయి మాంత్రికా ! ఆజన్మాంతం మంత్రాలు వల్లిస్తున్నప్పటికీ నన్ను నువ్వేమీ చేయలేవు. నన్ను తరిమివేయడం నీ తరంకాదు. నేను తలచుకొంటే ఇక్కణ్ణుంచి నిన్ను క్షణంలో తరిమివేయగలను. నేను సామాన్య పిశాచాన్ని కాను, బ్రహ్మరాక్షసిని.”*
*ఆ మాటలకు యాదవ ప్రకాశాచార్యులు భయపడి అక్కడనుంచి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు.*
*అప్పుడు రామానుజాచార్యులు రాజకుమార్తె ముందుకు వెళ్ళి ఆ పిశాచాన్ని ఉద్దేశించి, "అయ్యా! దయనీయమైన ఈ దుర్దశ మీకెందుకు ప్రాప్తించింది? కారణం ఏమిటో చెప్పగలరా” అంటూ సౌమ్యంగా అడిగాడు.*
*అందుకు రాజకుమార్తెను ఆవహించిన బ్రహ్మరాక్షసి దుఃఖపూరిత స్వరంతో, ప్రార్థనాపూర్వకంగా ఇలా అన్నది: “నాయనా! నేను వేద వేదాంగాలలో ఆరితేరిన పండితుణ్ణి. నా విద్యను ఇతరులకు ఉపయోగపడకుండా దాచేసుకొన్నాను; ఎవ్వరికీ విద్యాదానం చేయలేదు. దాని ఫలితమే నాకీ దుర్దశ. నువ్వు బాలుడవైనా తేజోవంతుడవు; నన్ను కనుగొనగలిగావు. నువ్వు పుణ్యమూర్తివి. పావనమైన నీ చేతిని నా తలమీద ఉంచితే ఈ దుర్గశనుంచి నాకు విముక్తి లభిస్తుంది.”*
*భగవదంశగల రామానుజాచార్యులు ఆ రాక్షసి కోరినట్లుగా రాజకుమార్తె తలమీద తన చేతిని ఉంచి ధ్యానించడం ప్రారంభించిన మరుక్షణమే ఆ బ్రహ్మరాక్షసికి విముక్తి కలిగి, రాజకుమార్తెను వదలి వెళ్ళి పోయింది.*
*అక్కడ చేరిన వారందరూ రామానుజాచార్యుల మహిమను, ఆత్మ బలాన్ని వేనోళ్ళ ప్రశంసించారు. ఈ వార్త అన్ని రాజ్యాలలోను ప్రచారమై నాటినుంచి రామానుజాచార్యులను దైవస్వరూపంగా భావించి పూజించసాగారు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment