Wednesday, May 1, 2024

 శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో అంటారు... 
ఇవి రెండు ఎవరికైతే బంధంగా తోస్తాయో, వారికి ఆ జన్మలో ముక్తి లభిస్తుంది. 
లేకపోతే లభించదు. 
ఈ రెండు బంధంగా తోచాలంటే, 100 జన్మలలో సుకృతం చేసి ఉండి, ఆ సుకృతం అంతా ఓకే జన్మలో ఫలించాలి. 
అప్పుడు అతనికి కర్మ బంధంగా తోస్తుంది, 
జన్న బంధంగా తోస్తుంది. 
అప్పుడు అతను తీవ్ర ముముక్షువు అవుతాడు. ఎంతమందో పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేసిన వారైనప్పటికి, 
ఎంతమందో మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నామనే వారికి, 
ఎంతమందో ప్రస్థాన త్రయం అధ్యయనం చేస్తున్నవారు ఉన్నప్పటికీ, వాళ్ళు మోక్ష పదం పరమ పదం, గచ్ఛంతి అనామయం అనే స్థితికి చేరుకున్నామా అంటే.. 
ఎవరు చేరుకో గలిగిన వారు అవుతారు? 
కర్మ బంధంగా తోచాలి, 
జన్మ బంధంగా తోచాలి. వాడే చేరగలడు. 
కర్మ బంధంగా తోచడం అంటే ఏమిటి?
      యోగిరామ్ బలరామ కృష్ణయ్య గారు చెప్పారు. అరమోడ్పు కన్నులతో సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠుడైన జ్ఞానికి కన్నులు ఎత్తి చూడడం బంధ హేతువు. 
కనురెప్పలు ఎత్తే ఎందుకు చూడాలి అంటాడట. కనురెప్పలు ఎత్తి చూడడం కూడా బంధ హేతువే అని భావించేవాడు ఎవడో.. వాడికి కర్మ బంధమని తోచింది.

జన్మ బంధం అని ఎవరికి తోచినట్లు? 
బీజములో నుంచి అంకురము అంకురించడం జీవచైతన్యం. 
అలా ఏ ఒక్క బీజములను మిగిల్చుకోకుండా కర్మ బీజములను జ్ఞానాగ్ని యందు దగ్ధమొనర్చుటయే జన్మ బంధమును పోగొట్టుకొనుట.
అది లభించే వరకు విశ్రమించడు.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం అయ్యేవరకు విశ్రమించడు. 
అప్పుడు బంధ రాహిత్యం, నిత్య ముక్తుడు. మరల జన్మకు రావలసిన అవసరము ఉండదు. 

నేను ఆల్రెడీ పుట్టాను అన్నదే పెద్ద బంధము అన్నావనుకోండి. అప్పుడు ఏ గొడవ లేదు. అప్పుడు అది పరశివము. 

కాబట్టి చాలా జాగ్రత్తగా ముముక్షువులు అయినటువంటి వారు బాగా తరచి చూసుకోవాలి. 
కర్మ నీకు బంధం అనిపిస్తోందా, 
జన్మ నీకు బంధం అనిపిస్తోందా! 
అప్పుడు నీకు బుద్ధి యోగం పని చేస్తుంది. 'సమత్వం యోగ ఉచ్యతే' ప్రయోజనశీలం అవుతుంది. 
ఏమిటి దీని వల్ల ప్రయోజశీలం.. 'గచ్ఛంతి అనామయం'. 
పరమాత్మ జీవాత్మ మధ్య ఎట్టి భేదం లేదు. 
జీవోబ్రహ్మైవ నపరః
ఏకం సత్ బ్రహ్మ, 
సర్వం ఖల్విదం బ్రహ్మ,
నేహ నా నాస్తి కించన, 
అయం ఆత్మా  బ్రహ్మ... ఇత్యాది నిర్ణయములు కలుగుతాయి. 
దీనికే బుద్ధి యోగము అని పేరు.
           
విద్యాసాగర్ స్వామి 
భగవద్గీత -24

No comments:

Post a Comment