[6/26, 05:18] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 18🌹
👌దైవానికి, దేహానికి మనసే వారధి👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
🌈 18. దైవానికి, దేహానికి మనసే వారధి 🌹
✳️ మనందరికీ మనసు, దేహం అనుభవంలో ఉన్నవే. ఈ దేహం అవసరాలు తీర్చే సేవకురాలిగా, ప్రమాదాలను గుర్తించి కాపాడే రక్షకురాలిగా వ్యవహరించడమే మన మనసు ఉద్దేశం. అందుకే మన మనసుకి శరీరస్పృహ ఇవ్వబడింది. మనసుకి ఈ స్పృహ అనే లక్షణం దాని మూలమైన ఆత్మచైతన్యం నుండి వచ్చిందే. మనలోనే ఆత్మగా ఉండే దైవానికి, కర్మలుచేసే ఈ దేహానికి వారిధిగా మనసు పనిచేస్తుంది. తనకు బాహ్యంగా ఉండే ఈ శరీరానికి సంబంధించిన ఆకలి, దాహం, నిద్ర, నొప్పి వంటి అవసరాలు గుర్తించడమే మనసు పని. అయితే ఈ దేహానికి చాకిరి చేయడంలో తనకు మూలమైన దైవాన్ని అది మర్చిపోతుంది. అదే అహంకారంగా పెరిగి అసలు దైవాన్ని తెలుసుకో నివ్వకుండా చేస్తుంది. కేవలం దేహ అవసరాలు తీర్చాల్సిన మనసు తన బాధ్యతను సుఖాలకోసం దుర్వినియోగం చేసి తాను దుఃఖపడుతుంది. శరీరం కోరుకోని విలాసాలను దానికి అందించే ప్రయత్నంలో మనసు శాంతికి దూరం అవుతుంది.
✳️ మనసంటే కేవలం వికారాలతో, కోర్కెలతో నిండిందికాదు. అవన్నీ మనసుకు అదనంగా వచ్చిచేరినవే. మనకి దేవుడిచ్చిన వరంగా ఉండాల్సిన మనసు వికారాల చేత శాపంగా మారుతుంది. తనకు బయటవైపు ఉన్న దేహ అవసరాలు తీర్చుతూ తనలోనే ఉన్న ఆ దైవాన్ని తెలుసుకోవడం మనసు కర్తవ్యం. అసలు మనసే లేనివాడు చెట్టుతో సమానం. కోమాలో ఉన్న వ్యక్తి పరిస్థితి అదే. దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. దేహఅవసరాలు తీర్చటంలో మమేకమైన మనసు ఆ పనులన్నీ తనవేననుకుని కర్తృత్వాన్ని పెంచుకుంటుంది. అదే బంధమౌతుంది. నిరంతరం బాహ్యదృష్టి వల్ల మనసు కనీసం తనను వెన్నంటి ఉన్న దైవాన్ని స్మృశించ లేకపోతుంది. ప్రత్యక్షంగా తెలుస్తూ వస్తున్న జన్మజన్మల శరీరస్మృహ ముందు లీలగా స్పర్శించే దైవాన్ని మనసు తెలుసుకోలేకపోతుంది. శరీర అవసరాలను తనవిగా భావించి 'నాకు దాహంవేస్తుంది’, నాకు ఆకలివేస్తుంది' అని ఆపాదించు కుంటుంది. శరీరానికి అవసరమైన శక్తిని మనసు తన మూలంలోని ఆత్మనుండే తెచ్చుకుంటున్నా అది గుర్తించడంలేదు.
✳️ వేదికపై బహుమతులు పంచే అతిధి వాటిని తీసుకునే వాళ్లను చూస్తాడుగానీ అవి తన చేతికందించే వాళ్లని చూడనట్లే మనసు తనకు శక్తినందించే మూలాన్ని చూడదు. అందుకే, మనసు ఈ దేహ స్పృహతో ఉండగా దైవాన్ని తెలుసుకోలేదు. శరీర అవసరాలు తీర్చేవిషయంలో మనసుకు ఏర్పడ్డ అభిరుచులు, అయిష్టాలే మనసుని బంధిస్తాయి. అనుక్షణం ఈ దేహసేవల్లో నిమగ్నమయ్యే మనసు తనలో ఉన్న ఆ విదేహాన్ని ఎలా తెలుసుకుంటుంది.
✳️ ఆధ్యాత్మిక జీవితమంటే మనసును వీలైనంత భౌతికదృష్టి నుండి దైవంవైపు మరల్చటమే. మనసును కేవలం శరీర అవసరాలు గుర్తించేంతవరకూ వాడుకోగలిగితే తనలోనే ఉన్న దైవస్పర్శ తనకు తెలుస్తుంది. మనలోనే ఉన్న దైవం మన అవసరాలు కోర్కెలు తీర్చడానికి మనసునే మధ్యవర్తిగా ఉపయోగిస్తున్నాడు. కానీ ఈ 'మధ్యవర్తి మనసు’ అటు దేహ అవసరాలనూ, వాటిని తీర్చే దైవశక్తినీ తనవిగా భావించి ఆపాదించుకుంటుంది. మనసుకి ఈ కర్తృత్వభావం తగ్గాలంటే ముందు కోర్కెలు తగ్గాలి. అప్పుడే మనసు తనమూలమైన దైవంతో సహజీవనం చేయగలుగుతుంది. మనలో పరమాత్మ తేజోశరీరంతో కూడిన చైతన్య స్వరూపంగా ఉంటాడు. అది ఈ కళ్ళకు దర్శనమయ్యేది కాదు. సాధనతో మాత్రమే మనసు ఈ రూపాన్ని ఇంద్రియాలకు అతీతంగా తెలుసుకోగలుగుతుంది. అదే మన మనసుయొక్క లక్ష్యం, ఉద్దేశం కూడా. కానీ అచ్చంగా దేహంతోనే కాపురం చేస్తున్న మనసు కేవలం గాఢనిద్రలో మాత్రమే దాన్ని వదిలి ఉంటుంది. చివరికి తాను శరీరాన్ని అనే భావనతోనే కలలు కనేంత బలంగా దేహ వాసనలు నాటుకున్నాయి. శరీరసుఖం కోసం అవసరానికి మించి చాకిరిచేయడం మనసుకు అలవాటయింది. దీనివల్ల మనసు కష్టం మరింత పెరుగుతుంది.
✳️ దాహం అడిగే శరీరానికి మనసు 'కూల్‌డ్రింక్' అందిస్తుంది. మళ్ళీ దాహంవేస్తే కూల్‌డ్రింక్ ఇస్తేగానీ శాంతించదు. ఇలా ప్రతిదీ జ్ఞాపకంగా మారి కష్టపడేది మనసే. వాస్తవానికి మన మనసు పరిపూర్ణ శాంతినే కోరుకుంటుంది. అందుకే అందరం శాంతినిచ్చే గాఢనిద్రను ఇష్టపడతాం. కానీ తాను కోరుకునే శాంతిని శాశ్వతంగా పొందాలనే జ్ఞాపకం కూడా ఉండనంత శరీరమమైకతలో జీవిస్తున్నాం. పైగా ఈ శరీరంగురించి ఆలోచనల పేరుతో మనసు అనేక భయాలు పెట్టుకుంటుంది.
✳️ సద్గురు శివానంద గురుదేవులు చెప్పినట్లు బస్సుఎక్కి కూర్చున్న తర్వాత ఇంకా ఎప్పటికి గమ్యం చేరతామోనని పదేపదే అనుకోవడం భయమే గానీ ఆలోచనలుకావు. ఆలోచన అంటే పనితో పాటుగాసాగే మనసు మాత్రమే. పనిలేకుండా జరిగే మనసు కదలికలు అన్నీ పరోక్షభయాలే. మనలో శుద్ధ చైతన్యంగా ఉన్న ఆత్మ అనునిత్యం దేహంతో చేరటంచేత అజ్ఞానంగా వ్యక్తం అవుతుంది. అలా దేహంతో కలవని మనసు గాఢనిద్రలో శుద్ధ చైతన్యంగానే ఉంటుంది. మెళకువరాగానే ఆ ఆనందానుభవాన్ని మరచిపోవడమే గాక మిధ్యాజ్ఞానంతో నిద్రనే అజ్ఞానంగా భావిస్తాం. తిరుగుతూ ఉన్న ఫ్యాన్‌ను చూడగలంగానీ దానికి ఆధారమైనది ఇంధనమా, బ్యాటరీనా, డైనమోనా, గోబర్‌గ్యాసా లేక మామాలు విద్యుత్ సరఫరానా అని తెలుసుకోలేం.
[6/26, 05:18] +91 73963 92086: కారణం అన్నింటి నుండి వచ్చే విద్యుత్తు ఒకేరకంగా ఉండటమే.
✳️ అలాగే, దైవాన్ని ఏరూపంలో కొలిచినా ఆయన మనని అనుగ్రహించేది ఆ శుద్ధచైతన్యమూర్తిగానే. ధ్యానం చేయడమంటే ఆ శుద్ధ చైతన్యాన్ని అనుభవించడం, మనసు వెనుక ఉన్న దైవంతో ప్రత్యక్షానుబంధం పెట్టుకోవడమే. అది మానేసి అనునిత్యం ఈ దేహ అవసరాల కోసం మనసు తన మూలమైన దైవం ముందు భిక్షాపాత్రతో నిలబడుతుంది. ఈ విశ్వానికే ఆధారమైన ఆత్మశక్తిని తానేనని తెలియక దానిముందే కోర్కెలతో దీనంగా విలపిస్తుంది. లఘుత్వం, గురుత్వం, చలత్వం అనే అనేక లక్షణాలతో నిత్యం పరిణామం చెందే ప్రకృతికి మన ఆలోచనలతో పనిఏముంది. ఆలోచన చేయలేని పిచ్చివాడు, ఆలోచనతోనే పనిలేని జ్ఞాని కూడా ఈ ప్రకృతిలో భాగంగా వివిధ పరిణామాలతో పోషించబడటం మనకి ప్రత్యక్ష అనుభవమే.
✳️ మనం ఎంతో మమకారం పెంచుకున్న ఈ దేహం మరొకరు వదిలేస్తేనే మనం వాడు కుంటున్నామని తెలిస్తే గానీ వ్యామోహం తగ్గదు. ఏ ప్రాణికైనా మరణానంతరం దేహం పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే. తిరిగి మరోకొత్తదేహం ఏర్పడేది కూడా అదే పంచభూతాలతోనే. అంటే అప్పటికే ఎవరో వాడేసిన దేహం తాలూకూ పంచభూతాలతోనే మనం శరీరాన్ని ధరిస్తున్నామనే కదా! తిరిగి కొంత కాలానికి ఈ దేహానికి మరణం తప్పదు. అలాంటి దేహంపైనా మన మమకారం? తనదే అయిన ఆత్మను వదిలి తనదికానీ దేహంకోసం ప్రాకులాడే మనసు అయినవాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్లకి కంచాల్లో వడ్డిస్తుంది. అహంకారంతో ఈ దేహానికి, కుటుంబానికి, సమాజానికి ఎంత సేవ చేసినా తృప్తి, సంపూర్ణత ఉండవు. అదే తన వెనుక ఉన్న దైవాన్ని తెలుసుకున్న మనసు తాను నిమిత్తురాలినని గ్రహించి, అహంకార రహిత స్థితిలో చేసే సేవ నిజమైనసేవ అవుతుంది. అటువంటి సేవకే సంపూర్ణ సార్థకత ఉంటుంది.
✳️ భగవంతుడే మనలో చైతన్యంగా, చైతన్యమే మనలో మనసుగా, ఆ మనసే ఈ దేహంగా రూపుదిద్దుకున్నాయి. మనసుకి ఒకవైపు ఉన్న దైవం స్థిరాస్తి. అది ఎన్ని యుగాలైనా మారదు. కానీ బాహ్యమైన ఈ దేహం చరాస్తి. జన్మజన్మకి మారిపోతునే ఉంటుంది. అసలు ఒక జన్మలోనే శిశువుగా ఉన్నప్పటి దేహం వృద్ధాప్యం వరకూ ఉండదు. నిద్రలో లభించిన శాంతి ద్వారా శక్తిని పొందిన మనసు మెళకువరాగానే దైనందిన కార్యక్రమాల కోసం ఆ శక్తిని ఉపయోగిస్తుంది. కానీ ఈ విషయాన్ని గుర్తించే సున్నితత్వం దానికి లేకపోయింది. నీళ్లతో స్నానంచేసి రాగానే మీద మట్టి గుమ్మరించుకునే గజస్నానం లాగానే మనం రోజూ నిద్రలో పొందిన శాంతిని మెళకువలో కోల్పోతున్నాం. నిద్రలో పొందిన శాంతిని శాశ్వతం చేసుకునేందుకు సాధన చేస్తేనే సార్ధకత. మనసుకి బాహ్యంలో ఉన్న ఈ దేహం ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా తనలోని దైవాన్ని తెలుసుకునే వరకూ మనసుకి సాధన అవసరం. అందుకు మితాహారం, మితవ్యవహారం మనసుకి అలవాటు చేయాలి. అప్పుడే మనసుకి వికారాలు తగ్గి దైవం వైపు మళ్ళుతుంది. సంపూర్ణ చపలత్వం పోయిన మనసే దైవం. నాలుకను జయిస్తే కురుక్షేత్రాన్ని జయించినట్లే అంటారు. మాట, తిండి విషయాల్లో అంతటి నియమాలు అవసరం. మనం నోరు చిన్నదనీ, కడుపు పెద్దదనీ అనుకుంటాం. కానీ అంతులేని రుచులు కోరే నాలుక ముందు పరిమితంగా మాత్రమే ఆహారాన్ని స్వీకరించగలిగే కడుపు చాలా చిన్నది. ఆకలి కడుపుదేగానీ నాలుకది కాదు. అయినా మనం కడుపుని బట్టి గాక, నాలుకని బట్టితింటూ ఉంటాం. ఈ పద్ధతి సాధనకు పనికిరాదు.
✳️ మనని దైవానికి దగ్గరచేసే మంత్రజపం నిరంతరం సాగాలి. స్థూలశరీరం నుండి సూక్ష్మమైన మనసు విముక్తి పొందాలంటే స్థూలంగా మనం భావించే దైవానికి సూక్ష్మరూపమైన మంత్రజపంతో మనసుని మిళితంచేయ గలగాలి. అప్పుడే మనసు అశాశ్వతమైన బాహ్యదేహాన్ని వదిలి శాశ్వతమైన అంతఃచైతన్యాన్ని ఆశ్రయిస్తుంది.
🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment