మరణం - పునర్జన్మ :
ప్రశ్నోపనిషత్ 3 వ ప్రశ్న
9) మం. తేజో హ వా ఉదానస్తస్మాదు పశాంతతేజాః పునర్భవ మింద్రియైర్మ నసి సంపద్యమానైః
నిజంగా తేజస్సే ఉదానం అనే వాయువు. తేజస్సు అంటే అగ్ని. అగ్నిలో వేడి వెలుగు రెండూ ఉంటాయి. కాబట్టి సూర్యుని తేజస్సులో ఉండేది ఉదానమే.
ఎవరిలో యీ ఉదానము శాంతించి పోతుందో (వేడిమి తేజస్సు తగ్గి పోతాయో) అట్టివారు మనస్సులో విలీనమైయున్నట్టి ఇంద్రియాలతో సహా మరియొక శరీరాన్ని పొందటానికి పోతారు. అంటే ఉదానం శాంతించటంతోనే చనిపోతారు. అప్పుడు వాక్కు మొదలైన ఇంద్రియాలన్నీ మనస్సులో లీనమై పోతాయి. ఆ మనస్సు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరాన్ని పొందటానికి పోతుంది.
10) మం. యచ్చిత్త స్తేనైష ప్రాణమాయాతి, ప్రాణస్తేజసా యుక్తః॥ సహాత్మనా యథాసంకల్పితం లోకం నయతి
మరణ కాలంలో మానవునికి ఏ ఆలోచన ఉంటుందో ఆ ఆలోచనతో సహా అతడు (జీవి) ముఖ్య ప్రాణమును పొందుతాడు. ఆ ముఖ్యప్రాణమే అగ్నితో (ఉదాన వాయువుతో) కలిసి జీవాత్మను సంకల్పానుసారమైన కోరికలకు అనురూపమైన) లోకాలకు తీసుకుపోతుంది.
(మానవుని ఆత్మ అయిదు కోశాలతో ఆవరింపబడి ఉంటుంది. 1. అన్నమయ 2. ప్రాణమయ 3. మనోమయ 4. విజ్ఞానమయ 5. ఆనందమయ కోశాలు
i) అన్నమయకోశం ఈ స్థూలశరీరం.
ii) ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మూడూ కలిసి సూక్ష్మశరీరం.
iii) ఆనందమయకోశం కారణ శరీరం.
జీవించి ఉండటమంటే ఆత్మ కారణశరీరంలో, కారణశరీరం సూక్ష్మ శరీరంలో, సూక్ష్మశరీరం స్థూలశరీరంలో ఉండటం. మరణించటం అంటే స్థూలశరీరం నుండి సూక్ష్మకారణ శరీరాలు రెండూ వేరైపోవటం, మరొక జన్మ కలగటానికి ఇట్లా వేరైపోయిన సూక్ష్మశరీరమే కారణం. కాబట్టి, మరణ సమయంలో ఏ మనోభావంతో ఉందో ఆ మనోభావంతోనే జీవాత్మ ప్రాణమయ కోశం వద్దకు వస్తుంది - పునర్జన్మను పొందుతుంది).
No comments:
Post a Comment