శ్రీమదిరామాయణము.
(213 వ ఎపిసోడ్),,
""" సాధూనాం దర్శనం పుణ్యం,
స్పర్శనం పాప నాశనం,
సంభాషణం కోటి తీర్థం,
వందనం మోక్షసాధనం."""
మహర్షులను దర్శించినంత మాత్రముననే పుణ్యం లభిస్తుంది
ఇంకావారి పాదాలని స్పర్శించిననే మనపాపాలన్ని ప్రక్షాళనమవుతాయి.,
ఇంకా వారితో కొద్ది సేపు సంభాషించిననూ కోటితీర్థ లాభము లభిస్తుంది, ఇక వారికి నమస్కరిస్తే ఏకముగ మోక్షమే ప్రాప్తిస్తుంది.
రామాయణములోని భరతుని పాత్ర విశేషముగ ప్రస్తావించబడింది.కారణము భరతునికి ఇతరులయెడ యున్న ప్రేమాభిమానములే దానికి కారణము.కానీ భరతుడు తన తల్లిని దూషించినంతగా ఇతిహాసాలలో మరెవరు తల్లిని అంతగా దూషించియుండరు.
"'" మృత్యుమాపాదితో రాజా త్వయా మే పాపదర్శిని!|,
సుఖం పరిహృతం మోహాత్ కులే~స్మిన్ కులపాంసని||,(అయో.కాం.73-05),,
ఓ పాపిష్టిదానా! ధశరథమహారాజుని మృత్యుకౌగిటజేర్చిన పుణ్యము నీదే.ఓ కులకళంకితా ! ఈ వంశమువారి శాంతిసుఖములను నేలపాలు చేసితి'వని దూషిస్తాడు.
రాముడు తన తల్లి కౌసల్యను ప్రేమించినట్లే నిన్నును గౌరవాదరములతో సేవించుకున్నాడు.అంతేకాదు పెత్తల్లి కౌసల్యామాత కూడ ధర్మబుధ్దితో స్వంతసోదరిలా నిన్ను చూచుకున్నది.
"" తవాపి సుమహాభాగా జనేంద్రాః కులపూర్వగాః,
బుద్దేర్మోహః కథమయం సంభూతస్త్వయి గర్హితః||,(74-24),
ఓ క్రూరాత్మురాలా ! నీవు జన్మించిన కేకయవంశరాజులు అందరు సచ్చరిత్రగలవారే.కానీ నీకేల ఈ నింద్యమైన బుధ్దిమోహము దాపురించినది.నీ కోర్కెను నేను తీర్చిన నా జీవితమునకే కళంకమేర్పడి ముప్పుఏర్పడును.
"" కౌసల్యాం ధర్మసంయుక్తాం వియుక్తాం పాపమిశ్చయే|,
కృత్వా కం ప్రాప్స్యసే త్వద్య లోకం నిరయగామిని||,(74-12),
ఓ పాపాత్మురాలా ! ధర్మపరాయణయైన కౌసల్యాదేవి కి పుత్ర ఎడబాటు కల్పించితివి,పతివియోగము కావించి వైధవ్యము తెచ్చిపెట్టితివి.ఇంతటి దుర్మార్గురాలవైన నీకు నరకమే ప్రాప్తించవలయును.
ఇంతగా తల్లిని దూషించాటానికి తగు కారణములున్నను తల్లిని దూషించిన పాపము ఆనాటి నుండి తల్లి పట్ల నిత్యక్రోధత్వము వలన అది భరతుని మొదటిసారిగ పాపకళంకితునిగ చేసినది.మరి అంతటి కళంకితునికి పరమాత్మ (రాముని)దర్శనము ఎలా ప్రాప్తించినది.
చిత్రకూటములో రాముని కలుసుకొనటానికి బయలదేరిన భరతాదులకు భరద్వాజ మహర్షి దర్శనభాగ్యము ఏర్పడినది.అందరు ఆ మహర్షిపాదాలకి నమస్కరించారు.(సాధూనాం దర్శనం పుణ్యం),వారిపుణ్యపాదాలు స్పర్శించి వారితో సంభాషణచేసి వందనాలు చెయ్యడము తో భరతుని పాపాలు తొలగిపోయే అవకాశమేర్పడినది.దర్శన మాత్రముతో భరతునిలో క్రోధము కొద్దిగా తగ్గినది.మహర్షి తాను సర్వజ్ఞుడైనప్పడికి భరతుని కరుణించటానికి తానే సంబాషణకు ఉపక్రమించారు.
"" తతః పప్రచ్ఛ భరతం భరద్వాజో దృఢవ్రతః,
విశేషం జ్ఞాతుమిచ్ఛామి మాత్రూణాం తవ రాఘవ||,(92-18),
ఓ భరతా ! మీ తల్లుల గురించి ఈ సమయములో విశేషముగ తెలుసుకొనగోరుతున్నానని తనకేమియు తెలియనివాడివలే సంభాషణ మొదలుపెడతారు(సంభాషణం కోటితీర్థం),అప్పటికి భరతుడు కోపాన్ని త్యజించక
""" క్రోధ నామకృతప్రజ్ఞాం దృప్తాం సుభగమానినీమ్|,
ఐశ్వర్య కామాం కైకేయీమ్ అనార్యామార్య రూపిణీమ్||,(92-25),,
ఈమెయే నాతల్లి కైకెయి.మిగుల క్రోధస్వభావురాలు, వివేకశూన్యురాలు,తాను అంగత్తెనని,ఐశ్వర్యురాలనని గర్వపడునది.పైకి ఉత్తమురాలుగ కనపడినను క్రూరాత్మురాలు,పాపబుధ్దిగలది.మా కష్టములన్నిటికి ఈమెయే కారకురాలని తల్లిని పరిచయముచేస్తాడు.ఇదియే భరతుడు తల్లిపట్ల చేసిన చివరి దూషణ.కారణము.మహర్షితో చేసిన సంభాషణ భరతుని పాపాలకు ప్రక్షాళన జరిగింది.భరతునితో మహర్షి
"" న దోషేణావ గంతవ్యా కైకేయీ భరత! తథా|,
రామప్రవ్రాజనం హేతత్ సుఖోదర్కం భవిష్యతి||,(92-29),
ఓ భరతా ! ఇకనుండి నీవు నీ తల్లిని తప్పు పట్ట వద్దు. ఇందు ఆమె"" దోషము ఇసుమంతైనను లేదు."", నీ సోదరుల వనవాసము జగత్తునకు, ఎల్లరకును భవిష్యత్తులో హితము కూర్చగలదని పలికి భరతుని మందలించెను.
రామాయణములో భరద్వాజ మహర్షి దర్శనము తర్వాత భరతుడు తల్లిని నిందించిన సంఘటనలు మనకి కనపడవు.కావున మహర్షుల దర్శనభాగ్యము ఎల్లవేళల శ్రేయస్కరమని రామాయణము మనకి తెలియచేస్తున్నది.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment