"జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - ప్రశ్నోపనిషత్తు - 07వ భాగము.
ఆరవ ప్రశ్నగా సుకేశుడు, ఆచార్యుడైన పిప్పలాదునుద్దేశించి, గురువర్యా! పూర్వం ఒక రాకుమారుడు నన్ను, పదహారు కళలు కలిగిన పురుషుడు నీకు తెలుసా? అని ప్రశ్నించేడు. తెలియదని నేను సమాధానమిచ్చేను. ఆ సందేహం ఇప్పటికీ నాలో వుంది. దయచేసి ఆ పదహారు కళలు కలిగిన పురుషుడెవరో మీరు చెప్పాలని నా మనవి అని ప్రార్ధించేడు.
అందుకు పిప్పలాదుడు, ఋషులారా! పదాహారు కళలు గల పురుషుడు ప్రతిజీవి యొక్క శరీరంలోనే వున్నాడు. పురమును (ఈ జగత్తును) ధరించినవాడే పురుషుడు. అతడు మొదటిగా ప్రాణమును సృజించేడు. ప్రాణము నుండి శ్రద్ధను, పంచమహాభూతములను, ఇంద్రియములను, మనస్సును, అన్నమును, అన్నము నుండి వీర్యమును, వీర్యము నుండి తపస్సును, మంత్రములను, కర్మలను, లోకాలను, వాటిలో నామాలను క్రమంగా సృజించడం జరిగింది.
ఈ పదహారు కళలు పురుషుని నుండి ఆవిర్భవించి, నానా రూప, నామాలతో వ్యక్తమై తుదకు ఆ పురుషునిలో ఏకరూపంతో కలిసిపోతాయి. ఇక్కడ పురుషుడే పర్మమాత్మ. ఆ పరమాత్మే అన్నింటికీ మూలకారణం. అంటే మూలకారణమైన పరమాత్మకు, కార్యమైన ఈ చరాచర జగత్తుకు బేధంలేదు. ఎందుకంటే కారణము లేనిదే కార్యము వుండదు కనుక. దీనిని జ్ఞానంతో గ్రహించి అనుభవించడమే ఆత్మసాక్షాత్కారము లేక అద్వైతసిద్ధి.
బయటకు కనిపించే ఈ కళలన్నీ పరమాత్మయొక్క మాయా కల్పనలు. కొంతకాలం వ్యక్తమై మరల ఇవి ఆ పరమాత్మ యందు లీనమై పోతాయి.
శిష్యులనుద్దేశించి పిప్పలాదుడు, ఋషులారా! ఆ పదహారు కళలు కలిగిన పురుషుని గురించి నాకు ఇంతే తెలుసు. సచ్చిదానందస్వరూపుడైన పురుషుడే పరమాత్మ! అని ముగించేడు.
అంత ఆ ఆరుగురు శిష్యులు ముక్తకంఠంతో, గురువర్యా! మా అజ్ఞానాన్ని నశింపజేసి, మాకు దయతో బ్రహ్మవిద్యను ఉపదేశించిన మీకు మా ప్రణామములు. బ్రహ్మవేత్తలైన మహాఋషులందరికీ ఇవే మా నమస్సులు అని భక్తితో గౌరవవందనాలు సమర్పించేరు.
ఇంతటితో "ప్రశ్నోపనిషత్తు" సంపూర్ణమయ్యింది. "ముండకోపనిషత్తు"తో మళ్ళీ కలుసుకుందాము... 🙏🏻
No comments:
Post a Comment