Sunday, June 30, 2024

*****సంసారమనేది ఒక విషవృక్షమైతే, దాని రెండు ఫలాలు మాత్రం అమృతమంత మధురంగా ఉంటాయి. అవి.....

 ‘సంసారమనేది ఒక విషవృక్షమైతే, దాని రెండు ఫలాలు మాత్రం అమృతమంత మధురంగా ఉంటాయి. అవి: కావ్యామృతాన్ని ఆస్వాదించడం, సజ్జనులతో సద్గోష్ఠి జరపడం’. నిజమే. మన ఈ జన్మకు కారణం మనం కాదు. ఎందుకీ మానవజన్మ లభించిందో ఎవరికీ తెలియదు. ఈ ఆట ఎప్పుడెలా ముగుస్తుందో కూడా అంతుపట్టదు. ‘దుర్లభమైన ఈ మానవజన్మనూ, అందునా శ్రేష్ఠతమమైన స్థితిని పొంది కూడా సార సంసారాన్ని నిస్సారం చేసుకోవడమెందుకు?’ అని ఒక్క క్షణం ఆలోచిస్తే కర్తవ్యం బోధపడుతుంది. లోకంలోని ఇతర అన్ని జంతువుల్లాగే మనముందామా? ఆహారం, నిద్ర, భయం, సంసార సుఖాలు వంటివి పొందడం.. ఇంతేనా జీవితమంటే?- అని ఆలోచించారు మన పూర్వీకులు. ఏ జీవికీ లేని మేధాశక్తిని, అసామాన్య వివేచనను, సమస్త అనుభూతులను వ్యక్తీకరించగల అపార వాఙ్మయ సంపద వంటివి కలిగి ఉన్నందువల్లే మానవుడు మహోన్నతుడు అవుతున్నాడు. ఇవేవీ లేకపోతే మనిషికి, మామూలు జంతువులకు తేడాయే ఉండదు.
మనకన్నా ఎన్నెన్నో తరాల ముందే వేదర్షులు, తాత్త్వికులు, శాస్త్రవేత్తలు చేసిన అనేక ఆలోచనలు, పరిశోధనల ఫలితాలనే మనమిప్పుడు అనుభవిస్తున్నాం. వారి ప్రజ్ఞాసారమే మన జీవితాలకు రక్షగా నిలుస్తున్నది. మనిషిగా జన్మించినందుకు ధర్మాచరణ మార్గంలో నడుస్తూ చతుర్విధ పురుషార్థాలను (ధర్మార్థ కామమోక్షాలు) క్రమంగా సాధించాలంటున్నది భారతీయ సనాతన ధర్మం. ఈ క్రమంలో మనిషి జయించవలసింది మనస్సును! దీని కోసం ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అంటే, అనవసర కోరికలను తగ్గించుకోవాలి.
శరీరం రథమైతే అందులోని జీవుడు రథికుడు. ఇంద్రియాలు గుఱ్ఱాలై లాగుతుంటే బుద్ధి (వివేకం) రథాన్ని మనస్సు అనే పగ్గాలను అదుపులో పెట్టుకొని ధర్మపథంలో నడిపించాలి. మనస్సును ఆధీనంలో ఉంచుకోకపోతే జీవుడు సంసారంలోనే ఉండిపోతాడు. పరమాత్మను ఎన్నటికీ చేరుకోలేడు. మరి, ‘సంసారం అంతటి భయంకరమైందా? సంసారాన్ని సాగరంతో పోలుస్తారెందుకు?’ అంటే, సాగరానికి ఉన్న అగాధం, అమేయం, దుస్తరం వంటి క్లేశాలన్నీ సంసారంలోనూ ఉంటాయి. ‘నృసింహ కరావలంబ’ స్తోత్రంలో ఆదిశంకర భగవత్పాదులు ఎంతో గొప్పగా దీనిని వర్ణించారు. ‘సంసార జాలపతితస్య’ (సంసారమనే జిత్తులమారి వలలో చిక్కుకున్న చేప), ‘సంసార వృక్షమఘబీజ’ (పాపాలనే బీజాలతో మొలకెత్తిన వృక్షమైన సంసారం), ‘సంసార దావదహనాకుల’ (సంసారమనే కార్చిచ్చు), ‘సంసార సాగర నిమజ్జన’ (సంసారమనే సముద్రంలో మునిగిన)- వంటి ఉపమానాలతో సంసారానికి అనేక పోలికలు చెప్పారు. భోగలాలసులై జీవిత పరమార్థాన్ని ప్రజలెవరూ మరిచిపోకూడదనే సదుద్దేశ్యంతోనే సాంసారిక జంజాటాలు అంటని ఆజన్మ బ్రహ్మచారి ఆదిశంకరులు అలా ఉద్బోధించారు.
దేహేంద్రియాలను జయించి శుద్ధసాత్వికుడైన మానవుడు కర్మలను ఆచరించినా కర్మబంధాలేవీ అతణ్ణి అంటుకోవు. అతడు చూస్తున్నా, వింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, మరే పని చేస్తున్నా విషయ వాంఛలు లేకుండా నిస్సంగునిగానే ఉంటాడు. బ్రహ్మార్పణంగా కర్మలు చేస్తూ తామరాకుమీద నీటిబొట్టులా సంసారిగా తాను తరిస్తూనే పరోపకార పరాయణుడవుతాడు. ధర్మాచరణతో అందరినీ తరింపజేస్తాడు. ఇలాంటి మహితాత్ములెందరో తమ జన్మలను సార్థకం చేసుకున్నారు. సంత్‌ తుకారాం, శ్రీరామకృష్ణ పరమహంస లాంటివారే ప్రత్యక్ష నిదర్శనం. ‘నీళ్ళలో పడవ ఉండవచ్చు కానీ, పడవలో నీళ్ళు ఉండరాదు. అలాగే, సంసారంలో నరుడు ఉండవచ్చు కానీ, నరునిలో సంసారం ఉండరాదు. నారాయణుడు ఉండాలి!’
జగత్తులోని ప్రాణులన్నీ రాగద్వేషాల వల్ల కలిగే సుఖదుఃఖాలు అనే ద్వంద్వాలలో కూరుకుపోతూ, అంతులేని మోహంలో పడిపోతున్నాయి’. ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచీ కొన్ని వస్తువుల మీద (కొందరు మనుషులపైనా) రాగమో, ద్వేషమో పెంచుకొని, తద్వారా కలిగే సుఖదుఃఖాల మాయలో చిక్కుకు పోతున్నాడు. అంటే, కొన్ని వస్తువుల మీద ఇష్టం పెంచుకొని వాటిద్వారా కలిగే సుఖమే నిజమైన సుఖమనుకుంటున్నాడు. ఆ సుఖాలను పొందడానికి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ, అవి లభించనప్పుడు బాధపడుతూ తన విధిని, భగవంతుడిని నిందిస్తూ, క్రుంగిపోతుంటాడు. ‘భౌతిక వస్తువుల మీద వ్యామోహం అనర్థదాయకమని, అవన్నీ అశాశ్వతాలని, శాశ్వతమైంది, సత్యమైంది, నిత్యమైంది పరమాత్మ ఒక్కడేనని’ అందరూ తెలుసుకోవలసి ఉంది. ‘జగత్తు మిథ్య’ అంటే, కంటికి కనబడే చరాచర ప్రపంచమంతా మాయ. ఒకప్పుడు లేవు, ఇప్పుడున్నాయి, రేపు ఉండబోవు.
ఉదాహరణకు మన నగరాలు, గ్రామాలు ఒకప్పుడు ఎలా ఉండేవి? అప్పట్లో ఎన్ని, ఎలాంటి ఇండ్లు ఉండేవి? ఇప్పుడెలా ఉన్నాయి? మన కండ్లముందే ఎంత మార్పు! మనం చరిత్ర పాఠాలలో చదివిన రాజులు ఏరి? రాజ్యాలు ఇప్పుడు ఏమయ్యాయి? నిన్న మొన్నటి శ్రీకృష్ణదేవరాయలు స్థాపించిన హంపీ విజయనగర సామ్రాజ్యం ఇప్పుడేమైంది? కాలగతిలో కలిసిపోయింది. అశోకుడు, చంద్రగుప్తుడు, శాలివాహనుడు, శాతకర్ణి, రాణిరుద్రమ.. ఇలా గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్ర పుటల్లో మిగిలిపోయారు.

No comments:

Post a Comment