ఇత్తడి సామాను
ఉదయం 6:00 గంటలు అయింది. రాజమ్మ గారు స్నానం చేసి పూజ పూర్తి చేసుకుని హాల్లో టీవీలో వార్తలు చూస్తున్న పెద్ద కొడుకు రఘు దగ్గరకొచ్చి "ఒరేయ్ రఘు ఒక పెద్ద వ్యాన్ తీసుకురా అలాగే ఇద్దరు మనుషుల్ని కూడా పురమాయించు. పైన ఉన్న ఇత్తడి సామాను అంతా మనం రాజమండ్రి పట్టుకెళ్ళి అమ్మేద్దాం అంటూ తల్లి చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయాడు రఘు. "అమ్మలో ఇంత మార్పు వచ్చింది ఏమిటా అని ఆలోచించసాగాడు. ఒరేయ్ నా మాటలు వింటున్నావా లేదా అంటూ రెండోసారి రెట్టించేసరికి అలాగే అమ్మ అంటూ స్నానం చేయడానికి పెరట్లోకి వెళ్ళిపోయాడు.
రఘు రాజమ్మ గారి పెద్ద కొడుకు. రాజమ్మ గారికి నలుగురు కూతుళ్లు నలుగురు కొడుకులు పెళ్లిళ్లు అయిపోయి అంతా హైదరాబాదులోనే సెటిలైపోయారు. రాజమ్మ గారు మాత్రం ఆ ఊరు వదలలేదు. లంకంత కొంప. చేతినిండా పనివాళ్ళు. నెలకొకసారి రఘు హైదరాబాద్ నుంచి వచ్చి రాజమ్మ గారి బాగోగులు చూసుకుని వెళ్తాడు. మిగిలిన పిల్లలు పండక్కి పబ్బాలకి వచ్చి వెళుతుంటారు.
రాజమ్మ గారికి ఆ ఇత్తడి సామానికి అవినాభావ సంబంధం ఉంది. ఆమె వాటిని కన్నతల్లిలా చూసుకుంటుంది. ఎవరి చేతిలో నుంచి అయినా చెంబు జారిపోతే అయ్యో సొట్టపడిపోతుంది రా ఎప్పుడో మీ తాతయ్య అజ్జరం నుంచి తీసుకొచ్చిన చెంబు అంటూ ప్రతి సామానుకి ఒక కథ చెబుతూ ఉంటుంది. ఆ సామాను ఏ సందర్భంలో కొన్నారు ఎక్కడ కొన్నారు సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయింది అన్ని చెప్పుకుంటూ వస్తుంది. ఆ సామాను అంటే రాజమ్మకు అంత మమకారం. ఒక ఇత్తడి సామాన్లు కొట్టులో కూడా ఇన్ని రకాలు ఉండవేమో ఆ ఇంట్లో మటుకు తాతలనాటి ఇత్తడి సామాను అంత ఉంది. అప్పట్లో ఇత్తడి సామాన్లు వాడకం ఎక్కువగా ఉండేది. దానికి తోడు రాజమ్మ కుటుంబం జమిందారీ కుటుంబం.
ఆ రోజుల్లో ఆడపిల్లల్ని అత్తారింటికి పంపేటప్పుడు ఇత్తడి సామాను సారెగా పెట్టేవారట. అంతేకాకుండా ఎప్పుడు ఇంట్లో సంతర్పణలు సమారాధనలు జరుగుతూ ఉండేవి ట. అందుకోసం వంట పాత్రలు రకరకాల సైజులలో ఇత్తడి గుండిగలు, ఇత్తడి కళాయిలు ,గోకర్ణాలు కొమ్ము చెంబులు మర చెంబులు గ్లాసులు పళ్ళాలు మర చెంబులు ఒకటి కాదు రకరకాల సామాన్లు ఆ కాలంలో కొని పని అయిపోయిన తర్వాత కొన్ని వాడుకోవడానికి ఉంచి మిగిలినవి శుభ్రంగా చింతపండు వేసి తోమించి మిద్ది మీద దాచేవారు. మధ్యలో స్టీల్ సామాను వచ్చి ఇత్తడి సామాను వాడకం మానేశారు.
ఇప్పటి కూడా రాజమ్మ ప్రతి పండక్కి ఆ సామానంత కిందకి దింపించి ఇద్దరు మనుషులు పెట్టి చింతపండు తో తోమించి అటక మీదకి ఎక్కించే సాంప్రదాయం కొనసాగిస్తూనే ఉంది.
అయితే మొన్న సంక్రాంతి పండక్కి సామానంత కిందకి దింపించి శుభ్రంగా తోమించి పిల్లలందరినీ పిలిచి ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకోండి అని రాజమ్మ చెప్పింది. అయ్య బాబోయ్ ఇత్తడి సామానా మాకు పెట్టుకోడానికి చోటు లేదు అని ఒకళ్ళు, తోమించడానికి పనిమనిషి లేదని ఒకరు , అంత బరువైన సామాను మొయ్యలేమని ఒకరు, ఇత్తడి సామానుతో వండితే గ్యాస్ అంతా ఒక్కరోజులోనే అయిపోతుందని ఒకరు ,ఇలా తడుముకోకుండా పిల్లలందరూ కారణాలు టకటక చెప్పేసారు.
రాజమ్మ గారు మళ్ళీ మాట్లాడకుండా మీకు వీటి విలువ తెలియదు. ప్రతి సామాను వెనుక ఎంతో అభిమానం ఆప్యాయత ఉన్నాయి. ఈ ఇత్తడి పళ్ళెం నా పెళ్లి నాటిది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఎలా ఉంది.వీటి విలువ రూపాయల్లో లెక్కపెట్టుకున్న సరే అప్పటికి ఇప్పటికి ఎంతో పెరిగింది. ఆరోగ్యరీత్యా కూడా ఇవి చాలా మంచివి. వీటితో వండిన ఆహార పదార్థాలు తిని మేము ఇప్పటికీ రాళ్లల్లా ఉన్నాము. మీరు ఆ స్టీలు గిన్నెలలో అన్నం వండుకుని ఇలా రోగాలు బాధపడుతున్నారు. మీరు వాడే సామాన్లు మహా అయితే రెండు మూడేళ్లు వాడుకుంటారు. కానీ ఇత్తడి సామాను వయస్సు వంద సంవత్సరాలు పైనే ఉంటుంది. నాకంటే పెద్దవి. ఇవి మన పూర్వీకులు ఆస్తి అంటూ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి రాజమ్మ సామానంత మిద్దెక్కించేసింది.
అనుకున్నట్టుగానే రఘు వ్యాన్లో ఇత్తడి సామాను అంతా ఎక్కించి రాజమ్మను కారులో ఎక్కించుకొని రాజమండ్రి బయలుదేరాడు . సామాను వ్యాన్లో ఎక్కిస్తున్నప్పుడు రాజమ్మ మౌనంగా ఉండిపోయారు. అంటే ఏదో మనసులో బాధపడుతుంది అన్నమాట. అలా రాజమండ్రి చేరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా షాపులో కూర్చుని రాజమ్మ బేరమాడి ఆ సామాను అంతా అమ్మేసింది. ఒకటా రెండా నాలుగు లక్షల రూపాయలు వచ్చాయి. ఆ రూపాయలన్నీ రఘు చేతులో పెట్టి కళ్ళు తుడుచుకుంది రాజమ్మ. రాజమ్మ ఉద్దేశం రఘుకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయమని. పిల్లలందరికీ సమానంగా ఇవ్వమని అర్థం కాబోలు. మౌనంగా ఉన్న అమ్మని ఏమీ పలకరించకుండానే కారులో ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేసా రు. మర్నాడు రాత్రి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయాడు రఘు. వెళ్లేముందు ఆ సొమ్ము ఏం చేయాలో కూడా చెప్పలేదు రాజమ్మ.
రఘు హైదరాబాద్ వెళ్లిన వెంటనే తమ్ముళ్ళకి చెల్లెలికి అక్కలకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. మనం సామాను పట్టుకు వెళ్ళకపోవడం మూలాన్ని అమ్మని బాధ పెట్టినట్టున్నాము. అయినా మన పరిస్థితి మనది. ఆ సామాను మనం తెచ్చుకున్న పెట్టుకోవడానికి చోటు లేదు. నిత్య కృత్యానికి ఉపయోగించలేము.
అయితే ఈ సొమ్ము మనం కూడా ముట్టుకోకుండా అమ్మ పేరున వెంకటేశ్వర స్వామి నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చేద్దాం అన్నారు అందరూ. వెంటనే ఆ పని పూర్తి చేసి రాజమ్మ కి ఫోన్ లో విషయం అంతా పూర్తిగా చెప్పాడు. పిల్లలు చేసిన మంచి పనికి రాజమ్మ ఎంతగానో సంబరపడింది. ఇన్నాళ్లు ఎన్నో సంతర్పణలకు ఉపయోగించిన ఈ సామాను ఇప్పుడు పరోక్షంగా మళ్లీ నిత్య అన్నదానానికి ఉపయోగపడడంతో ఆనంద పడింది రాజమ్మ.
కాలం మారిపోయింది. వేష భాషల్లో ను వస్త్రధారణలోను ఇంటిలో ఉండే సామాన్లలోను చాలా మార్పులు వచ్చేసాయి. ఎంతోకాలంగా అపురూపంగా చూసుకున్న సామాన్లు ఇప్పుడు ఎవరు వాడడం లేదు. అవి మిద్దె మీద పెట్టడం తప్పితే. ఉమ్మడి కుటుంబాలు విడిపోయి కుటుంబాలన్నీ వలసపోయి అపార్ట్మెంట్లో కాపురాలు వచ్చి అధునాతన సామగ్రి మీద మోజు పెరిగి ఆ పాత తరం సామాన్లు ఏం చేయాలన్నది ఈనాటి సీనియర్ సిటిజెన్లకి ఒక తీరని సమస్య.
రచన : మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
No comments:
Post a Comment