Sunday, June 30, 2024

****ఎవరు ధన్యులు?

 ఎవరు ధన్యులు?

(శృ౦గేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి బోధలు)

వరమభయముదారం పుస్తకం చాక్ష హారం
మణివలయ మనోజ్ఞై: పాణి పద్మైర్దధానా!
సిత వసనలలామా కుంద ముక్తాభిరామా
వసతు శశి నిభాస్యా వాచి వాగ్దేవతా నః!!

ప్రతి ఒక్కడికీ తనయొక్క జీవనం పవిత్రంగా జరగాలి. తాను ఇంకా ఉత్తమమైన స్థితిని పొందాలి. తన జీవనం వ్యర్ధం కాకూడదు.చాలా దుర్లభమైనటువంటిది. ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఈ మానవ జన్మ దొరికింది. దీనిని వ్యర్ధం చేసుకోకూడదు అనే భావన సహజంగానే ఉంటుంది. ఈభావనకు తగినట్లు మనం ఎలా నడుచుకోవాలి? మన జీవనాన్ని ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి? ఏది మనకు శ్రేయస్కరం? అనే ప్రశ్నకు మనయొక్క ధర్మ గ్రంథాలు అనేకమైనటువంటి విస్తృతమైన రీతిలో జవాబులు చెప్పాయి. ఉపనిషత్తులు చూచినా భగవద్గీతను చూసినా, ధర్మ శాస్త్రాలు పరికించినా ఈ ప్రశ్నలకు మనకు జవాబులు దొరుకుతాయి. కానీ వాటన్నిటినీ విస్తారంగా చూసి తీర్మానించుకో దగ్గ శక్తి మనకు లేదు. ఎవరో మహాత్ములు వేదశాస్త్రములందు ప్రజ్ఞ కలిగినటువంటి వారు వాటిని చూసి తెలుసుకోగలిగినప్పటికీ సామాన్యులమైన మనకు అంత ప్రజ్ఞ, ఆ విశేషమైన శాస్త్రార్ధం చూసి సారభూతమైన విషయాన్ని గ్రహించుకోదగ్గ శక్తి లేదు గనుక భగవత్పాద శంకరుల వారు అటువంటి విషయాన్ని అత్యంత సరళమైన రీతిలో మనకు ఉపదేశించారు.

వేదాంతములందు, శాస్త్రములందు, నిగూఢ౦గా ఉన్న విషయాల్ని గహనంగా విషయాల్ని, సరళంగా మనకు తెలియజెప్పి ఈవిధంగా మనం ఉంటే మన జన్మ ధన్యమవుతుంది అని సెలవిచ్చారు. వారియొక్క అమూల్యమైన వచనములను మనం తెలుసుకోవాలి, మననం చేయాలి, ఆచరణలో పెట్టుకోవాలి. అప్పుడు మనయొక్క  జీవనం పవిత్రమౌతుంది, ధన్యమౌతుంది. అత్యంత సారభూత౦గా వారు చెప్పిన మాట

"త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే
మానావమాన సదృశాః సమదర్శినశ్చ
కర్తారమన్యమవగమ్య తదర్పితాని
కుర్వంతి కర్మ పరిపాక ఫలాని ధన్యాః!!

సకల శాస్త్రములయందు చెప్పబడినటువంటి అర్ధాన్ని సారభూత౦గా దీంట్లో చెప్పి ఈవిధంగా మీరు నడుచుకోండి. మీజివితం పవిత్రమౌతుంది అన్నారు. దాంట్లో వారు చెప్పిన మొట్టమొదటి అంశం ఏంటి అంటే ముఖ్యంగా మనకు అహంకార మమకారములు అనేటువంటివి ఈ సంసార బంధానికి హేతువులుగా ఉన్నాయి. ఇవి మనిషికి శతృవులుగా ఉన్నాయి అని వింటూ ఉంటాము. పెద్ద భూతంలాగా మనిషిని ఆక్రమించి వారితో అకార్యములను చేయిస్తుంది. అకార్యములు చేసే  వీరందరికీ నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనే భావన మనసులో ఉంటుంది. నా దగ్గర డబ్బు ఉందనో, అధికారం ఉంది అనో, నాకు విద్య ఉంది అనో, భావనలు మనస్సులో ఉంది అకార్యములు చేస్తాడు. ఇక్కడ నిన్ను అడిగేవాడు ఉండకపోవచ్చు. శరీరం విడిచి పెట్టిన తరువాత నిన్ను అడిగేవాడు ఒకడున్నాడు. వాడి కళ్ళు గప్పటానికి నీకు వీలులేదు. అనే విషయం వాడి మనసు తీసుకోవడం లేదు. మహాభారతంలో అభిమన్యు ఆరుగురు అతిరధులు అధర్మంతో వధించిన విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు "సంజయా! ఎంత పాపానికి ఒడిగట్టారు మనవాళ్ళు. నిశ్శస్త్రుడైనటువంటి పిల్లవాడిని ఆరుగురు అతిరధులు చేరి వధించారు. నేను ఈ శరీరం వదిలి పెట్టి వెళ్ళిన తరువాత నాతమ్ముడు పాండు ఇది న్యాయమా అని  నన్ను అడిగితే  ఏం జవాబు చెప్పను?"  అప్పుడు సంజయుడు ఈ ఒక్కటే కాదు మీరు అనేక ప్రశ్నలకు జవాబు చెప్పవలసి వస్తుంది అన్నాడు.  కాబట్టి అహంకారభూయిష్టులమై  అధర్మాన్ని ఆచరిస్తూ వాస్తవాన్ని మరచి పోతున్నాము. అహంకారం మనకు పనికి రాదు. ఇది బంధానికి కారణం అవుతుంది. బంధం అంటే జన్మ మరణ ప్రవాహం. ఎప్పటిదాకా ఈ ప్రవాహంలో ఉంటామో మనకు విముక్తి లేదు.

"పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం
 ఇహ సంసారే బహు విస్తారే కృపయా పారే పాహి మురారే!!" 

ఈ ప్రవాహం నుంచి బయట పడాలి అంటే అహంకారాన్ని, మమకారాన్ని వదిలిపెట్టు. గీతోపదేశం ప్రారంభమైనది అర్జునుని మమకారం వల్ల.

#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

No comments:

Post a Comment