Sunday, June 30, 2024

 ★ 'సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో!... సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ? ఎప్పుడూ యదవ బిజినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?' ఈ డైలాగ్స్ విన్న వెంటనే గుర్తొచ్చే పేరు ముత్యాలముగ్గు అలా సరైన టైమింగ్ తో అద్భుతమైన డైలాగ్స్ రచనతో ఈలలు వేయించిన ఆయన పేరు తెలియని ఆంధ్రుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన పేరు స్ఫురణకు వచ్చిన వెంటనే తెలుగువారి నేస్తం బుడుగు కళ్ల ముందు ప్రత్యక్షమై పెదవులపై చిరునవ్వు మెరువని పాఠకులు ఉండరనే నిజానికి రూపమై నిలిచిన "ముళ్ళపూడి వెంకటరమణ" 93 వ జయంతి (28-6-1931) నేడు.

★ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి ఉదరపోషణార్థం ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి వచ్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తల్లి విస్తరాకులు కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన బ్రతుకు పోరుని స్మరిస్తూ ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత్యా ఫ్రెండు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా, ఇచ్చుటలో ఉన్నహాయిని చూపిన దైవం' అన్న ఆ మాటల వెనుక ఉన్న మానవత్వం నిండిన ఆత్మవిశ్వాసం ఏ తరానికైనా తరగని వెలుగును చూపే హృదయ దీపం.

★ గోదావరి ‘మా ఫిలిం స్టూడియో’ అని ప్రకటించుకున్న ముళ్లపూడి నేస్తం బాపుతో కలసి తీసిన ప్రతి చిత్రం ఆ గోదారమ్మ ఒడిలోనే పురుడోసుకునేవి. భద్రాద్రి రాముడి దర్శనం తో  రచన పూర్తి చేసుకొనేవి. మొదట్లో ఆంధ్రపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా ఆయనలో రచయిత కన్ను తెరిచాడు. వందలాది కథలు, రాజకీయ భేతాళ పంచవింశతి లాంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాల రచనలు, సినీరంగ ధోరణులపై విసుర్లు, సమీక్షలను అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ ఆసక్తికరంగా చదివేవారు. అలా డూండీ ఎన్టీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో సినిమా కూడా ఎనీఆ్టర్‌ నటించిన గుడిగంటలు, మూడో సినిమా ఏఎన్నార్ నటించిన మూగమనసు లు. మూడూ సూపర్‌ హిట్‌ సినిమాలే కావడంతో రమణ సినీ జీవితం ఆరుకాయలై పండింది.

★ ఇప్పుడైతే తెలుగువాళ్లు తమ భాషలో ఆలోచించలేని వాళ్ళు అయ్యారు కాని, కొద్ది కాలం క్రితం రమణ గారు పుట్టించిన బుడుగు ప్రసక్తి లేకుండా రోజు గడించేది కాదంటే అతిశయోక్తి కాదు. వారి హాస్య, వ్యంగ్య కథలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను నిలుపుకున్నాయి. వైవిధ్య భరితమైన, విస్తృతమైన ఈ కథల నుంచి పలుకుబళ్లు, కొత్త పదాలు, కొత్త అర్థాలు, తెలుగువాళ్ల మాటల్లో, పాటల్లో భాగమయ్యాయి.

★ జీవితపోరాటంలో పోర్టు గుమస్తా, ప్రూఫ్ రీడర్, పత్రికా సంపాదకుడు, ఫ్రీలాన్స్ జర్నలిజం, సినీ రచన, సినీ నిర్మాత వంటి ఎన్నో వృత్తులు చేసిన ముళ్లపూడి వెంకటరమణ అనుభవాలు ఆయన కథల్లో ప్రతిబింబిస్తాయి. ఆ అనుభవదీపపు వెలుగుల్లో మనల్ని సరైన దారుల్లో నడుతాయి. దురదృష్ట వశాత్తు మనం తెలుగు చదవడం న్యూనతగా భావించే భ్రాంతిజీవులమైనా ము.

★ బాపుతో జట్టు కట్టకముందే కొన్ని చిత్రాలకు కథ సంభాషణలు సమకూర్చి నా సాక్షి నుంచి శ్రీరామ రాజ్యం వరకూ బాపుతోనే ప్రయాణించి ఎన్నో కళాఖండాల రూపకల్పనలలో బాపు సగమైతే, తాను మరో సగమయ్యారు. తెలుగు భాషకు, సంస్కృతికి, సంప్రదాయానికి వెలుగైనారు.

★ రమణ సృష్టించిన అన్ని పాత్రలలోనూ అగ్రగణ్యుడు బుడుగు. చివరిగా ఒక్క మాట... తెలుగువారు మాత్రమే ఎంజాయ్ చేయగలిగిన భాష 'బుడుగు' ది. ఇతర భాషల్లోకి అనువదింపబడటా నికి వీలు పడనిది బుడుగు. తెలుగు వారికి మాత్రమే బుడుగు చదివే అదృష్టం ఉంది. చదవండి. మళ్ళీ చదవండి. పిల్లలకు చదవడం రాకపోతే చదివి వినిపించండి. వాళ్ళ చిరునవ్వుల్లో మీ బాల్యాన్ని వెతుక్కోండి. ఆయన ఆత్మకథ కోతి కొమ్మంచి చదివి తెలుగువాళ్ళము అని గుర్తు తెచ్చుకుందుముగాక!
 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•

No comments:

Post a Comment