Saturday, June 29, 2024

 రామాయణానుభవం...362

మాల్యవంతుని హితోపదేశము రావణుని చెవులకు ఎక్కలేదు. రాక్షసరాజు ఆగ్రహంతో మాల్యవంతుని ఈ విధంగా నింధించాడు:

“తాతా !నీవు ముసలివాడవు ఆగుట వలన నీ బుద్ధి మందగించింది. నీవు శత్రువు వలన ఏదో లాభపడి, ఆయన వైపు న్యాయవాదిగా మాట్లాడుతున్నావు.

నిజానికి రాముడు ఎందులో గొప్పవాడు? దేవ, దానవ గంధర్వాదులలో నాకు ఎదురేలేదు కదా!

రాముడు ఒక మానవుడు. తండ్రివలన దేశాన్నుండి బహిష్కరింపబడ్డవాడు. రాజ్యహీనుడు. ఇప్పుడు భార్యాహీనుడు కూడ.

ఇప్పుడు ఆశ్రయించింది కోతులను అంటే తనకంటే తక్కువ వారిని (నీచులను) ఆశ్రయించాడు. ఆయనలో ఏమి గొప్పదనాన్ని చూచి మాట్లాడుతున్నావు?

నేను రాక్షసరాజును రాజుపట్ల మాట్లాడవలసింది
 ఈ విధంగానేనా?

కావాలని మోహంతో సీతను తెచ్చుకొన్నాను. ఆమెను అనుభవింపకుండా వుండగలుగుతానా?

నీవన్నట్లు రాముడు గొప్పవాడు కూడ కావచ్చు. అయితే మాత్రమేమిటి? అంతకంటే అత్యధికుడు నా ముందు వచ్చి నిలిచినా నేను తలవంచుతానా? మరొకరికి నమస్క రిస్తానా?

"ద్విధాభజ్యేయమ ప్యేవం న నమేయంతు కస్యచిత్
ఏషమే సహజోదోషః స్వభావోదురతిక్రమః"

నన్ను రెండుగా చీల్చినా నేనెవ్వరికి నమస్కరిచను. ఇది నా స్వభావము. నా స్వభావము తప్పుకూడ కావచ్చు. అయినా స్వభావము పుట్టుకతో వచ్చి కాటిదాకా వెంట ఉంటుంది. దానిని మార్చడం ఎవ్వరి తరము కాదు.

"రాముడు సముద్రముపై సేతువు కట్టలేదా?" అందువా? కాకి కూచుండగానే తాటిచెట్టుపై పండు క్రింద బడితే కాకే పండును తెంపిపడగొట్టినట్లా ? కాదు కదా కాకి కూచున్నప్పుడే పండు పడిపోవడం హఠాత్తుగా అనుకోకుండా జరిగిందే. ఏదైనా అకస్మాత్తుగా జరుగడాన్ని గూర్చే "కాకతాళీయము" అంటారు కదా!
రాముడు సముద్రముపై సేతువు నిర్మించడము కూడ కాకతాళీయమే.

అంతెందుకు? రామలక్ష్మణులు వేలాది వానర సమేతంగా లంకపైకి దండెత్తి వచ్చారు. కదా! వారందరు శవాలరాశులవుతారు. అంతేకాని ఎవ్వరు కూడ బ్రతికి తిరిగి పోజాలరు. తాతా! నీ నోటికి వచ్చింది మాట్లాడావు చాలుగాని ఇక నీవు వెళ్లవచ్చు" అని ఆజ్ఞాపించాడు. మాల్యవంతుడు రావణుని మాటలు విని మౌనంగా తిరిగి వెళ్లాడు.

("ఇసుకలో నుండి నూనె తీసినా తీయవచ్చు. ఎండమావులలో నీరును త్రాగినా త్రాగవచ్చు. కాని మూర్ఖుని మనస్సును మాత్రము ఎవ్వరు మార్చజాలరు కదా...!)

      .......సశేషం.......

చక్కెర.తులసీ కృష్ణ.

No comments:

Post a Comment