శ్రీమద్రామాయణము.
(208 వ ఎపిసోడ్),,
"" ఆత్మహత్య చేసుకోవాలనే భావనే భగవదపచారము""
"" కష్ట సమయాలలో
వైరాగ్యము వినాశనానికి దారితీస్తుంది.""
'"జీవితం త్యక్తుమిఛ్చామి శోకేన మహతా వృతా|,
రాక్షసీభిశ్చ రక్షంత్యా రామో నాసాద్యతే మయా||,(సుం.కాం.25-19),
రామాయణము సుందరకాండములో రాక్షస స్త్రీలు తమ మాటలతో సీతామాతను కష్టపెడుతున్నతరుణములో ఆమె వైరాగ్యముతో ప్రాణాలని త్యజించాలనుకుంటుంది.""అయ్యో ఈ రాక్షస స్త్రీలమధ్య నేను ఇబ్బంది పడుతు రాముని చేరలేను.ఈ అనంతమైన శోకముతో ఇక నేను జీవితము చాలించుటయే యుక్తమని వైరాగ్యముతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది.
కానీ మరుక్షణములో మనసు మార్చుకొని
"" ధిగస్తు ఖలు మానుష్యం ధిగస్తు పరవశ్యతామ్|,
న శక్యం యత్ పరిత్యుక్తుమ్ ఆత్మఛ్చందేన జీవితమ్||,(25-30),,
ఎంత నీఛమైన ఆలోచన నాది.నా జీవితము నా ఆధీనములో లేదు.అది రాముని ఆధీనములో యున్నది.దీనిని త్యజించుటకు నాకెక్కడ అధికారమున్నది.మనుష్య జన్మలో పుణ్య పాప విచక్షణకు అవకాశమున్నది కనుక వివేకముతో ప్రవర్తించగలగాలి. అందువలన నాకు ఈ జీవితాన్ని త్యజించే అవకాశము లేదు.
కానీ అంతలోనే ఆమె ఆలోచనలు పరి పరి విధాలుగ భ్రమించసాగాయి.
"దృశ్యమానే భవేత్ ప్రీతిః సౌహృదయం నాస్త్యపశ్యతః,|,
నాధయంతి కృతఘ్నాస్తు న రామో నాశయిష్యతి ||,(26-43),,
నా రాముడు నన్ను మరిచినాడా? ఏమో.సహజముగ లోకములో జనులకు ఎదుటయున్న వారిపట్ల ప్రేమ అధికము.కనబడని వారిపై ప్రేమ సన్నగిల్లును. కానీ నా రాముడు నన్ను అలామరువగలడా? .అటుల మరచుట కృతఘ్నుల లక్షణము.ఈ దశరథరాముడు కృతజ్ఞుడు.వారు నన్ను మరచుట కల్ల.
అసలు నా రాముడు బ్రతికియే యున్నాడా? కపటోపాయముచే ఈ దుష్ట రావణుడు వారిని చంపివేసెనా?(అతి ప్రేమః పాపశంకీ.అని కదా ఆర్యోక్తి) ఇలా సీతామాత ఆలోచనలతో తడబడుచు తిరిగి ప్రాయోపవేశానికి సిద్ద పడి,
"" శోకాభితస్తా బహుధా విచింత్యల సీతా~థ వేణ్యుద్గ్రథనం గృహిత్వా,,
ఉధ్భద్య వేణ్యుద్గ్రథనేన శీఘ్రమ్ అహం గమిష్యామి యమస్య మూలమ్""(28-18),,
ఈ విధముగ శోకాకులయైన సీతామాత అనేక విధములుగ పరితప్తహృదయముతో తన జడను ఉచ్చుగ చేసికొని " ఈ జడతో ఉరివేసుకొని శీఘ్రముగ నా తనువును యమసదనముకు పంపెదనని నిర్ణయము తీసుకొనినదయ్యెను.
తల్లి తండ్రులనుండి ప్రాప్తించిన మానవ జన్మ అత్యంత ఉత్కృష్ట మైనది.ఈ జన్మ భగవంతుని ఆధీనమని గ్రహించగలగాలి.అనగా పరాధీనమైనది.అట్లుగాక ఆత్మహత్యకి ప్రయత్నించినచో అయ్యది భగవదపచారము.హనుమంతులవారివల్ల సీతామాత భగవదపచారము చేయకుండగ కాపాడబడింది.
రామాయణము మనకి క్లిష్ట పరిస్థితులలో వైరాగ్యాన్ని ఆశ్రయించి ఆత్మహత్యలకి పాల్పడి నష్టపడవలదని హితవు పలుకుతుంది.
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment