Saturday, June 29, 2024

 శ్రీమద్రామాయణము.

(207 వ ఎపిసోడ్)

"" కామజములనబడే వ్యసనాలు  అబధ్దమాడుట,పరస్త్రీవ్యామోహము,అకారణ హింస అను దుష్కృత్యాలను జయించని వాడు నాశనమవుతాడు.""

''మంత్రిభిర్హిత సంయుక్తైః  సమర్థైర్మంత్రనిర్ణయే|
సహితోమంత్రయిత్వా యః కర్మారంభాన్ ప్రవర్తయేత్||,

క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు హితము చెప్పే మంత్రులతో వివరముగ సంప్రదించి కార్యములకు పూనుకొనువాడు ఉత్తమ నాయకయడనిపించుకుంటాడు. అట్లుకాక తనకు తానుగ ఆలోచించుకొని కార్యములోనికి దుముకువాడు కష్టాల కడలిలో కొట్టుకొని పోతాడు.

రామాయణము యుద్ధకాండములో లంకాదహనకాండ తర్వాత పరిస్థితులు గురించి  ఆలోచనలో పడి మంత్రి మండలిని పిలిచి విషయములు మరుగు పరుస్తు  కర్తవ్యము చెప్పమని అడుగుతూ కుంభకర్ణుని ముందు సభలో ఒక అబధ్దము పలుకుతాడు.

"" సా తు సంవత్సరం కాలం మామ యాచత భామిని,|,
ప్రతీక్షమాణా భర్తారం రామమ్ ఆయతలోచనా||,(12-19),

"ఆ సుందరి నన్ను ఒక సంవత్సరకాలము గడువు కోరినది.ఆమె కోరిక సముచితమని భావించి అంగీకరించితిని.ఆమె పట్ల కామవశుడనైన నేను అలసిన మేలుజాతి గుర్రము వలే ఆమెకై ఎదురుచూస్తు వేసారియుంటిని.

" నాకు సంవత్సరకాలము గడువు ఇమ్ము.ఈలోగా నా పతి రానిచో నీ కోరిక తీర్చెదనని "సీతా దేవి ఎన్నడు అలా పలుక లేదు. దీనికి ఋజువుగ మనము ఒక సారి అరణ్యకాండములోనికి వెళ్లిన రావణుని మాటలు తెలియగలవు.

"" శృణుమైథిలీ మద్వాక్యం మాసాన్ భామిని ,కాలేనా~నేన నా~భ్యేషి యది మాం చారుహాసిని!, తతస్త్వాం ప్రాతరాశార్థం సూదాః ఛేత్స్యంతి లేశశః||,(56-24,25),,

ఓ సీతా నా మాట వినుము. నీకు పండ్రెండ్రుమాసములు గడువు ఇచ్చుచున్నాను.ఈలోగా నీవు మనసుమార్చుకొని నాయెడ సుముఖురాలివి కానిచో గడువు తీరిన మరునాడు మా వంటవారు నిన్ను చంపి ముక్కలు చేసివేయగలరని హెచ్చరిక చేసాడు.

పై రెండు శ్లోకములను గమనించిన రావణుడు మంత్రిమండలిలో నిజములు చెప్పక అబధ్దములాడుచున్న వైనము తెలియగలదు.ఆ సమయములో కుంభకర్ణుడు అన్నా!

"" యదా తు రామస్య సలక్ష్మణస్య  ప్రసహ్య సీతా ఖలు సా ఇహా~~హృతా|,
సకృత్ సమీక్య్షైవ సునిశ్చితం తదా భజేత యమునేన యామునమ్""(13-28)(యుద్ద. కాం),

ఓ అన్నా రావణా! వంచనతో సీతను సంహరించే ముందే నీవు ఈ మంత్రిమండలితో చర్చించి యుండవలసినది. యమున భూమికి చేరక మునుపే యమునోత్రి లోని గుండములను నింపి ముందుకు సాగిన విధముగ నీవు ముందే చర్చించి యంటే అది ఇప్పుడు ఎంతో సముచితముగ యుండేది.ముందువెనుకలు ఆలోచించక చేసిన తప్పుడు పనులు ఇప్పుడు ఎంత తర్కించినను అవి గతజలసేతు బంధనమువంటివే కదా(అనగా నీరంతా ప్రవహించి పోయిన తర్వాత అడ్డుకట్ట వేయుట వలన ఉపయోగము యుండదని భావము) అంటాడు.

 విపత్కరమైన పరిస్తితులలో నాయకుడైనవాడు హితులతో అన్ని విషయములు భేషజములు లేక చర్చించాలని లేక పోతే వినాశనము తప్పదని రామాయణము మనలను జాగృత పరుస్తున్నది.

No comments:

Post a Comment