Sunday, June 30, 2024

 శ్రీమద్రామాయణము.

(210 వ ఎపిసోడ్),,

""(విజ్ఞులు చాలా మంది మంచి సలహాలిస్తు స్పందిస్తున్నారు.ధన్యవాదములు.నా వ్యాఖ్యానాలు అసంపూర్తిగ ఉన్నవని కొందరు, ఇంకా విపులముగ చెప్పమని అడుగుతున్నారు.ఇలా పెద్దలు స్పందించటము నాకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి.వాటిని నేను ఎల్లప్పుడు ఆహ్వానిస్తాను. కానీ స్థలభావము విపులముగ వ్రాయడమనే  అవకాశము నాకు కల్పించుటలేదు.అన్యథా భావించవద్దు.)

""శ్రవణం,కీర్తనం,విష్ణోఃస్మరణం పాదసేవనం,
అర్చనం,వందనం,"" దాస్యం""సఖ్యమాత్మనివేదనం"""

పైన చెప్పబడ్డవి నవ విధభక్తులు.
రామాయణము అత్యధిక భాగము దాస్యం-సఖ్యము అనబడే భక్తుల గురించి విపులీకరించబడింది.రామ సుగ్రీవుల మైత్రి సఖ్యత గురించి చెప్పుకుంటే   దాస్యము గురించి చెప్పుకోవాలంటే ముఖ్యముగ ఆంజనేయస్వామి వారి గురించి ప్రస్తావించుకుంటాము.దాస్యభక్తికి హనుమ ప్రతీక.
రావణసభలో రామ బంటునని వెల్లడించి దాసభక్తికి పెద్దపీట వేసారు.

""కామం ఖల్వహమప్యేకః సవాజిరథకుంజరామ్|,
లంకాం నాశయింతుం శక్తః తస్యైష తు న నిశ్చయః||,(సుం.కాం.51-32),

ఓ రావణా! నేను రాముని దాసుడను. వారి అనుమతి నాకు లేదు.కానిచో నీ హయ,రథ,గజ, బలాలను నీ లంకను సర్వనాశనము చేయుటకు నేనొక్కడినే చాలును.నే నెవరనుకుంటున్నావు? నేను మీరనుకున్నట్లు ఇంద్ర,యమ వరుణుల దూతనుగాను కుబేరుని మిత్రుడనుగాను ,నీవు భయపడుతున్నట్లు విష్ణుదూతను కానేకాను.

"" సత్యం రాక్షసరాజేంద్ర శృణుష్వ వచనం మమ|,
రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః||,(51-39),

""ఓ రావణా! నేను శ్రీరాముని బంటుని, నేను వారి దగ్గరనుండి దూతగ వచ్చాను కనుక నీకు హితోపదేశము చేయుటయే నా కర్తవ్యము.రాముడు మానవుడు,నీవు రాక్షసుడవు,నేను వానరుడను.నాకెట్టి పక్షపాతమూ లేదు.కనుక నామాటలు శ్రద్దగ ఆలకింపుము."" అని దాసుడుగ తన పరిధులను ఎరిగి రావణసభలో ప్రవర్తించాడు.

"" మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశ్వరః|,
తస్మాత్ ప్రాణపరిత్రాణం కథం రాజన్ కరిష్యసి||,(51-28),

రాముడు మానవుడు,సుగ్రీవుడు వానరశ్రేష్టుడు,కానీ నీవు నరవానరుల నుండి మరణము లేకుండగ వరము పొందలేదని అన్యాపదేశముగ హెచ్చరిస్తు , నీవు వారిరువురి నుండి ప్రాణములను ఎట్లు కాపాడుకొనగలవని అడుగుతాడు.

ఈ విధముగ హనుమలవారు ప్రతి మాటలో ప్రతి కదలికలో తన ప్రభుభక్తిని చాటుకుంటు తన దాస ప్రవృత్తిని చాటుకున్నారు.

నవవిధ భక్తులలో  దాస్యభక్తి అత్యంత ప్రాముఖ్యత కలిగినదని రామాయణము  మనకి తెలియచేస్తున్నది.

జై శ్రీరామ్  జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment