రామాయణానుభవం....360
సీతాదేవి కోరిక ప్రకారం సరమ రావణునిసభకు వెళ్లి అక్కడ అదృశ్యంగా ఉండి, అన్ని విషయాలను పూర్తిగా తెలిసికొని సీతాదేవి దగ్గరకు తిరిగి వచ్చింది.
రావణుని సభ నుండి తిరిగి వచ్చిన సరమను సీతాదేవి ప్రేమతో కౌగిలించుకొని అక్కడి విశేషాల గురించి అడిగింది. సరమ తన సమాధాన్ని చెప్పసాగింది.
"సీతా! రావణుని తల్లికైకసి, ఆయన వృద్ధ మంత్రి అవిద్ధుడు రావణునికి అనేక
విధాల హిత బోధ చేశారు.
"ఖరదూషణాదులను వారి పదునాల్గు వేల సైన్యమును కొన్ని క్షణాలలో ఒంటరిగా సంహరించగలిగిన సర్వసమర్ధుడు రాముడు. ఇప్పుడేమో రాముడు ఒంటరివాడు. కానేకాడు. లక్ష్మణుడు లక్షలాది వానర సైన్యము రాముని కంటి కి రెప్పవలె కాపలా కాస్తుంటారు.
"నా సైన్యములో ఖరుని మించిన వారెందరో ఉన్నారు". అంటావా ? ఎందరు ఉండి ఏమి లాభము? హనుమ ఒక్కడే వచ్చి లంకానగరాన్ని అంతటిని అగ్నికి ఆహుతి చేసినప్పుడు ఎందరుండి ఏమి చేశారు?
ఈ విధంగా ఎవరెన్ని విధాల చెప్పినా లోభిధనాన్ని వదలనట్లు పరవధూసంగమును కాంక్షించే రావణుడు నిన్ను వదలడానికి అంగీకరించలేదు.
ప్రాణాల కంటె ఎక్కువగా కాంక్షించే నిన్ను రావణుడు చంపజాలడు. ఆయన వలన నీకు ఏ భయములేదు.
అయితే నిన్ను వశం చేసికోవాలనుకొని అప్పుడప్పుడు నిన్నుబెదిరిస్తాడు.”
ఈ మాటలను సరమ సీతాదేవికి చెప్పుతుండగానే వారికి వానర సేనల అరుపులు శంఖ, భేరుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా వినిపించాయి. శ్రీరామచంద్రుడు లంకను ముట్టడించడాన్ని ప్రారంభించాడని వాళ్లకు తెలిసింది.
ఒక వైపు ఆ ధ్వనులు సీతా సరమలకు సంతోషాన్ని కలిగిస్తే మరొక వైపు రావణునికి, రాక్షసులకు పిడుగు పడ్డట్లు అయింది. ముందుగానే తనకు ఎప్పటి వార్తలను అప్పుడు ఎందుకు తెలుపలేదని రావణుడు రాక్షసులపై మండిపడ్డాడు. ఇప్పటికైనా ముందుకొచ్చి తనకు విజయాన్ని చేకూర్చుమని ఆజ్ఞాపించాడు.
అప్పుడు రావణుని తల్లి అయిన కైకసికి పెద్ద తండ్రి అయిన మాల్యవంతుడు ఆయనతో ఈ విధం గా హితము పలకడానికి సిద్ధ పడ్డారు......
.......సశేషం......
చక్కెర.తులసీ కృష్ణ.
No comments:
Post a Comment