*చదువుకున్నవాడికంటే చాకలివాడు నయం!*
ఒకసారి ఒక గ్రామంలో పండితులు, తర్కశాస్త్రజ్ఞులు, మీమాంసకులు ఇలా అందరూ కలిసి ఓ ఇంటి అరుగుమీద సభ జరుపుకుంటున్నారు.
అటుజరిగి ఇటుజరిగి వాళ్ల చర్చ ‘వైకుంఠం ఎక్కడ ఎంతదూరంలో ఉండి ఉంటుంది’ అనే విషయంవైపు జరిగింది.
ఒక పండితుడేమో వైకుంఠం కొన్నివేలకోట్ల ఖగోళాలకు అవతల నిజంగా ఉన్న ఒక పాలసముద్రంలో ఉన్నదన్నాడు, తార్కికుడేమో అలాగాదు చంద్రుడు లక్ష్మీదేవితోపాటే పుట్టాడు ఆయనని మనం రోజూ చూడగలుగుతున్నాము. తన అక్క లక్ష్మీదేవికి దూరంగా చంద్రుడు ఉండడు కాబట్టి వైకుంఠం ఎక్కడో చంద్రమండలానికి అవతలవైపు ఉండచ్చు అని తార్కికంగా చెప్పాడు.
అదే గ్రామంలో ఒక చాకలివ్యక్తి నివసిస్తున్నాడు. అతడు తన బట్టలను తీసుకుని చెరువుకుపోతూ ఈ పండితులనందరినీ గమనించాడు. తనదారిన తాను వెళ్లిపోయాడు. సాయంత్రం అతడు తిరిగి వస్తూ ఆ పండితులు ఇంకా గట్టిగావాదించుకుంటూనే ఉండడం గమనించాడు.
‘ఈ పండితులు ఉదయంనుండీ సాయంత్రందాకా ఏం వాదించుకుంటున్నారా!‘ అని సందేహం వచ్చి వాళ్లని వెళ్లి కారణం అడిగాడు.
వాళ్లు ‘మేం వైకుంఠం ఎక్కడఉందో వాదించుకుంటున్నాము‘ అంటే అతడు తలగుడ్డతీసి తన తలగోక్కుని, ‘ఇంతమాత్రం దానికి ఉదయంనుండి సాయంత్రం దాకా వాదించుకోవాలా బాబయ్యా?!‘ అని ఆశ్చర్యంగా ఆడిగాడు.
దాంతో ఈ సారి ఆశ్చర్యపోవడం ఆ పండితుల వంతయింది.
“అంటే ఏంటి?! నీకు వైకుంఠం ఎక్కడుందో తెలుసా?! ఇంత చదువుకున్నాము మాకే తెలియని అతి సూక్ష్మమైన ఈ శాస్త్ర రహస్యం నీకెలా తెలుస్తుంది... పో పో నీ పనిచేసుకో..." అని ఈసడింపుగా పలికారు.
“అయ్యా! నేను తమరంత చదువుకోలేదండీ. కానీ నాకు వైకుంఠం ఎక్కడుందో చూచాయగా తెలుసండీ...
మా పంతులోరు మొన్నీమధ్య బాగోతం (భాగవతం) చెబుతాఉంటే నేను ఇన్నానండీ బాబయ్య!
మా పంతులోరు చెప్పారు ఆ ఏనుగు (గజేంద్రుడు) ప్రాణంబుల్ ఠావుల్ దప్పె మూర్చవచ్చె... అని మరంత మూర్చవచ్చే పరిస్థితుల్లో మాటలే రావు గదా బాబయ్యా. మనం చావబోయె మనిషి చెప్పేమాటలు వినాలంటే నోటిదగ్గర చెవిబెడితే గానీ వినబడవు గదా బాబయ్యా!
మరి ఆ ఏనుగు చాలా బలహీనంగా అరిచిందిగదా... ‘రావే ఈశ్వరా... రావే వరదా.... రావే గోవిందా...‘ అని.
అయినాగూడా ఆ ఏనుగు మాటలు ఆ వైకుంఠయ్యకు వినపడ్డాయి అంటే బహుశా ఆ వైకుంఠం ఇక్కడే ఎక్కడో మహా అయితే ఓ నాలుగిళ్ల అవతల ఉండుంటుందండీ‘ అని చెప్పి తనదారిన తాను వెళ్లిపోయాడు.
ఎన్నో శాస్త్రాలను అభ్యసించి వైకుంఠం ఎక్కడ ఉందో తెలియని చదువుకున్న పండితులకంటే, ‘తన పంతులయ్య చెప్పిన భక్తి వెనుక తనదైన నమ్మకం పెట్టుకుని వైకుంఠం మా ఇంటిపక్కనే ఎక్కడో ఉంది అని తార్కికంగా సమాధానపడి తన రోజువారీ పని (కర్మయోగం) చేసుకుంటున్న చాకలివాడు కొన్ని లక్షలరెట్ల నయం‘ అని.
అప్పట్నించీ ‘చదువుకున్నవానికంటే చాకలివాడు నయం‘ అన్న నానుడి పుట్టింది.
No comments:
Post a Comment