ప్ర : పురుషులు సూర్యోదయం ముందే లేచి సంధ్యావందనం చేస్తే,
వివాహితలు, అవివాహితలు ఆచరించవలసిన నియమాలు ఏవి?
జ : మగవారికి యజ్ఞోపవీతం ఉన్నవారైతే సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేయకపోతే అశౌచం ఉన్నవాడితో సమానం. ’సంధ్యాహీనః అశుచిః’. ఒకవేళ యజ్ఞోపవీతం లేకపోతే/ సంధ్యావందనం చేసే అధికారం లేకపోతే తూర్పుకి తిరిగి సూర్య భగవానునికి నమస్కారం చేస్తే సంధ్యావందనం చేసిన వారితో సమానం. ఎవరినీ వేదం చిన్నబుచ్చదు.
బ్రాహ్మణుడికి అయితే గర్భాష్టకం – అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినటువంటి ఏడు సంవత్సరాల రెండు నెలలు. అమ్మ కడుపులో ఉన్న పది నెలలు లెక్కపెట్టుకొని ఎనిమిదవ ఏట చేయాలి. వైశ్యుడికి అయితే పన్నెండవ ఏటనుంచి 24వ ఏళ్ళ వరకు, బ్రాహ్మణుడికి 8 నుంచి 16; క్షత్రియుడికైతే 11 నుంచి 22. ముహూర్తం కుదరకపోవచ్చు వంటి సమస్యలు ఉంటాయి అన్న ఉద్దేశ్యంతో కొంత వ్యవధి ఇచ్చింది శాస్త్రం. మిగిలిన వారు సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు అన్నారు. ఆడపిల్ల అయితే అక్కరలేదు అన్నారు. ఎందుకు అంటే ఈ పిల్లలకి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత ఎనిమిదవ సంవత్సరం వచ్చేసరికి మనస్సులో లింగవివక్ష తెలుస్తుంది. మనస్సు పరిపరివిధాలుగా వంకర ఆలోచనలు చేయడం ఆరంభం అవుతుంది. తేజస్సు క్షయం అయిపోకుండా బుద్ధి వక్రించకుండా గురువుగారి దగ్గర, శాస్త్రం దగ్గర నిలబడడానికి ఉపనయనం చేసి మూడుపూట్ల సంధ్యావందనం చేసి గాయత్రి చేయమంటారు. మగవాడియొక్క చిత్తశుద్ధి నిలబెట్టడానికి. సూర్యనమస్కారం చేస్తే మిగిలిన వారికీ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆడపిల్లలకి సంధ్యావందనం పెట్టలేదు. పెట్టకపోవడానికి ఒక్కటే కారణం. వాళ్ళు నిద్రలేచి నాన్నగారు పూజ చేసుకోవాలి అని గబగబా వెళ్ళి పూజామందిరం తుడిచి పెడుతుంది. ముగ్గు వేస్తుంది. అమ్మ మడినీళ్ళు,పూజా సంబారాలు పెడుతుంటే తను తోటలోకి వెళ్ళి గబగబా కాసిని పువ్వులు కోసి తెచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పిల్ల చేస్తున్నవి అన్నీ చిత్తశుద్ధి కొరకే కదా! ఆ పిల్ల చేస్తున్న పనులు అన్నీ కూడా తండ్రి/అన్నయ్య అభ్యున్నతి కొరకు. అమ్మకు సహాయపడడంలో. ఇప్పుడు ఆ పిల్ల చేస్తున్న పనులే చిత్తశుద్ధికి ప్రతీకలు. మళ్ళీ సంధ్యావందనం ఎందుకు ఆ పిల్లకి? అందుకే ఇక ఇవ్వలేదు. పెళ్ళి కాని పిల్ల చేస్తున్న కర్మలన్నీ చిత్తశుద్ధితో కూడిన కర్మలే. మగపిల్లవాడు, చీపురూ పట్టుకోక, ఇల్లు కడుగక, పూజా చేయక అక్కరలేని ఆలోచనలు చేస్తాడు. అందుకని సంధ్యావందనం చెయ్యి, కూర్చుని గాయత్రి చెయ్యి అన్నారు. కాబట్టి ఆడపిల్లని చిన్నబుచ్చిందా? పెద్దపీట వేసిందా? పెద్దపీట వేసింది. ఇది చెయ్యద్దు అని చిన్నబుచ్చలేదు. నువ్వు చేసిన కర్మలతోటే నీకు చిత్తశుద్ధి ఏర్పడుతోంది అక్కరలేదమ్మా అని గౌరవించింది.
ఇక పెళ్ళి అయిన ఆడపిల్ల ఏం చేయాలి అంటే భర్త పూజ చేస్తాడు. ఆడపిల్ల ముందు లేచి స్నానం చేసి ఆయనకోసం పూజ గది శుభ్రం చేస్తావు, ముగ్గులు వేస్తావు, పువ్వులు కోసి అక్కడ పెడతావు, ఆయన పూజ చేసుకుంటుంటే నైవేద్యం వండి పట్టుకెళతావు. నీరాజనం ఇచ్చి గంట కొడితే కళ్ళకు అద్దుకుంటావు. ఆయన గీతం శ్రావయామి అంటే పాట పాడతావు. ఆయన ఏం చేసున్నా దానికి ఉపకరణం నువ్వే కదా! ఇక పెళ్ళి అయ్యాక మాత్రం ప్రత్యేక అవసరం ఏముంది? నువ్వు చేసేవన్నీ చిత్తశుద్ధితోటే. అసలు నువ్వు లేనినాడు ఆయనకి అవన్నీ చేసే అధికారమే లేదు. నేను ఇవాళ ఉత్తరీయం వేసుకొని ఉన్నాను అంటే నేను మంగళప్రదుడిని, నాకు భార్య ఉంది. ఆమె ఉంది కాబట్టి నేను యజ్ఞానికి కూర్చోవచ్చు, కన్యాదానం చేయవచ్చు. భార్య లేనివారికి కన్యాదానం నుంచి యజ్ఞం చేసే వరకు అధికారం ఏమీ లేదు. పూజ ఒక్కటే చేయవచ్చు. ఎడమభుజం మీద ఉత్తరీయం కూడా వేసుకోకూడదు. కుడిభుజం మీదనుంచే వేసుకోవాలి. భార్యలేదు అంటే పురుషుడికే లేదు అధికారం. అంటే ఈయనకి అధికారం ఉంది అంటే భార్యవల్ల. కాబట్టి భర్త అన్ని చేసుకుంటున్నాడు అంటే భార్యవల్లనే. కాబట్టి భార్యవల్లే ఆయన అంత అభ్యున్నతిని పొందుతుంటే ఆయన చిత్తశుద్ధికి, ఆయన అభ్యున్నతికి నువ్వు లక్ష్మీ స్థానం అయ్యావు. నీకు ప్రత్యేక కర్మలెందుకు? భార్య వండి పెట్టిన ఫలహారం, భోజనం, కాళ్ళు పట్టడం, పాట పాడడం, ఆయన మానసికంగా డస్సిపోతే ఎందుకండీ అంత బెంగ పెట్టుకుంటారు, మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడా? అని తల నిమిరితే తృప్తి చెందిపోతాడు. ఆయనకి శాంతి స్థానం అయ్యావు. ఇంక నీకు వేరు కర్మలెందుకు! ఇన్ని మంచి పనులు చేసి చిత్తశుద్ధితో నువ్వు ఉంటే. అందుకు వేరు కర్మలు పెట్టలేదు.
కానీ ఆర్తి అని ఒకటి ఉంటుంది కదా! ౧. మంచి భర్తరావాలి, ౨. మంచి భర్త వచ్చాక మంచి పిల్లలు పుట్టాలి, నా భర్త ఇంకా ఇంకా మంచి స్థితికి ఎదగాలి, ఇద్దరం కలిసి ఎన్నో మంచి పనులు చేయాలి అనిపిస్తుంది. అందుకే పెళ్ళికి ముందు కొన్ని నోములు పెట్టారు. అట్లతద్దినోము, రుక్మిణీకళ్యాణం, కాత్యాయనీ వ్రతమ్ మొదలైనవి మంచి మొగుడు రావడానికి. పెళ్ళి అయిన తర్వాత శ్రావణశుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం మీ ఆయన బాగుండడానికి, మీ పిల్లలు బాగుండడానికి, మీ అత్తమామలు బాగుండడానికి, మీ పుట్టింటి వారు బాగుండడానికి. మరి నువ్వు బాగుండడం కోసం? – వాళ్ళు బాగుండడం, నువ్వు బాగుండడం. ఆడది తనకొరకు ఆలోచించదు కాబట్టి అంత త్యాగమూర్తి గనుక నెలకు మూడు వానలలో ఒకవాన మీవల్ల. కాబట్టి ప్రత్యేక కర్మలు లేవు పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత నోములు, వ్రతాలు అని రెండు. పెళ్ళికి ముందు చేస్తే నాన్నగారికి నమస్కారం పెట్టి, పెళ్ళి అయిన తర్వాత చేస్తే భర్తకు నమస్కారం పెట్టి అంతే.
No comments:
Post a Comment