శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర-పరిచయం
బైట ఏం జరిగినా అది భగవానికి సత్యం కాదు. చివరికి తన దేహానికి జరిగినా, అదీ వాస్తవం కాదు. తాను దేహం కాదనీ, తానూ. అందరివలె, అన్నింటివలె ఆత్మేనని - ఆ సంగతి తనను అనుసరించిన వారికి తెలియడం కోసం, వారి వారి అనుభవాల్లోకి రావడం కోసం భగవాన్ పదే, పదే ఆత్మ విచారణ మార్గం గురించి చెప్పడమే కాక, ఆ విషయంలో ఎంతైనా ప్రేమనీ, కాఠిన్యాన్నీ చూపేవారు.
"ఆత్మ విచారణ" ఆనాదిగా వున్నదే! విచారమంటే, విషయ వాసనలన్నింటినీ విసర్జించడం. ఎందుకంటే, వాసనలు నిశ్శేషం కాకుండా ప్రాప్తించిన జ్ఞానం, స్థిరంగా వుండదు.
అపరిచ్ఛిన్నమైన, చిద్రూపమైన ఆత్మయథార్థ రూపం తెలియక, “దేహమే, ఆత్మ" అనే భావం కలుగుతుంది. ఎంతో అనుభవంతో ఆత్మను తెలుసుకున్న వారికీ, వివేకవంతులకు కూడా దేహాత్మ బుద్ధి తొలగడం బహుకష్టం. ఎందుకంటే, ఆ భావం మొదటి నుంచీ, మనలో అంత లోతుగా పాతుకుపోయి వుంటుంది.
నిర్మలమగు చిదాత్మ ఎక్కడ? రక్త, మాంసాదులతో. మల మూత్రాలతో కూడిన దేహమెక్కడ? దేహాత్మ బుద్ధి వలన, అసలు మనమేమిటో మరచిపోతాం. అదే అజ్ఞానం. మరచిపోవడమే కాదు, అనాత్మను ఆత్మగా భావిస్తాం. అదీ జీవితంలో విషాదకరమైన సంగతి.
ఆ విధంగా అల్పం - స్వల్పం - సూక్ష్మం అయిన మనసు, బ్రహ్మాండం.అనంతం. అపారం అయిన ఆత్మను కప్పేస్తుంది. అది ఇంకా విచిత్రం.
ఆత్మవిమర్శే, గొప్ప పుణ్యం, పావనకార్యం. ఆత్మను విమర్శించినా, ధ్యానించినా గతి ఒక్కటే!
“ఆత్మ విచారణ” కష్టతరమనుకున్న వారికి, "శరణాగతి’’ రెండో మార్గం. "శరణాగతి” అంటే, మూలంలో, లీనం కావడం. అహం, ఆత్మ - శరణు జొచ్చడంతో, అహం ఆత్మ అవుతుంది. - తన ఉనికికి మొదటి కారణ మేదో, దానికి తనను అర్పించు కోవడమే, . శరణాగతి.
“అహం, ఆత్మలో లీనమైన తర్వాత, శరణాగతి చెందడానికి వ్యక్తిత్వమెక్కడ వుంటుంది. అసలు అర్పించే దేమిటి? అర్పించే దెవరు? ఎవరికి? దేనిని? అనే ప్రశ్నలు కలుగుతాయి. కాని, అర్పించుకున్న వానికి, అడగడానికి అధికారం వుండదు.
సంపూర్ణ శరణాగతి చెందిన వారిని సంరక్షించడం ఈశ్వరుని విధిగా చెపుతారు. వారు ఏ ప్రార్థనా చేయనక్కరలేదు. ఎందు కంటే, శరణాగతికి మూలం, “నేను నిస్సహాయుణ్ణి" అని. భక్తుడు శరణాగతి పొంది, ఈశ్వరునికి పూర్తిగా అర్పించుకుని, భక్తితో అహం తీసేసుకుని, నిర్వాణస్థితిని అందుకుని “నేను కాదు, ఉన్నది నీవే!" అంటాడు. అటువంటి సంపూర్ణ శరణాగతి చెంది, తర్వాత క్రమంగా, సంపూర్ణంగా తనను అర్పించుకోవడం సులభమౌతుంది. తలపులు లేనిదే, ఏకాగ్రత ఒకే తలపు అదే స్ఫురణస్మరణ. అదే జపం, భక్తి. అంటే, అన్య ఆలోచన లేనిది. ఆ ఒక్క తలంపూ, జీవితంలో దైవం కావడ మంటే, తాను సంపూర్ణ శరణాగతి చెందడమన్న మాట! అదే నిజమైన అర్పణ.
“అసలు శరణాగతి దేనికి? ఎవరికి?” అని ప్రశ్నిస్తే, “అంతిమ అధికారానికి" అని సమాధాన మిస్తారు. కాని, దానికి ఒక 'పేరు' ఆలోచించకూడదు. దానికి ఏపేరైనా పెట్టుకోవచ్చునంటారు భగవాన్.
"శరణాగతి చాలు. తక్కింది గురువు చూసుకుటాడు,” అనే స్థిరభావంతో, కొందరు ఆ భావాన్ని ఆశ్రయించుకుని ఆశ్ర మాల్లో స్థిరపడతారు. వారిలో కొందరు తమ వ్యక్తిత్వాలను పూర్తిగా తుడిచేసుకుని, అసలు తమ ఉనికికే ఒక ఆధారమంటూ లేకుండా చేసుకుంటారు.
తాను “లఘువు”
(అల్పం-స్వల్పం) అనుకున్నంత కాలం, ఎవరికైనా గురువు వుండవలె. దేహాత్మ బుద్ధి వీడని వ్యక్తిదృష్టికే, గురు_శిష్య సంబంధం, ద్వైత భావం. భగవాన్ వంటి జ్ఞాని దృష్టి నుంచి, అన్నీ, అంతా, అందరూ ఒకటే, సమానమే. ఆ ఒక్కటీ ఆత్మ. అందుచేత ఆయన గురు శిష్య సంబంధాన్ని ఒప్పుకోలేదు. కాని, అర్థించిన వారికి, ఆత్మ విచారణ మార్గం చూపారు, విచారణ చేయలేనివారు, సంపూర్ణ శరణాగతి చెందమన్నారు. గురువుకో, ఈశ్వరునికో, ఆత్మకో. ఆ రెండుమార్గాలూ ఒకే లక్ష్యాన్ని చేరుస్తా యన్నారు భగవాన్. అనుభవజ్ఞానం లేక, నిలకడ కానక తిరుగాడే నాజ్ఞానులకు అనుభవజ్ఞానంతో తన నడవడితో ఉపదేశించిన సద్గురువు, శ్రీరమణులు.
వెలుగుతున్న దీపం, ఇతర దీపాల్ని వెలిగించడానికి సహాయపడునట్లు, జ్ఞాని సహాయం ఇతరులకు లభిస్తుంది.
అందం, ఆనందదాయకం, ఆరోగ్యకరం అయిన మన సహజ స్థితిని నిరాకరించి, మనని మనమే హద్దుల్లో, పరిమితుల్లో పెట్టుకుని; అపరిమితం, అనంతం, అపారం, అనన్యం, అవ్యక్తం అయినదాని కోసం, అన్వేషిస్తాం, అర్థించి ప్రార్థిస్తాం.
ఎంతకి అంతం కానికష్టాల్ని, కలతల్ని, దుఃఖాల్ని, బాధల్ని, యాతనల్ని, నష్టాల్ని అనుభవిస్తూ; శాంతి, ఆనందం లేక, మళ్లా వాటికోసం గిలగిలలాడి, ఆ బాధల నుంచి తప్పించుకోవాలని చూసి, అనేక చోట్లకు తిరిగి, అనేకం అభ్యసించి, ఎందర్నో అర్థించి, ఎన్నో అనుసరించి, అనుష్టించి, చదివి విని చూసి సాధన చేసి ఏం చేసి విముక్తి కానక, ఏ విధంగానైనా వాటి నుంచి బైట పడాలని - తంటాలు పడతాం. అదీ మన తీరు.
To be Continued...
No comments:
Post a Comment