Sunday, June 30, 2024

కురుక్షేత్రం

 *కురుక్షేత్రం*
⚔️

రచన : డి. వి. శేషగిరిరావు 

సంధి కార్యాలన్నీ విఫలం కావడంతో కౌరవ పాండవుల మధ్య యుద్ధం అనివార్యం అని తేలింది. అయితే వారు అన్నదమ్ముల బిడ్డలు కనుక ఆత్మ బంధువులే కాక యుద్ధంలో పాల్గొనే వారంతా కూడా ఇరువర్గాల వారికీ దగ్గర బంధువులే. ఎటువంటి వారైనా రాగ అనురాగాలకు అతీతులు కాదు కనుక యుద్ధానికి తలబడ్డా అది కడకంటా సాగుతుందని ఎవరికీ నమ్మకం లేదు.

“దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం సంభవామి యుగేయుగే" అని శ్రీ కృష్ణుడే గీతలో ప్రవచించినట్లు యుద్ధం జరిగి దుష్టులు పూర్తిగా పరిహరింపబడాలి. అది సవ్యంగా పూర్తిగా కొనసాగేలా చూడడం శ్రీకృష్ణ అవతారానికి ఒక ముఖ్య బాధ్యత.

దీనికై ఏమి చేయాలా అని శ్రీకృష్ణుడు బాగా ఆలోచించాడు. కౌరవ పాండవుల మధ్య యుద్ధం కడకంటా జరిగేలా చూసేది స్థలమే కాని వ్యక్తులు కాదు అనే నిర్ణయానికి వచ్చాడు. వెంటనే యుద్ధానికి సరిపోయే సరియైన స్థలం కోసం అన్వేషిస్తూ బయలుదేరాడు. 

ఒక చోట ఒక పంట చేలో ఒక రైతు అతడి దృష్టిని ఆకర్షించాడు. ఆ రైతు తన పంట మడులకు నీరు పెడుతున్నాడు. ఒక చోట గట్టుకి గండి పడి నీరు బైటకుపోతోంది. వెంటనే ఆ రైతు ఆ గట్టు సరిచేశాడు. అయినా మళ్ళీ గండి పడింది. మళ్ళీ దానిని పూడ్చాడు. ఈసారీ నీరు ఆగ లేదు. ఆ గండి పూడ్చేందుకు అనేకసార్లు ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఏదైనా రాయితో ఆ గండి పూడుద్దామని ఆ రైతు చుట్టూ చూశాడు. ఏదీ లభించలేదు.

కాని తనకై నిరీక్షిస్తున్న అతడి కొడుకు అతడికి ఆ గట్టు మీద కనిపించాడు. ఆ బాలుడు ముంతతో తండ్రి కోసం అన్నం తెచ్చాడు. రైతు దృష్టి కొడుకు తల మీద పడింది. వెంటనే అతడు కొడుకు దగ్గరకు వెళ్ళి కత్తితో అతడి తల నరికేశాడు. ఆ తల తెచ్చి బోదెలో కూరాడు. గండిపూడి నీరు కట్టింది. రైతు తృప్తి చెందాడు. ఆ కొడుకు తెచ్చిన ఆహారం తిని మళ్ళీ తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు.

ఇదంతా తిలకించాడు శ్రీకృష్ణుడు. ఆ ప్రాంతంలో కర్తవ్యం తప్ప బంధుత్వాలు వుండవని తెలిసింది. అదే ఆ స్థల మహత్యం అని గుర్తించాడు. అదే కాబోయే కౌరవ పాండవ యుద్ధ క్షేత్రంగా నిర్ణయించాడు.

శ్రీకృష్ణుడు నిర్ణయించిన ఆ ప్రాంతానికి కౌరవ పాండవ సేనలు తరలి వెళ్ళాయి. కాని ఆర్జునుడు నర నారాయణులలో ఒకడు కావడంతో అతడి మీద ఆ స్థల ప్రభావం పని చెయ్యలేదు. ఆతడు రాగా నురాగాలకు లోనై బంధుత్వాలు, మంచి చెడ్డలు ఆలోచించడం ప్రారంభించాడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు ఆతడికి ఫలితం సంగతి ఆలోచించక ఎవరి కర్తవ్యం వారు సంపూర్తిగా నిర్వర్తించాలని హితోపదేశం చేశాడు. దాంతో ఆర్జునుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇరుపక్షాలకు ఘోరమైన యుద్ధం జరిగింది. కౌరవులు నాశనమయ్యారు. పాండవులు విజయం పొందారు.

కురు సంతతి వారైన కౌరవ పాండవులు యుద్ధం చేసిన క్షేత్రం కావడంతో ఆ స్థలం కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

*సమాప్తం* 
⚜️
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•

No comments:

Post a Comment