Saturday, June 29, 2024

దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి మసలుకోవడం మంచిది.

 ‘పూర్వమూ ఎందరో రాజులున్నారు కదా. వారికి రాజ్యాలున్నాయి కదా. వాళ్లెంతో అహంకారంతో విర్రవీగిన వారేకదా. కానీ, వారెవరు సంపదలు మూట గట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా? శిబి చక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా’.
కాలగర్భంలో కలిసి పోయేవన్నీ అశాశ్వతాలు. మనమెంతో ఇష్టంగా, అపురూపంగా వాడుకొనే సెల్‌ఫోన్లు, కెమెరాలు, టీవీలు ఒక వందేండ్ల మునుపు లేవు. ఇప్పుడు మనం వాటి మోజులో చిక్కుకున్నాం. ఇలాంటి వస్తువులు లభిస్తే సంతోషం (రాగం), లభించకపోతే దుఃఖం (ద్వేషం). కొన్ని మన వద్ద లేవు, ఎదుటివారి వద్ద ఉన్నాయని ఈర్ష్య, అసూయ. మరి కొందరికైతే తనకే ఉన్నాయనే మద, మాత్సర్యాలు. ఇలా అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు)లో చిక్కుకోవడం ద్వారా మనుషులు అనేకులు మాయలో కూరుకుపోతున్నారు. రేపు మరో కొత్త ఆవిష్కరణ జరుగుతుంది. ఇప్పుడు వాడే వస్తువులు త్వరలో కనుమరుగైపోతాయి. కనుక, ‘జగత్తంతా మాయే’ అన్నారు మన పెద్దలు. అందులోని వస్తువులూ మాయే. ఇలా అశాశ్వతమైన, భౌతికమైన వస్తువులపై మోజుతో జీవితాన్ని వ్యర్థం చేసుకొని, శాశ్వతుడైన పరమాత్మని మరిస్తే, మనకు లభించిన మానవజన్మను దుర్వినియోగం చేసుకొన్న వాళ్లమవుతాం. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి మసలుకోవడం మంచిది.

No comments:

Post a Comment