ఆప్తవాక్యాలు
11. అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత
ఓ ప్రియమైన మేధావులారా! భగవంతుని అర్చించండి(ఉపాసించండి).
విశేషంగా అర్చించండి(ఋగ్వేదం).
మానవుడైనవాడు చేయాల్సిన యజ్ఞాలలో 'దేవయజ్ఞం' ప్రధానం. దేవతల కృప
లేనిదే మనుగడ లేదు. జీవుడు తన కర్మఫలానికి అనుగుణంగా దేవతాశక్తులు
నిండిన శరీరాన్ని సంపాదించుకుంటాడు. ఆయా కర్మలకు ఆయా దేవతల అనుగ్రహమే
ఆయా ఇంద్రియాల శక్తులు.
సూర్యుని నుండి చూపు, వాయువు నుండి ఘ్రాణం, వరుణుని నుండి రుచి, అగ్ని
నుండి వాక్కు, ఇంద్రుని నుండి హస్తాలు.... ఇలా ఒకొక్క అవయవంలో ఒకొక్క
దైవశక్తి ఉంటుంది. వీటన్నింటినీ శాసించే బుద్ధి వద్ద నాడీ మండలంలో ఆయా
దేవతా స్థానాలున్నాయి.
మన శరీరాన్ని మనం నిర్మించుకోలేదు. దానిని నియమించడమే మన చేతిలోనిది.
కనుక దానిలోనున్న భౌతిక వివరాలే మనకు తెలియవు. అవి తెలియాలంటే సూక్ష్మమైన
భౌతిక వైజ్ఞానిక సాధనాలు కనిపెట్టాలి.
వాటిని శాసించే దైవిక శక్తుల్ని తెలుసుకునేందుకు మరో సూక్ష్మవిజ్ఞానం ఉంది.దానిని వేదసంస్కృతి బోధిస్తోంది.
మొత్తానికి దేవతల వలన కలిగిన ఈ దేహంతో కృతజ్ఞతాపూర్వకంగా దేవతల్ని
అర్చించాలి. అదే యజ్ఞం. ఈ యజ్ఞమే సమస్త ప్రపంచాన్ని సక్రమంగా నడిపే
సాధన. అందుకే 'యజ్ఞో భువనస్య నాభిః' అని శ్రుతి చెస్తోంది.
దేవతాశక్తులన్నిటికీ మూలమైన పరబ్రహ్మని శివునిగానో, విష్ణువుగానో,
జగదంబగానో భావించి పూజించే విధానం మన నిత్యజీవితంలో నిబద్ధీకరించారు
మన పెద్దలు.
-
ఈ పూజలన్నీ తక్కువ స్థాయికి
అయితే కాస్త మేధావులమనుకున్న వారు
చెందినవిగా భావించి, తమ మేధస్సే గొప్పదని వీటిని నిరసిస్తారు. అటువంటి
వారిని సుతిమెత్తగా మందలిస్తూ శ్రుతిమాత ఇలా బోధిస్తుంది.
మనమెంత జ్ఞానులమైనా అనేక జన్మల కర్మబంధాలు మనకు ఉన్నాయి. అవి
వాసనారూపంగా మన చిత్తంలో ఉంటాయి. అవి సమసిపోతేగానీ శుద్ధజ్ఞానం రాదు.
మేధస్సు వేరు, శుద్ధ జ్ఞానపూర్వకమైన ఆనందానుభవం వేరు. మేధస్సు అనేక విషయాలను పోగు చేయగలదు. కానీ సత్యసాక్షాత్కారం దానివల్ల కాదు.
కాబట్టి కర్మవాసనాక్షయం కావాలంటే భగవత్కృప కావాలి. భగవద్భావన
హృదయానికి పట్టడమే భగవత్కృప. ఆలోచించి నిర్ణయించే బుద్ధికి ఆరాధించి
ఆనందించే హృదయమూ కలవాలి. అప్పుడే జీవనం సక్రమమవుతుంది.
ఎన్ని కర్మవాసనలు పోగై ఉన్నాయో మనకు తెలియదు, ఎన్ని ప్రాకృతిక శక్తులకూ,
జీవకోటికీ మనం ఋణగ్రస్తులమో మనకు తెలియదు. ఆ వాసనలన్నీ తొలగాలి, ఆ
ఋణాలన్నీ తీరాలి. అది బుద్ధి శక్తులవల్ల జరగదు. ఈశ్వరార్చన వల్లనే
సాధ్యమౌతోంది.
మనకున్న శారీరక ఉపకరణాలు, అంతఃకరణం - వీటిలోనున్న దైవీశక్తులను
గుర్తించి, వీటిని శాసించే దేవతత్త్వాన్ని ఉపాసించాలి.
బుద్ధికున్న శక్తి పరిమితం. దాని శారీరక హద్దులు, శక్తిపరమైన హద్దులు స్వల్పం.
అందుకే యోగంతో శరీరశక్తిని పెంచుకుంటారు.
సత్యసాక్షాత్కారం బుద్ధికి అందదు. ఆలోచన, అధ్యయనం ఒక విధమైన అవగాహనని ఇస్తాయి. అంతే కానీ పరిపూర్ణ జ్ఞానానికి అది చాలదు. ఉపాసనాబలం వల్లనే అనేక రహస్యాలు అవగతమవుతాయి.
ఏ పుస్తకమూ, ఏ ప్రవచనమూ చెప్పలేని రహస్యాలు ఈశ్వరకృప వల్ల మాత్రమే
స్ఫురిస్తాయి.
మేధస్సుకి, ఉపాసన తోడైతే తాను తరించి, పదిమందినీ తరింపజేయగలడు.
భగవదర్చన లేనివాడు తరించడం పూర్తిగా అసాధ్యం అని వేదహృదయం.
అంతేకాక భగవదుపాసనలోని అంతరార్థం బుద్ధిపక్వత ఉన్నవారికే అర్థమవుతుంది.
కాబట్టి వారిని ఉద్దేశించి చెప్పిన వాక్యంగా కూడా దీనిని భావించవచ్చు.
No comments:
Post a Comment