*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*భయం... ఉన్మాదం!*
*నిర్మలమైన మనసుతో, నిష్కామభావంతో భక్తుడు సమర్పించిన పత్రం, పుష్పం, ఫలం, జలం తాను ప్రీతితో ఆరగిస్తానని భగవానుడే గీతాబోధ చేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మనిష్ఠతో జీవించగల శక్తిని అనుగ్రహించమని, సత్యవ్రతాన్ని పాటించే బుద్ధిని ప్రసాదించమని భగవంతుణ్ని ప్రార్ధించాలి. పూజించాలి.*
*భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం మనిషికి ధైర్యాన్నిస్తుంది. దేవాలయాల్లో భగవంతుడి ముందు ప్రణమిల్లినప్పుడు మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సంప్రదాయబద్ధమైన పూజావిధానాన్ని విస్మరించి కొంతమంది మూఢ నమ్మకాలతో క్షుద్ర పూజలకు పూనుకోవడం చూస్తున్నాం. ధన సంపాదన లక్ష్యంగా స్వార్థపరులైన తాంత్రికులు చేస్తున్న మోసాలకు అమాయకులు బలవుతున్నారు.*
*మనసు చంచలమైనది. అనంతమైన కోరికలతో మనిషిని వేధిస్తుంది. తమ కోరికలు తీర్చుకోవడానికి ఎంతటి పాపానికైనా సిద్ధపడటం స్వార్ధపరుల నైజం. కొన్ని ఊహలు భయపెడతాయి. భయం మనసును బలహీనపరచి మనిషి శక్తి సామర్థ్యాలను హరిస్తుంది. మానసిక బలహీనత మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. మనసును అదుపుచేయలేనివారు అసాధ్యమైన కోరికల సాధనకు తాంత్రికులను ఆశ్రయిస్తారు. కొందరు ఎన్నో అనుమానాలతో బాధపడుతూ ప్రారంభించిన పనులను పూర్తిచేయలేక సతమతమవుతుంటారు. అనుమానం పెనుభూతమై వారి మనసులో ద్వేషాన్ని రగిలిస్తుంది. ద్వేషం అనుచిత చర్యలకు ప్రేరేపిస్తుంది. ఇతరులు తమని ద్వేషిస్తున్నారని భావిస్తూ తమకేదో ఆపద రాబోతోందని భయపడుతూ దిక్కు తోచని స్థితిలో క్షుద్ర పూజలవైపు మొగ్గుతారు. కొన్ని దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు మానసికంగా క్షోభిస్తూ, తమకేదో జరిగిందనుకుంటూ, దానికి విరుగుడు అంటూ వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంటారు. గుప్తనిధులున్నాయన్న భ్రమలో కొందరు తాంత్రికులను ఆశ్రయించి ధనాన్నీ, విలువైన కాలాన్నీ నష్టపోతున్నారు. ఇలాంటివి వినాశనానికి దారితీస్తాయి. సంకుచిత మనస్తత్వమే మూఢనమ్మకాలకు పునాది. దాన్ని వదిలించుకోవాలి. కమలాక్షుడిని అర్చించు చేతులే చేతులు. లక్ష్మీపతిని కీర్తించు నాలుకే నాలుక. నారాయణుడికి మొక్కే శిరస్సే శిరస్స్కు ఆదిపురుషుడి మీద లగ్నమైన బుద్ధి సద్బుద్ధి అని చెప్పిన భాగవతాన్ని ప్రామాణికంగా తీసుకుని భగవంతుణ్ని ధ్యానించే భక్తులకు సర్వకార్యసిద్ధితో పాటు మనశ్శాంతి లభిస్తుంది.*
*సమస్యల వలయం నుంచి బయటపడే తరుణోపాయం ధ్యానమే. ఓంకారంతో నిండిన మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు సమస్యలకు మూలకారణం వెతుకుతుంది. పరిష్కారం దిశగా ఆలోచనలు విస్తరిస్తాయి. సత్పురుషుల సహవాసంతో మనోబలం చేకూరుతుంది. సకారాత్మక ఆలోచనలు రేకెత్తించే పుస్తకపఠనంతో మనసులోని దురాలోచనలు దూరమై చంచలమైన మనసు అదుపులో ఉంటుంది.*
*విషయ తృష్ణ వల్ల కలిగే వ్యాకులపాటు పేరే దుఃఖం. ఆ దుఃఖం నశించిపోవడమే సుఖం. సుఖం తరువాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం.. ఆ చక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఈ లోక గతిని బుద్ధిమంతుడు తెలుసుకోగలుగుతాడు. సుఖదుఃఖాలను సమానంగా ఎదుర్కొనగలుగుతాడు. శోకానికి వేల స్థానాలున్నాయి. భయానికి వందల అవకాశాలున్నాయి. అవి మూర్ఖుల మీద ప్రభావం చూపుతాయి. ఆలోచనాపరులను శోకం తాకలేదని చెబుతోంది భారతం. బుద్ధిని సక్రమమార్గంలో వినియోగించుకుని ప్రేమతత్వంతో ధర్మమార్గంలో మనుగడ సాగించడమే ఉత్తమ జీవన విధానం.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌵🌴 🌵🌴🌵 🌴🌵🌴
No comments:
Post a Comment