Thursday, November 7, 2024

 *మాటతో... చూపుతో...!*
                   
```
రామ పరాక్రమంతో చేతలుడిగి హతాశుడై యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకేఒక్క మాట- 'నేడు పోయి రేపు రా!’ అని. 

ఆ ఒక్కమాట దశకంఠుణ్ని జీవచ్ఛవంగా మార్చేసింది. ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు. అలాంటివాణ్ని నిలువునా దహించివేసింది- ఆ ఒక్కమాట!✍️


కురుక్షేత్ర సంగ్రామం చివరి దశలో భీముడి గదాఘాతానికి తొడలు పగిలి సుయోధనుడు దుర్మరణం చెందాడని భారతం చెబుతోంది. 

వాస్తవానికి అతడు ఘోషయాత్ర ఘట్టంలోనే సగం చనిపోయాడు. 

అరణ్యవాసం చేస్తున్న పాండవులను వేధించడానికి దుర్యోధనుడి పరివారమంతా కట్టకట్టుకొని వచ్చారు. చిత్రసేనుడనే గంధర్వరాజు వారందరినీ బంధించాడు. పాండవులే వచ్చి విడిపించి, ధర్మరాజు దగ్గర పంచాయతీ పెట్టారు. “ఇక్కడ జరిగిన అవమానం నీ రాజధాని ప్రజలకు తెలియదు కాబట్టి ఏమీ జరగనట్లు తిరిగి వెళ్ళిపో. ఇకపై బుద్ధి కలిగి ఉండు” అన్నాడు ధర్మరాజు. 

ఆ మాట సుయోధనుడికి ఎక్కడ ఎలా తగలాలో అక్కడ అలా తగిలింది. 'ఇప్పటికిప్పుడు భూమి చీలి నేను అందులో కప్పడిపోతే బాగుండేది' అని తానే అన్నాడు. ప్రాయోపవేశం చేయడానికి సైతం సిద్ధపడ్డాడు. అభిమాన ధనుడైన సుయోధనుణ్ని ధర్మరాజు కేవలం మాటలతో చంపేసిన తీరును ఎర్రన గొప్పగా వర్ణించాడు.✍️

No comments:

Post a Comment