Saturday, December 14, 2024

 _*🕉️🪷---"శ్రీ విష్ణు పురాణం"---🪷🕉️*_

_*శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః*_ 
_*శ్రీ గురుభ్యోనమః*_

🕉️🌷🕉️🌷🕉️🌷🕉️🌷🕉️

_*👉 11వ భాగం:-*_

మహారాజా! ధర్మనష్టం, దానివల్ల అనావృష్టి, దానిమూలాన పాడిపంటలూ నశించాయి. సన్యములూ, ఓషధులూ జీర్ణములై చెడిపోయాయి. ఇలా ఆకలిదప్పులకు చిక్కి శల్యాలమై పోయాము. అందరూ అడవులకు పోయి అక్కడ దొరికే కందమూలాలతో కక్కుర్తిపడి ప్రాణాలు నిల్పుకుంటున్నారు.

అన్నం ధాన్యమూలం. అందరికీ ఆధారం అన్నం. ఆ అన్నం లేకపోతే ఇక బ్రతుకెక్కడిది? ఆ అన్నం మాకు సంతృప్తిగా లభించే ఉపాయం చూసి ప్రజారక్షకుడవై వర్ధిల్లు మహారాజా! అని ఘోషించారు.

వారి ఘోష విని ఒక్కక్షణం పృథు చక్రవర్తి ఆలోచించాడు. సస్యనాశం చేసి ప్రజలకు కరువు కలిగించిన ఆ భూమినీ హతమారుస్తాను అని దిగ్గున లేచి విల్లందుకుని బాణం సంధించాడు. ఇక ప్రయోగించడమే తడవు. భూమి అదిరి గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్లాలని పరుగెత్తుతూండగా చక్రవర్తి వెంటవెళ్లుతూ నువ్వు ఎక్కడకు వెళ్లినా సరే నా బాణానికి గురికాక తప్పదు అని గట్టిగా అనగా భూమి రాజా! స్త్రీవధ పాపం అని నీకు తెలియదా? కాగా నన్ను చంపితే ప్రజలస్థితి ఏమి? నీవు పాలించేది ఎలాగ? ఆలోచించావా?...

ప్రజలకు తిండి లేకుండా చేసిన దుర్మార్గురాలవు. అందరిని కాపాడడానికి నిన్ను చంపడం పుణ్యమే గాని పాపం కాదు. వారి స్థితి తరువాత చూస్తాను. దైవబలం సమృద్ధిగా ఉన్నవాడను నేను. వారిని సుఖంగా పాలించడం నాకు కష్టంకాదు.

సరే - ఒక ఉపాయం చెప్తాను విను. దానివల్ల ప్రజాసంరక్షణ జరుగుతుంది. సస్యాలూ, ఓషధులూ నాలో జీర్ణములై ఉన్నాయి. ఇప్పుడు గోరూపాన ఉన్న నాకు ఒక దూడను కలిగించు. అది తాగే సమయంలో ఓషధులూ, సస్యాలూ ఆవిర్భవిస్తాయి. ఆ ప్రయత్నం చెయ్యి చక్రవర్తి భూదేవి మాటవిన్నాడు. సరే అన్నాడు. 

స్వాయంభువును దూడగా కల్పించి తానే పితికాడు. ఏకధారగా పాలు కురిశాయి. అవి నేలపై పడగానే సస్యములు మంత్రించినట్టు నూత్న శోభతో పైకి లేచాయి. ఎక్కడచూసినా భూమి సస్యశ్యామలమై కనుపండువుగా ఉన్నది. ఆ పాలతో దేవదైత్య కిన్నరాదులకు, మృగాలకూ, మానవులకు సమృద్ధిగా వారివారికి కావలసిన ఆహారం సమకూరింది. అలాగ భూమిని మళ్లీ యథాపూర్వ రూపానికి తెచ్చి సరసుర రంజనముగా పృథు చక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు. ఆ సత్రియ వలన భూమికి ఆ చక్రవర్తి పేరుతో 'పృథివి' అనే పేరు వచ్చింది.

_*ఈ పృథు చక్రవర్తి కథ విన్నవారికి ఏలాటి పాపమూ అంటదు. తేజస్సు, సమృద్ధిగా సిరిసంపదలూ, సుఖసంతోషాలూ, కీర్తి, ఆయురారోగ్యాభివృద్ధి, అశ్వమేథ యాగం చేసిన ఫలమూ ఆ మహావిష్ణువు ప్రసాదిస్తాడు.*_

ఆ పృథుచక్రవర్తికి అంతర్ది, వార్థి అని ఇద్దరు కొడుకులు. వారిలో అంతర్ధికి శిఖండియను భార్య యందు హవిర్ధానుడు అనే కొడుకు పుట్టాడు. వానికి అగ్ని వలన పుట్టిన ధిషణ అనే కాంత యందు ఒక కొడుకు కలిగాడు. అతడు యజ్ఞ సమయమందు కుశలను ప్రాచీనాగ్రములుగా ఉంచడం వల్ల ప్రాచీనబర్హి అని ప్రసిద్ధు డయ్యాడు. అతనికి సముద్ర పుత్రియైన సౌవర్ణయందు ధనుర్వేద పారంగతులైన ప్రచేతసులు పదిమంది పుట్టారు. వారు భేదము లేని పద్ధతిని ధర్మప్రవర్తనులై పదివేల సంవత్సరాలు సముద్రం నడుమ తపస్సు చేశారు అని చెప్పగా మైత్రేయుడు అడిగాడు.

గురువర్యా! ప్రచేతసులు సముద్రమధ్యమున అంతకాలం తపస్సు చెయ్యడానికి కారణం ఏమి? ఆ కథ వినాలని ఉంది అని అడగగా పరాశరుడు చెప్పాడు.

ప్రాచీనబర్హి ఇంద్రుడులాగా భూవలయమును ధర్మవైభవముతో పాలించాడు. తనమాట జవదాటక భక్తితో ప్రవర్తిస్తూన్న కొడుకులతో ఒక నాదన్నాడు.

మీరు ధర్మసమైక్యముతో ప్రవర్తిస్తూన్న బుద్ధిమంతులు కనుక మీకు అసాధ్యమేదీ ఉండదు. విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చెయ్యండి. ఆ దేవుని అనుగ్రహం వల్ల భావికాల ప్రజాపతి శక్తి పొంది చరాచర భూతసృష్టి చెయ్యండి అని చెప్పగా వారందుల కంగీకరించి సముద్రం నడుమ విష్ణువును ధ్యానిస్తూ అంతకాలం తపస్సు చేశారు. కాగా విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై మీ తపస్సుకి మెచ్చాను. వరాలు కోరండి ఇస్తా నన్నాడు.

'కమలామనోరమణా! జగదేకపవిత్రచరిత్రా! సరోజనేత్రా! శుభాలోకనా! సకల లోకపాలనా! కరుణాపయోనిధీ! మాకు ప్రజాపతి ప్రాభవం అనుగ్రహించు! అని వారు కోరారు.

'మీ కొడుకు దక్షుడనే పేరుతో ప్రజాపతి అవుతాడు అని వరమిచ్చి శ్రీపతి అంతర్హితుడు అయ్యాడు.

అలాగ విష్ణువువల్ల వరం పొంది తరువాత వారు సముద్ర మధ్యము నుంచి వెలుపలకు వచ్చారు. అంతకాలం వారు తపస్సు చేస్తూ సముద్రములో ఉండడం వల్ల దేశం అరాజకమై చెట్లు తెగ పెరిగి భయంకరారణ్యమైపోయింది. ఆ బాధ పోగొట్టాలని చంద్రుడు ఆలోచించి అవయవాల నిండుసొబగుతో మోహినీ దేవతను పోలిన ఒక కన్యను కల్పించి వారివద్దకు వచ్చి సమర్పించి అన్నాడు.

మీరు దేశమందు లేకపోవడంవల్ల వృక్షాలు తెగపెరిగి ఉండడంలో దోషం లేదు. ఇప్పుడు మీ కోపాగ్నికి చూడండి, చెట్లన్నీ మాడి మసి అయిపోయాయి. తపస్సు చేసిన మీవంటి వారికి దీర్ఘకోపం కూడదు. చెట్లు మీకు అనుకూలంగా ఉండడానికి ఇదిగో యీ కన్య ఆ వృక్షాల నుంచి ఆవిర్భవించి నా కిరణామృతం వల్ల పెరిగింది. పేరు మారిష ఈమెను గృహిణిగా పరిగ్రహించండి. 

అప్రమేయబలుడైన సుతుడు జన్మిస్తాడు. ఆ కొడుకు మీకూ నాకూ గల తేజస్సు నుంచి భాగం పొంది దక్షుడనే పేరున ప్రజాపతి అవుతాడు. అతనివల్ల ప్రజాసమృద్ధి అవుతుంది అని సానునయముగా చెప్పగా ప్రచేతసు లంగీకరించి చంద్రునితో అన్నారు.

ఈమె చెట్లనుంచి ఎలా పుట్టింది? నీ కిరణప్రసారముచే పెరగడ మేమిటి? అది వివరించు - అని అనగా చంద్రుడు చెప్పాడు.

_*రేపటి భాగంలో మళ్లీ కలుసుకుందాం...*_

_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_
_*జై శ్రీమన్నారాయణ*_

_*సర్వేజనా సుఖినోభవంతు...*_

🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

No comments:

Post a Comment