Saturday, December 14, 2024

 నారద భక్తి సూత్రములు 
           76 వ సూత్రము
            "భక్తి శాస్త్రాణి మననీయాని తదుద్బోధక కర్మాణ్యపి కరణీయని"  

భగవత్భక్తికి, భక్తిరసగ్రంధాలు, శాస్త్రాలు చదవాలి,మనస్సులో మననం చేసుకోవాలి,అలాగే భక్తికి దోహదం కలిగించే కార్యాలే చేస్తూఉండాలి, తప్పక తాను ఆచరిస్తూ ఇతరులకు తాను ఆదర్శంగా ఉండాలి. ఇందువల్ల భక్తుని మనస్సు పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. 
పరమేశ్వర ప్రీత్యర్థం పూజలు,మాతృ పితృ సేవలు చేస్తూఉండాలి,భార్యాపుత్ర పరిజన పోషణ తో పాటు అతిధి అభ్యాగతులను ఆదరించాలి,ధర్మబద్దం గా జీవనాన్ని సాగిస్తూ,దానధర్మాలు జపతపాదులు నిర్వహించాలి.సతతం సత్కార్యాలు చేస్తూ ఉండాలి.

పరమ ప్రేమభక్తి కోరేవాడు బ్రహ్మ నిష్ఠగలవాడై ,శాంత చింతన సచ్చితానందస్వరూపమైన సద్గురు చరణ కమలాలను ఆశ్రించాలి,గురువునే ఇష్టదైవం గా భావించి భాగవత ధర్మాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలి.భక్తులకు గురు సేవవలన విషయ వాసనలపై వైముఖ్యం,సాధు పురుష సాంగత్యం వల్ల అనన్య భక్తి ఏర్పడి భగవత్ అనుగ్రహణ సులభతరం అవుతుంది.

సదాచార పరిపాలన,శీలసంరక్షణ,సత్సంగం,భగవత్గుణవర్తనం,సాధు పురుషుల సేవనం,తీర్థ సేవనం,యాత్రాదర్శనం,దీనమానవ సేవ,సర్వకార్య ఫల సమర్పణ ను ప్రతీ భక్తుడు అలవర్చుకోవాలి.

           77 వ సూత్రము
            "సుఖ దుఃఖేచ్చా లాభాది త్యక్తే కాలే ప్రతీక్ష్యమాణే క్షణార్థమపి వ్యర్థం న నేయమ్"

భక్తుడు సుఖదుఃఖాలు,లాభనష్టాలు,రాగద్వేషాలు మున్నగు ద్వంద్వాలకు అతీతంగా ఉండే తన్మయత్వ స్థితి కొరకై ఎదురుచూస్తుండాలి,పరమేశ్వర ధ్యానం చేస్తూఉండాలి, క్షణకాలం కూడా వ్యర్థం చెయ్యకుండా ఆ పరమాత్మ పాదారవిందాలనే ఆత్మలో అనుసంధానం చేసుకొని భక్తుడు భక్తి తత్పరుడై ఉండాలి.       
ప్రతీక్షణం అనన్య హరినామకీర్తన చేస్తూవుండమన్నారు,మృత్యువు ఏ రూపంలో కబళిస్తుందో! భగవంతుడు ఏ క్షణంలో కబురు పంపుతాడో! ఎవరికీ తెలియదుకదా కాబట్టి క్షణకలం కూడా వ్యర్థం చెయ్యక భగవత్ సాధన చేయమన్నారు నారద మహర్షి.    

No comments:

Post a Comment