మాయాధీన శ్చిదాభాసః శ్రుతౌమాయీ మహేశ్వరః ౹
అన్తర్యామీచ సర్వజ్ఞో జగద్యోనిః స ఏవ హి ౹౹157౹౹
157. మాయయందు ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడనీ,అతడు మాయకు ప్రభువనీ,ఆ మహేశ్వరుడు అంతర్యామీ సర్వజ్ఞుడూ జగత్కారణమూ అనీ శ్రుతి చెప్పును.
శ్వేతాశ్వర ఉప.4.9-10;
మాండూక్య ఉప.6.
సౌషుప్త మానందమయం ప్రక్రమైవం శ్రుతిర్జగౌ ౹
ఏష సర్వేశ్వర ఇతి సోఽ యం వేదోక్త ఈశ్వరః ౹౹158౹౹
158. "సౌషుప్త మానందమయ" మని మొదలై "ఏష సర్వేష్వర" యని అంతమగు శ్రుతి వాక్యము ఆనందమయ కోశమునే ఈశ్వరుడని వర్ణించినది.
వ్యాఖ్య:-
మాండూక్య ఉప.5-6;
బృహదారణ్యక ఉప.4-4-22.
ఆనందమయ కోశముల సమిష్టియే ఈశ్వరుడని ఉద్దేశము.
పైన వాసనలయందు ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడని చెప్పబడినది గదా!
ఆ సూక్ష్మవిషయమును అర్థము చేసికొనలేని వారికి గ్రహణ సౌలభ్యము కొరకు అట్టి ప్రతిఫలనమగు ఆనందమయ కోశమే ఈశ్వరుడని చెప్పబడుచున్నది.
స్పష్టముగ ఆనందమయకోశమే ఈశ్వరుడనుటపై కూడా గొప్ప వాదోప వాదములున్నవి. విషయమే మనగా
జీవుడు వ్యష్టియందు ప్రతిఫలించిన చైతన్యము.
ఈశ్వరుడు సమిష్టియందు ప్రతిఫలించిన చైతన్యము.
సమిష్టియందు వ్యష్టులన్నీ గ్రహింపబడుటచే ఈశ్వరునియందు జీవులందరును గ్రహింపబడుదురు.కాని అంత మాత్రముచే జీవులందరును వేరువేరుగ ఈశ్వరుడు కాజాలరు.
గంగానదిలో ఎన్నో నీటి బిందువులున్నవి.కాని అన్నీ వేరువేరుగ గంగానది కానట్లే,అనగా సమిష్టియందు సముదాయము మాత్రమే గాక ఒక విశిష్టమైన ఐక్యత కూడా ఉద్దేశింపబడుచున్నది.
No comments:
Post a Comment