*🍒రెండు విందులు😇*
🦚🌹🌻💜🎈🌈
*🍁ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు*
*అన్న చాలా భాగ్యవంతుడు.* *తమ్ముడు, పాపం అమిత బీదవాడు.*
*తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినటానికి భార్యను ఏమైనా చేసియివ్వ మని అడిగాడు. భార్య ఐదు మినప సున్ని ఉండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. అతను ఆమూట కర్రకు తగిలించుకుని, కర్ర భుజాన పెట్టుకుని బయల్దేరాడు. పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువూ దాని పక్కన వెదురు పొదా కనిపించాయి. ఆ చెరువులో కాసిని నీళ్ళు తాగి, భుజం మీది మూట వెదురు పొదలో ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్ర పోయాడు.*
*కొంత పొద్దెక్కినాక గాని అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురు గడ ఎండకు పైకి నిలబడి ఉంది. దానితో పాటు అతని మినపసున్ని ఉండల మూట కూడా పైకి వెళ్లింది. మళ్ళీ సాయం కాలమైతే గాని మూట కిందికి రాదని గ్రహించి అతను ఆకలి తోటే మళ్ళీ నిద్రపోయాడు.*
*ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న అయిదుగురు గంధర్వులకు మినపసున్ని ఉండల వాసన తగిలింది. వెదురు గడకు వేళ్లాడేమూటను చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు సున్ని ఉండలూ ఐదుగురూ తిన్నారు. చెరువు గట్టుననిద్రపొయ్యే మనిషిని చూసి అతని బీద స్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు.*
*అతను లేచేసరికి సాయంకాలమయింది. వెదురుగడ కిందికి వంగి ఉంది. ఆకలి* *దహించుకుపోతూండటం వల్ల అతను ఆత్రంగా మూట దించుకుని విప్పి చూసే సరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యం తో దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలో నుండి ఇద్దరు గంధర్వ స్త్రీలు బయటికి వచ్చి పంచభక్ష్య పరమాన్నాల తో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్లి మాయమయ్యారు.*
*అతను భోజనం చేసి, సంతోషంతో పెట్టె తీసుకొని ఇంటికి వెళ్లి భార్యకు జరిగిన సంగతంతా చెప్పాడు. ఆ మర్నాడతను ఊళ్లో వాళ్లందరినీ పిలిచి పెట్టె సహాయం తో వచ్చిన వాంరందరికీ షడ్రసోపేకంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్లిపోయారు.*
*తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవతుడైన అన్నకు తెలిసి అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకొన్నాడు. భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకు రావాలను కున్నాడు. భార్య చేత మినపసున్ని ఉండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్లిన దారినే బయలుదేరాడు.*
*వెళ్లి వెళ్లి ఇతను కూడా చెరువు దగ్గిరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించి పడుకుని నిద్రపోయినాడు.*
*ఎప్పటిలాగే ఐదుగురు గంధర్వులూ అటుగా వెళ్లుతూ సున్ని ఉండల వాసన పసికట్టి మూట విప్పి చూశారు.*
*'ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్లీ వచ్చాడు. చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే' అనుకున్నారు. మినపసున్నీ ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్లిపోయినారు.*
*మర్నాడు సాయంకాలం వెదురు కిందికి వంగగానే అన్న మూట విప్పి ఆత్రంగా చూసుకున్నాడు. మూటలో పెట్టె ఉంది.*
*'తన పని నెరవేరిందిగదా' అనే సంతోషం తో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి మేరలేదు* .
*మరుసటి రోజున అన్న కూడా ఊళ్లో వాళ్ల నందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచే సరికి అందులో నుంచి అతిధికి ఇద్దరేసి మంగళ్ళు పొదులతో సహా బయటికి వచ్చారు. ప్రతి అతిధినీ ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నున్నగా గొరగసాగాడు. కొద్దిసేపట్లోనే అతిధుల అందరి తలలూ బోడిగుండ్లు ఆయాయి. తర్వాత మంగలి వాళ్లంతా పెట్టెలోకి తిరిగివచ్చి మాయమయ్యారు.*
*ఆ రోజు ఆ వూళ్లో అన్నను తిట్టని వాళ్ళు లేరు. అతను ఆలస్యం చెయ్యకుండా తనకు దొరికిన ఆ పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయిశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు.*
🤥
*అయిపొయింది*
రచన : అవసరాల రామకృష్ణరావు,
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
🦚🌹🌻🎈💜🌈
No comments:
Post a Comment