Wednesday, December 11, 2024

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

40. భూతహిత యథార్థ భాషణమేవ సత్యమ్

భూతహితాన్ని కలిగించే యథార్థ భాషణమే సత్యం (ఉపనిషద్వాక్యం)

భారతీయధర్మం ఆచరణీయమైన నీతిని చెప్తుంది. అంటే ఒక నీతిని అన్ని కోణాల్లో ఆలోచించి ప్రతిపాదించడం.

ఒక ధర్మం నిలబెట్టుకోడానికి సందర్భం, సమయోచితం - వంటి వాటిని గమనించి చెప్పే సిద్ధాంతానికే ఆచరణ సామర్థ్యం ఉంటుంది.

వేదమతం 'సత్యభాషణ' అనే విషయాన్ని ఎంత సుస్పష్టంగా నిర్వచించిందో పై ఉపనిషద్వాక్యాన్ని పరిశీలిస్తే అవగతమౌతుంది.
-
'యథార్థభాషణం - సత్యం' అన్నది రూఢియైన విషయం. ఏది ఉన్నదో దానినే మాట్లాడడం సత్యం ఈ నిర్వచనం సర్వసామాన్యం. జరిగినదానినీ, ఉన్నదానినీ
తప్ప లేనిదానిని(అబద్ధాన్ని) పలకరాదు. మాటకి ఈ నియమం చాలా అవసరం.

కానీ ఒకొక్కసారి ఈ నియమం వల్ల కొన్ని ప్రమాదాలు వస్తాయి. మనం ఉన్నదున్నట్లు మాట్లాడడం వల్ల ఒక ప్రాణి శ్రేయస్సుకే దెబ్బ కలిగే అవకాశం ఉంటుంది. అప్పుడేం చేయడం? దానికి సమాధానం - 'భూతహిత' అనే శబ్దం. ముందు జీవకోటి హితానికే ప్రాధాన్యం. దానికి దెబ్బతగిలే యథార్థభాషణం సత్యం కానేరదు.

కేవలం ‘భూతహితం' అన్న విషయంలోనే యథార్థతని ప్రక్కకి తప్పించవచ్చు. ఈ సడలింపు ‘భూతహితం' అన్న అంశంలోనే అన్న విషయాన్ని మరచి స్వార్థప్రయోజనాల కోసం యథార్థ భాషణని విడవడం తగదు. అది అసత్యమే అవుతుంది. 'యథార్థత' కన్నా 'భూతహితమే' మాటకి పరమ ప్రాధాన్యం. ఉదాహరణకు -

ఒక వ్యక్తిని ఒక హంతకుడు వెంటాడుతుంటే, ఆ వ్యక్తి రక్షణ కోసం మన ఇంట్లో ప్రవేశించి దాగి ఉన్నాడనుకోండి. కొంతసేపటికి హంతకుడు వచ్చి, 'ఎవరైనా ఇటు
వచ్చారా?” అని ప్రశ్నిస్తే, సత్యానికి పోయి ఆ శరణాగతుని అప్పజెబితే, అది 'సత్యం' అనిపించుకోదు. అక్కడ సత్యం వల్ల వచ్చే సుకృతం రాదు సరికదా, భూతహితాన్ని దెబ్బతీసిన పాపం వస్తుంది.

అందువల్లనే అహింసాత్మకమైన యథార్థ భాషణ ప్రధానం. యథార్థం ముఖ్యమేగానీ,అంతకన్నా ముఖ్యం భూతహితం.
-
సత్యభాషణ యొక్క సమగ్రతని పట్టి చూపించే ఈ వాక్యం ద్వారా భారతీయ తాత్త్వికచింతనలో సాటి ప్రాణికోటి పట్ల ఎంతటి ప్రేమ, అహింసలు ప్రకటించారో
స్పష్టమౌతుంది.

ధర్మాలలో సత్యానికే అగ్రతాంబూలం. అందులో మళ్ళీ భూతహితానికి ప్రాముఖ్యం.

ఇంకా భావిస్తే - కేవలం సాటి మానవుని శ్రేయస్సు మాత్రమే కాదు. 'భూత' - అంటే ప్రాణికోటి. స్థావర జంగమాత్మకమైన జీవకోటి అంతా భూతకోటి క్రిందికే వస్తుంది.

చెట్టూ, చేమా, పక్షి, జంతువూ - అన్నీ ప్రాణులే. వాటి క్షేమ ముఖ్యమే. మనచుట్టూ, మనతోపాటు ఉన్న ప్రకృతి యొక్క హితాన్ని విస్మరిస్తే -
అంతకన్నా పాపం మరొకటి లేదు.

మన జీవన విధానమంతా ప్రకృతి హితం కోసం పాటుపడడంలోనే ఉంది. ఈ సత్యభాషణలోని ప్రాధాన్యాలను పేర్కొనడంలోనే మన ఋషుల దృష్టిలోని నిశితత్వం
గోచరిస్తుంది. ఎంత సూక్ష్మంగా ఆలోచించి ఈ సనాతన మతంలోని ధర్మాలు ఏర్పాటు చేయబడ్డాయో అర్థమౌతుంది.

ఈ విషయాన్నే శ్రీకృష్ణదేవరాయలు 'ఆముక్తమాల్యద'లో చెప్తూ-

'బొంకి సత్యశాలి, చంపి ధార్మికుండు' - అని వివరించారు.

భూతహితం కోసం బొంకినా సత్యశాలి అవుతాడు. శాశ్వత శాంతి కోసం, ధర్మం కోసం అర్హత గలిగినవాడు అధర్మపరుని రూపుమాపినా అతడు ధార్మికుడు అవుతాడు.
కనుక ధర్మాల ఆచరణ విషయంలో స్థూలంగా ఒక్క నిర్వచనంతోనే సరిపెట్టలేం.

ప్రకృతి హితం - శాంతి.... అనే అంశాలను దృష్టిలోనుంచుకుంటే ధర్మాలలోని సూక్ష్మాంశాలు అర్థమౌతాయి. అంత సూక్ష్మంగా ధర్మాన్ని పాటించి, సుప్రతిష్ఠితం
చేసిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మనకు చూపించిన సత్పథాలే అనుసరణీయాలు.

No comments:

Post a Comment