Wednesday, December 11, 2024

 **************************                _*“భగవద్గీత - ఆత్మవిజ్ఞానశాస్త్ర మహాగ్రంధం”*_
(నేడు - మార్గశిర శుక్ల ఏకాదశి - గీతా జయంతి సందర్భంగా...)
**************************
 _*కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు గాండీవాన్ని క్రిందపడవేసి .. యుద్ధరంగం నుంచి పలాయనం చిత్తగించాలని చూసినట్లు...,  ఒక్కోసారి మనం కూడా ఆత్మజ్ఞానంతోనో, పామరత్వంతోనో మన జీవన కర్తవ్యాల నుంచి తప్పించుకో జూస్తూంటాం. అప్పుడు భగవద్గీత మనకు సత్యాన్ని బోధించి .. మనతో ధర్మాన్ని ఆచరింపజేసి .. క్రిందపడిన గాండీవాన్ని మళ్ళీ అర్జునుడిచే సంధింపజేయించినట్లు మనల్ని కూడా కర్తవ్య పరాయణులను చేస్తుంది. అందుకే “భగవద్గీత” అన్నది ఆత్మవిజ్ఞాన శాస్త్ర మహాగ్రంథం!*_
 *************************
అది మనకు సత్య దర్శనం గురించీ మరి ధర్మాచరణం గురించీ విశేషంగా ప్రబోధిస్తూ ఉంటుంది.
---------------------------------------
*“సత్యం” అన్నది “జ్ఞాతవ్యీయం” .. అంటే తెలుసుకోవలసినది .. మరి “ధర్మం” అన్నది “ఆచరణీయం” అంటే నిరంతరం ఆచరించవలసింది.*
----------------------------------------
సత్యం తెలియకపోతే మనకు ధర్మాన్ని ఆచరించే విధివిధానం అర్థం కాదు. దాంతో యుద్ధరంగం నుంచి పలాయనం చెందాలని అర్జునుడు ప్రయత్నించినట్లు మనం కూడా ప్రాపంచిక సంసారంలో కర్తవ్యాల నుంచి తప్పించుకోవాలని చూస్తూంటాం.
----------------------------------------
మన ముసలి తల్లితండ్రులనూ మరి ఇంట్లో ఉన్న ఇతర పెద్దలనూ చూసుకోవడానికి విముఖత చూపిస్తూ .. వారిని వృద్ధాశ్రమాలలో చేర్పించి .. అదే "కర్తవ్యం” అని చేతులు దులుపుకుంటాం♪. కానీ .. “ఈ జన్మలో మనం మన కర్తవ్యాలను సరిగ్గా ఆచరించకపోతే మళ్ళీ మళ్ళీ అనేక జన్మలు ఎత్తి అవే కర్తవ్యాలను అవే పరిస్థితులలో మళ్ళీ మళ్ళీ నిర్వర్తించాల్సి వస్తుంది” అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి.
----------------------------------------
_*“తే త్వం భూంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి*_
_*ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే”*_ 
                        (భ.గీ.9-2)
----------------------------------------
“ఆ విశాలమైన స్వర్గలోకాలలోగల భోగాలను అనుభవించిన తరువాత .. మరి పుణ్యం అయిపోగానే .. నువ్వు మళ్ళీ మర్త్యలోకాలకు ప్రవేశిస్తావు. ఈ ప్రకారంగా మూడు రకాల ధర్మ కర్మలను ఆచరిస్తూ .. భోగాలను ఆశిస్తూ .. స్వర్గ మర్త్య లోకాలకు మధ్య రాకపోకలను సాగిస్తూనే ఉంటావు” అన్నారు శ్రీకృష్ణుల వారు.
----------------------------------------
పుణ్యం పెరగగానే స్వర్గలోకానికీ మరి పుణ్యం క్షీణించగానే మర్త్యలోకానికీ తిరుగుతూ .. మనలో ఉన్న “కామం” అన్నది “అకామం” అయ్యేంతవరకూ మనం రాకపోకలను సాగిస్తాం. ఎప్పుడయితే “త్రయీధర్మ పరాయణులుగా” మన 'దేహధర్మం', మన 'కుటుంబధర్మం' మరి మన 'సంఘధర్మానికి' చెందిన కర్తవ్యాలను ఆత్మజ్ఞానంతో సంపూర్ణంగా ఆచరిస్తామో .. అప్పుడు ఇక మళ్ళీ ఈ భూమిమీదకు నేర్చుకోవడానికి రావలసిన అవసరం ఇక ఉండదు.
----------------------------------------   *“దేహ ధర్మం"*
----------------------------------------      ఈ దేహం మనకు ప్రకృతి నుంచి లభించింది. ఇందులోకి మనం ప్రవేశించాం కనుక దీనిని జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం. అశాస్త్రీయమైన తిండితో, అశాస్త్రీయమైన ఆలోచనలతో మరి అశాస్త్రీయమైన కర్మాచరణలతో దానిని పాడుచేసుకోకూడదు.
---------------------------------------
 అద్దెకు తీసుకున్న కొంపను ఇష్టం వచ్చినట్లు “కొల్లేరు”లా చేస్తే దాని యజమాని ఊరుకోనట్లే .. ప్రకృతి నుంచి అద్దెకు తీసుకున్న మన ఈ శరీరాన్ని తినకూడని వాటితో మరి తాగకూడని వాటితో నింపేస్తూంటే ఆ శరీరానికి యజమాని అయిన ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? “నా ఇంటిని నీకు ఎలా ఇచ్చానో .. నువ్వు నాకు అలాగే అప్పచెప్పకపోతే నీ మీద ‘దావా’ వేస్తాను” అని ఇంటి యజమాని బెదిరించినట్లు .. ప్రకృతి కూడా ఏ క్యాన్సర్ రూపంలోనో, డయాబెటీస్ రూపంలోనో, లివర్ సిర్రోసిస్ రూపంలోనో మన మీద ‘దావా’ వేస్తుంది!
----------------------------------------
 చాలా మంది “మాకు అన్నీ తెలుసు” అనుకుంటూ..“ ఎవరో చంపిన జంతువులను మేము తింటే తప్పేంటి? మేము స్వయంగా చంపట్లేదు కదా?” అని అతితెలివిగా వాదిస్తూంటారు♪. ఎవడో వచ్చి మన క్రొత్త పెట్రోలు కారులో ‘డీజిల్’ పోస్తే పాడైపోయేది మన కారే కదా! ఇది కూడా అంతే!
----------------------------------------
 ప్రకృతిని మనం ఎంతగా నాశనం చేస్తామో అంతగా అది మనకు శిక్ష వేస్తుంది. కనుక ‘నాగరికత’ ముసుగులో శరీర ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా .. చేయవలసిన ధ్యానం చేసి విశ్వశక్తితో శరీరాన్ని వజ్రకాయంలా మార్చుకోవాలి.
----------------------------------------  *“కుటుంబ ధర్మం”:*
----------------------------------------
 ఒకానొక తల్లిగా, ఒకానొక తండ్రిగా, ఒకానొక కొడుకుగా, ఒకానొక కూతురుగా, ఒకానొక అన్నగా, ఒకానొక తమ్ముడిగా .. ఇలా మనం కుటుంబంలో ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రకు తగ్గట్లు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మన సకల కుటుంబసభ్యుల పట్ల విద్యుక్త ధర్మాలను నెరవేర్చాలి.
---------------------------------------
 _*“సంఘధర్మం”:*_  
----------------------------------------
 మనకు ఉన్నదాంట్లో కొంత వాడుకుని .. మిగతాది సంఘంలోని ఇతర సభ్యులతో పంచుకోవాలి. సంఘ నిర్వహణ కోసం ప్రకృతిపరంగా విధించబడిన కట్టుబాట్లను గౌరవిస్తూ .. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తూ సంఘంలో ఒక సభ్యుడిగా సంఘం పట్ల మన కనీస ఆధ్యాత్మిక, ప్రాపంచిక ధర్మాలను నెరవేర్చాలి.
----------------------------------------
_*“యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి*_
_*శుభాశుభపరిత్యాగీ భక్తి మాన్ యః స మే ప్రియః”*_       
                       (భ.గీ.12-17)
----------------------------------------
“ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు, దేనిపట్ల కూడా ద్వేషభావం లేనివాడు దేనికీ శోకింపని వాడు, దేనినీ ఆశింపనివాడు .. శుభాశుభ కర్మలను త్యజించినవాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు” అని ఒకానొక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలను తెలియజేశారు శ్రీకృష్ణులవారు.
----------------------------------------
 ఇలా ఏది ఉన్నా ఏది ఊడినా బాధపడకుండా దేనిపట్ల కూడా ద్వేషం లేకుండా, దేనికీ శోకించకుండా ప్రకృతి మనకు అందించిన వాటిని “ఉన్నది ఉన్నట్లుగా” స్వీకరించి ముందుకు సాగుతూ మనం స్వర్గలోకానికీ .. మర్త్యలోకానికీ మధ్య రాకపోకలు చేయాలి♪. వస్తూ పోతూండే ఈ క్రమంలో .. క్షీణించిన మన శరీరాన్ని చినిగిన బట్టను విసిరివేసినట్లు వదిలివేస్తూ .. మళ్ళీ క్రొత్త బట్టలను ధరించినట్లు .. క్రొత్త జన్మలో క్రొత్త శరీరాన్నిధరిస్తూ ఉండాలి.
----------------------------------------
 అనగ అనగ రాగమతిశయించినట్లు రాగాపోగా ఎప్పటికో ఒకప్పటికి మనలోని కామాలన్నీ కూడా “అకామాలు” అయిపోయి .. పరిశుద్ధం చెందబడతాయి.
----------------------------------------
_*“అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే*_
_*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షే మం వహామ్యహామ్”*_
                      (భ.గీ.|| 9-22)
----------------------------------------
 “వేరే ప్రాపంచిక ఆలోచనలు లేకుండా నిరంతరం తనలో తాను నిమగ్నమవుతూ నిష్కామ భావంతో తనను తాను సేవించుకునే వారి యోగక్షేమాలను వారు స్వయంగా వహిస్తాను” అని భగవాన్ శ్రీకృష్ణుల వారు తెలియజేశారు.
----------------------------------------
 ప్రతి ఒక్క ఖజానాను తెరవడానికి ఒక రహస్యమైన “తాళం చెవి” ఉన్నట్లే భగవద్గీతను అర్థం చేసుకోవడానికి కూడా ఒక రహస్యమైన “తాళం చెవి” ఉంది.
----------------------------------------
 అదే “మామ్” మరి “అహం” పదాలు యొక్క సరియైన అర్థాలు:
----------------------------------------
 ఇక్కడ “మామ్” అన్నా మనమే .. మరి “అహం” అన్నా మనమే! ఒకటి మన అంశాత్మకు సంకేతం మరి ఇంకొకటి మన పూర్ణాత్మకు సంకేతం! రెండూ మనమే!
----------------------------------------
అంశాత్మలమైన మనం మన స్వీయ పూర్ణాత్మల పట్ల అనన్య భక్తితో ఉంటూ, పూర్ణాత్మనే సేవిస్తూ .. పూర్ణాత్మనే ధ్యానిస్తూ .. నిష్కామ భావంతో పూర్ణాత్మనే చింతిస్తూ ఉంటే .. మన పూర్ణాత్మే మన యోగక్షేమాలను చూసుకుంటూ ఏదో ఒక నాటికి మనల్ని కూడా తనంతటి పూర్ణాత్మలుగా పరిమారుస్తుంది! అంటే మనల్ని మనమే ఉద్ధరించుకుంటున్నామన్న మాట!
---------------------------------------
_*“ఉద్ధరేదాత్మనాత్మానాం ఆత్మానమవసాదయేత్*_
_*ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః”*_ 
                            (భ.గీ.6-5)
----------------------------------------
 “ఈ సంసార సాగరంలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి♪. ఎవరూ తమను తాము అధోగతి పాలుచేసుకోకూడదు. వాస్తవానికి ఈ లోకంలో ఎవరి ఆత్మే వారికి మిత్రుడు మరి ఎవరి ఆత్మే వారికి శత్రువు” కనుక .. మనం చెయ్యవలసిందల్లా నిరంతరం ధ్యానసాధనతో కూడిన ఎరుకతో మన పూర్ణాత్మకు అనుసంధానమై ఉండడమే .. అదే మనకు వున్న ఒక్కగానొక్క రాచబాట!
---------------------------------------
 ఇలా నిరంతరం ధ్యాన యోగ సాధన వల్ల మాత్రమే ఆత్మతత్త్వం అవగతమై .. మన ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం దూరం అవుతుంది కనుక ..
----------------------------------------
_*“తపస్వి యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః*_
_*కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున”*_  
                          (భ.గీ.6-46)
----------------------------------------
 “ఒకానొక యోగి తాపసులకంటే శ్రేష్ఠుడు. శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు. సకామ సాత్విక కర్మలను ఆచరించే వారి కంటే శ్రేష్ఠుడని భావించవచ్చు, కనుక అర్జునా! యోగివి కా” అని సూచించాడు శ్రీకృష్ణుడు.
---------------------------------------
 రకరకాల పూజలూ, ఉపవాసాలూ మరి తపస్సులూ చేస్తే శరీరం తపిస్తుందే కానీ ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానం మాత్రం పోదు గాక పోదు! సకల సంస్కృత శ్లోకాలను కంఠతా పట్టేసి రకరకాల శాస్త్రవిజ్ఞాన గ్రంథాలను పఠించేస్తే అక్షర పండితుడు అనబడతాడు కానీ అతని ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం పోదు గాక పోదు! గొప్ప గొప్ప కర్మలు చేసి ఎన్నెన్నో కీర్తిప్రతిష్ఠలు పొందినా ఆత్మను ఆవరించి వున్న అజ్ఞానం పోదు గాక పోదు! అందుకే ..
---------------------------------------
_*“క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే*_
_*క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప”*_  
                            (భ.గీ.2-3)
----------------------------------------
“ఓ అర్జునా! పిరికితనానికి లోనుకావద్దు .. నీకు ఇది ఉచితం కాదు. ఓ పరంతపా! ఈ హృదయ దౌర్భల్యాన్ని వీడి యుద్ధం చేయడానికి నడుము బిగించు” అంటూ కర్తవ్య బోధ చేశాడు శ్రీకృష్ణుడు.
----------------------------------------
 “శరీరం” అన్నది “ఆత్మ” కు “నీడ” వంటిది. శరీరానికి రోగం వచ్చినప్పుడు నీడకు చికిత్స చేస్తే లాభం లేనట్లు ఆత్మకు “అజ్ఞానం” అనే రోగం ఆవరించినప్పుడు దాని నీడలాంటి శరీరంతో తపస్సులు చేసినా, ఉపవాసాలు చేసినా, ఆసనాలు వేసినా, పుణ్యనదులలో మునిగినా మరి స్త్రోత్ర పారాయణలు చేసినా లాభం ఉండదు! చెయ్యవలసింది .. చిత్తవృత్తులన్నింటినీ నిరోధించుకుని ధ్యానం చేసి ఆత్మమూల ప్రకృతితో సంయోగం చెంది సత్యాన్ని అవగతం చేసుకోవడం.
----------------------------------------
సత్యాన్ని తెలుసుకునేంత వరకూ .. దానిని తెలుసుకోవడమే మన పని! మరి తెలుసుకున్నాక దానిని అందరికీ తెలియజెయ్యడమే మన పని!
----------------------------------------
 మనం ఎవరిమో ఏ పని కోసం పుట్టామో తెలుసుకునేంత వరకూ మన ఆత్మకు దుఃఖమే ఉంటుంది. తెలుసుకున్న తరువాత ఇక ఆ చెయ్యాల్సిన పని చేస్తూంటే ఆనందమే ఆనందం! అలనాడు గౌతమ బుద్ధుడు అనుభవించిన ఆనందం అదే.. మరి ఈ రోజు ఆనాపానసతి .. “శ్వాస మీద ధ్యాస” ధ్యానప్రచారం చేస్తూ పిరమిడ్ మాస్టర్స్ అనుభవిస్తూన్న ఆనందం అదే!
----------------------------------------
 కనుక చిన్నప్పటి నుంచే యోగస్థితిలో ఉంటూ పరమ యోగిలా గృహస్థధర్మంలోకి ప్రవేశించి విహిత ప్రాపంచిక కర్మలు చేయాలి. అప్పుడే అవి ధర్మబద్ధంగా సమస్థితిలో ఉంటాయి. లేకపోతే జీవితం అంతాకూడా తప్పులతడకగా మారి “గృహస్థధర్మం” అంతా కూడా “గృహస్థ అధర్మం” అవుతుంది. అందుకే....
----------------------------------------
 _*“యోగస్థః కురుకర్మాణి సంగం తక్త్వా ధనంజయ*_
_*సిద్ధ్యస్సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే”*_
                          (భ.గీ.2-48)
----------------------------------------
 “ఓ ధనుంజయా! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ధి అసిద్ధుల పట్ల సమత్వభావాన్ని కలిగి కర్తవ్యకర్మలను ఆచరించు.          ఈ సమత్వభావాన్నే యోగం అంటాం” అని యోగాన్ని నిర్వచించాడు శ్రీక్రుష్ణుడు.
----------------------------------------
 “దమం” లోంచి “సమం” అన్నది వస్తుంది. “దమం” అంటే బహిరేంద్రియాలను లోపలికి ముడుచుకోవడం; .. “సమం” అంటే అంతరేంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడం. బహిరేంద్రియాలను లోపలికి ముడుచుకుని ధ్యానం చేసినప్పుడు అంతరేంద్రియమైన మనస్సు అదుపులోకి వచ్చి .. మనం సమత్వస్థితిని పొంది ఆత్మ మూలప్రకృతిని అవగతం చేసుకుంటాం.
----------------------------------------
 ఇలా “ఆత్మ యొక్క మూల ప్రకృతిని అవగతం చేసుకుని సమత్వస్థితిని పొందటమే యోగం” అనిపించుకుంటుంది కానీ ‘శీర్షాసనం’, ‘కుక్కుటాసనం’ వంటి శారీరక విన్యాసాలు చేసి “అదే యోగం” అనుకున్నంత మాత్రాన ఆత్మసత్యం అవగతమైపోదు.
----------------------------------------
 “ధ్యానం” ఉన్నచోట “వివేకం” ఉంటుంది♪. వివేకంతో కూడిన బుద్ధితో చేసే కర్మలన్నీ కూడా ఫలాపేక్ష లేని అకర్మలుగా మారి లోకకల్యాణ కారకాలవుతాయి♪. కనుక ..
--------------------------------------
_*“కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః*_
_*స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మతృత్”*_ 
                          (భ.గీ.4-18)
----------------------------------------
 “కర్మలో అకర్మనూ, మరి అకర్మలో కర్మనూ దర్శించేవాడు మానవులలో బుద్ధిశాలి; అతడే యోగి .. మరి సమస్త కర్మలనూ చేసేవాడు” అంటూ యోగస్థితిలో ఉన్న బుద్ధిమంతుడు చేసే కర్మలపట్ల స్పష్టతను తెలియజేశారు శ్రీకృష్ణులవారు.
----------------------------------------
 కర్మను “అకర్మ”గా .. అకర్మను “కర్మ”గా భావించడమే నిజమైన కర్మ! “భావం” అన్నదే “భవం” అవుతుంది కనుక “నా ద్వారా ఉత్తమోత్తమమైన కర్మ నిర్వహించబడుతోంది” అని భావన చేసుకుని .. కర్మ ఫలితాన్ని ఆశించకుండా అంకిత భావంతో కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అది “అకర్మ” అవుతుంది.
----------------------------------------
“అనుకోవడం” బీజం .. “అవడం” వృక్షం. బీజం వేస్తే ఏదో ఒకరోజు వర్షం పడి .. ఆ బీజం మొలకెత్తి .. ఒకానొక మహావృక్షం అయినట్లు .. ఉత్తమోత్తమమైన సంకల్పం చేసినప్పుడే ఉన్నతోన్నతమైన కర్మలు నిర్వహించబడతాయి♪.
----------------------------------------
_“తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః_
_*కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీభవార్జున”*_
                       (భ.గీ.|| 6-46)
----------------------------------------
 “ఒకానొక యోగి తాపసులకంటే శ్రేష్ఠుడు; శాస్త్రజ్ఞానులకంటే శ్రేష్ఠుడు; సకామ కర్మలను ఆచరించే వాడి కంటే కూడా శ్రేష్ఠుడని భావించబడుతుంది కనుక ఓ అర్జునా! నువ్వు యోగివి కా!” అన్నాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు.
----------------------------------------
 వేదవ్యాసులవారు నాలుగు వేదాల సారాన్నీ మరి సకల ఉపనిషత్తుల సారాన్నీ చక్కగా క్రోడీకరించి “పంచమవేదం”గా మనకు మహాభారతాన్ని అందించారు.
----------------------------------------
 ఆనాటి సమకాలీన సమాజానికి చెందిన హీరోలను శ్రీకృష్ణుడు, పాండవుల పాత్రలుగా మరి విలన్‌లను కౌరవుల పాత్రలుగా మలచి అన్ని సత్యాలనూ మరియు అన్ని ధర్మాలనూ అందులో పొందుపరచి అనేకానేక ఉపమానాలతో అతి రమణీయమైన మహాభారత కావ్యాన్ని మనకు అందించారు. శ్రీకృష్ణుడిని గోవర్థన గిరిధారి అని స్తుతించాడు.
--------------------------------------
 ” ‘గోవర్థన గిరిధారి’ అంటే ధ్యానయోగ సాధకుడే” “గో” లేదా “గోవులు” అంటే “ఇంద్రియాలు”. “మామూలు కంటికి కనిపించేదే జ్ఞానం’ అనుకునే “గోకులం” లో ఒకడిగా పుట్టిన ధ్యాన యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు .. “గోపాలకుడి”లా వాళ్ళ ఇంద్రియాలను పాలన చేస్తూ “వర్థనం” చేస్తూ .. తన అతీంద్రియ శక్తితో చిటికెన వ్రేలుపై “గోవర్థనగిరి”ని ఎత్తినంత సులభంగా వాళ్ళ సమస్యలకు సమాధానాలు ఇచ్చేవాడు.
----------------------------------------
అంటే “ధ్యానయోగసాధన” అన్నది మన ఇంద్రియాలను వర్థనం చేసి మనల్ని అతీంద్రియుల్లా పరిమార్చివేస్తుంది.
----------------------------------------
అప్పుడు మనం ఇక్కడ వినపడే వాటితో పాటు ఎక్కడో గొప్ప గొప్ప “ఆస్ట్రల్ మాస్టర్స్” ఇచ్చే జ్ఞానపూర్వకమైన సందేశాలను వినవచ్చు; ఇక్కడ కనపడే వాటితో పాటు ఎక్కడో అందమైన లోకాలలోని సుందర దృశ్యాలను చూడవచ్చు; ఇక్కడి వాసనలతో పాటు ఏవేవో జన్మల వాసనలు కూడా పసిగట్టవచ్చు; మరి ఇక్కడ ఉన్న గురువులతో పాటు ఏవేవో లోకాలలో ఉన్న గురువులతో సంపర్కం పొందవచ్చు.
----------------------------------------
 ఇలా తన ఇంద్రియాలపై తాను స్వయంగా పట్టును కలిగి ఉన్న ఒకానొక యోగి .. తన ఆత్మశక్తితో, ఆత్మజ్ఞానంతో అందరినీ సేదదీరుస్తూ గోవర్థునుడిలా వర్థిల్లుతూంటాడు.                             ----------------------------------------
_*“యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః*_
_*తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ”*_
                        (భ.గీ.18-78)
----------------------------------------
‘యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు ‘ధనుర్ధారి’ ‘ధర్మధారి’ అయిన అర్జునుడు ఉండేచోట సకల సంపదలు, సర్వవిజయాలు, సకల భోగాలు మరి సుస్థిరమైన నీతి కొలువుదీరి ఉంటాయి.” అని తన నిశ్చితాభ్రిప్రాయాన్ని తెలియజేశాడు సంజయుడు.
----------------------------------------
 ప్రాపంచిక కర్మలు చేస్తూనే అర్జునుడిలాంటి మనం అంటే “నరులం” .. ధ్యానం చేసి మన ఆత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించుకుని ఆ రకంగా జీవించాలి. అప్పుడు మన జీవితరధానికి పూర్ణాత్మ అయిన “నారాయణుడు” రథసారధిలా సారధ్యం వహిస్తూ ప్రాపంచిక కురుక్షేత్రంలో మనకు విజయాన్ని ప్రాప్తింపజేసి మనల్ని కూడా నారాయణుడిలా అంటే తనంతటి పూర్ణాత్మలా మార్చేస్తాడు.
----------------------------------------
 మళ్ళీ ఆ సరి క్రొత్త పూర్ణాత్మ .. సూర్యకిరణాలలా వేల కొద్దీ అంశాత్మలను ఈ భూమి మీదకు పంపించి వారికి సందేశాలు అందిస్తూ .. వారి ద్వారా తాను సృష్టి రచనా విన్యాసంలో పాలుపంచుకుంటూ ఉంటుంది.
----------------------------------------
 ఇదంతా జరగాలంటే ముందు నరుడిలా పుట్టిన అంశాత్మలో .. నారాయణుడిలాంటి “పూర్ణాత్మ”ను తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలుకావాలి. అందుకు తపన చెందాలి; సాధన చెయ్యాలి.
----------------------------------------
_*“మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే*_
_*యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః”*_  
                            (భ.గీ.7-3)
----------------------------------------
 “వేలకొద్దీ మనుష్యుల్లో ఎవడో ఒకడు మాత్రమే తనను గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు” అని లెక్కలు కూడా కట్టారు భగవాన్ శ్రీకృష్ణుల వారు. అంతేకాదు....
----------------------------------------
_*“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ*_
_*అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః”*_ 
                        (భ.గీ.18-66)
----------------------------------------
 “సర్వధర్మాలనూ అంటే సమస్త కర్తవ్యకర్మలనూ తాత్కాలికంగా పరిత్యజించి .. నీలో నువ్వు స్వీయ శరణు భావనతో వుండు. అప్పుడు అన్ని పాపాల నుంచి నిన్ను నువ్వే విముక్తి చెందించుకుంటావు” అని అభయం కూడా ఇచ్చారు.
----------------------------------------
 “ఇక్కడ ‘మామ్’ అంటే అంశాత్మ అనీ ‘అహం’ అంటే ‘పూర్ణాత్మ’ అనీ గుర్తించి మన సకల ఇంద్రియ ధర్మాలనూ, కుటుంబ ధర్మాలనూ ఒకింత ప్రక్కన పెట్టి .. ధ్యాన అభ్యాసం చెయ్యాలి” అని అర్థం చేసుకోవాలి.
----------------------------------------
 కళ్ళు రెండూ మూసేసుకుని మన అంతరంగంలోకి ప్రవేశించి మన స్వీయ ఆత్మను అంటే “మామ్”ను మనం శరణు వేడాలి. అప్పుడు మన “పూర్ణాత్మ” అంటే మన “అహం”.. మనం గత అనేకానేక జన్మలుగా కూడబెట్టుకున్న అనేకానేక పాపకర్మల నుంచి మనల్ని విముక్తులను చేస్తుంది.
---------------------------------------
 మనం కొంత చేస్తే .. మన పూర్ణాత్మ మిగిలింది చేయగలుగుతుంది. మనం చెయ్యవలసింది చేస్తేనే మనం పొందవలసిన వాటిని ఏ ఆటంకం లేకుండా సకాలంలో పొంది శోకవిముక్తులం అవుతాము.
---------------------------------------
 విశ్వనియమాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కటీ అక్కడ ఖచ్చితంగా అమలుపరచబడుతుంది.
----------------------------------------
  కనుక ఎంత “ఎరుక”తో మనం ఇక్కడ జీవిస్తే పైలోకాలలో అంత ప్రశాంతంగా ఉంటాం; అదే “సరస్వతీ జ్ఞానం” మరి ఆ సరస్వతీ జ్ఞానాన్ని మనకు తత్త్వ దర్శినులే అందిస్తారు. అలాంటి తత్త్వదర్శినులు దానికి సంబంధించిన ప్రశ్నలనే మనం తత్త్వ దర్శనులను అడగాల్సిందే.
----------------------------------------
తత్త్వదర్శనం పొందిన “జ్ఞానులు” మనకు సత్యాన్ని బోధిస్తారు:
---------------------------------------
_*“తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా*_
_*ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః”*_
                          (భ.గీ.4-34)
----------------------------------------
 “తత్త్వదర్శనుల నుంచి జ్ఞానాన్ని గ్రహించాలి. వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి .. సేవించి కపటం లేకుండా భక్తితో వారిని సముచితరీతిలో ప్రశ్నించాలి. అప్పుడు ఆ జ్ఞానస్వరూపులు నీకు సత్యాన్ని ఉపదేశిస్తారు” అని తెలియజేసారు శ్రీకృష్ణుల వారు.
----------------------------------------
“రెండు కాళ్ళూ .. రెండు చేతులూ, ఒక మొండెం .. ఒక శిరస్సు .. మనస్సు మరి బుద్ధి” అనే ఎనిమిది అంగాలతో శ్వాసగురువుకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి.
---------------------------------------
 అంటే బహిరేంద్రియాలనూ, మనస్సునూ బుద్ధినీ “శ్వాస గురువు”కు అధీనం చేసి .. “పరి సేవ” చెయ్యాలి. అప్పుడు మన చిత్తవృత్తులన్నీ నిరోధం కాబడి మన దివ్యచక్షువు తెరుచుకోబడి .. తత్త్వదర్శనులైన ఎందరెందరో ఉన్నత లోకవాసులు మనకు దివ్యచక్షువులో దర్శనం ఇస్తారు. వారిని మనం “చనిపోయిన తరువాత ఏమౌతుంది?” అన్న పరిప్రశ్న వేసి వారి నుంచి “సరస్వతీ జ్ఞానాన్ని” పొందాలి. అదొక్కటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన జ్ఞానం.
----------------------------------------
 అంతే కానీ ధ్యానంలో జ్ఞానస్వరూపులు దర్శనం ఇవ్వగానే .. “నా కొడుకు పెళ్ళి ఎప్పుడవుతుంది?” .. “నాకు ప్రమోషన్ ఎప్పుడొస్తుంది?” .. “నాకు పిల్లలు పుడతారా?” .. “నా స్థలానికి ఎంత రేటు వస్తుంది?” అంటూ మూర్ఖపు ప్రశ్నలు అడగకూడదు. అలా అడిగిన వారు ఏమీ సమాధానం చెప్పరు.
--------------------------------------
 ఊరికే మనవైపు కాస్సేపు చూసి వెళ్ళిపోతారు అంతే! ఏకలవ్యుడు తపస్సు చేసి శారదాదేవి ప్రత్యక్షం అయ్యింది. అప్పుడు అతడు తనకు గొప్ప విలువిద్యను ప్రసాదించమని ఒక ప్రాపంచిక కోరిక కోరాడు. ఆమె “తథాస్తు” అంది! కానీ ఆ విలువిద్య అతనికి పనికి వచ్చిందా? శారదా దేవి అంతటి తత్త్వదర్శిని ప్రత్యక్షమైనప్పుడు .. “ఈ లోకంలో మరి పరలోకంలో కూడా నన్ను తరింపజేయగల సరస్వతీజ్ఞానాన్ని ఇవ్వమ్మా” అని కోరుకోవాలే కానీ .. ఈ లోకంలోనే పనికివచ్చే విలువిద్యను కోరుకోవడం తప్పు.
----------------------------------------
 మన జీవిత పరిస్థితులను మనమే ఎంచుకుని వచ్చాం కాబట్టి .. “వాటిని మార్చెయ్యాలి” అనుకోవడం తప్పు.
----------------------------------------
 బాగా ధ్యానం చెయ్యడం మరి ప్రాపంచిక జీవితానికి సంబంధించి ఏమీ అడగకుండా ఉండడమే సరియైన జీవితం. సరియైన జీవితాన్ని జీవిస్తూంటే .. రావలసినవి అన్నీ వాటంతట అవే వస్తాయి.
----------------------------------------
 “ధ్యానం” అన్నది ఒక ఆత్మవిజ్ఞానమహాశాస్త్రం! ఇంత గొప్ప శాస్త్రాన్ని నిరంతర ధ్యానప్రచారం ద్వారా ప్రపంచం అంతా తెలియజేసే బృహత్తర బాధ్యతను చేపట్టిన “పిరమిడ్ మాస్టర్స్” అందరూ “ఆత్మవిజ్ఞాన శాస్త్రవేత్తలు”!
----------------------------------------
గత అనేకానేక జన్మలుగా “శ్వాస మీద ధ్యాస” పెట్టి ధ్యానం చేసి చిత్తవృత్తులను నిరోధం చేసుకుని .. నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుని .. దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని తమ మీద తామే ప్రయోగాలు చేసుకున్న ఈ అనుభవజ్ఞానశాస్త్రజ్ఞులు .. ఇప్పుడు ఆ ఆత్మవిజ్ఞానాన్నంతా ఇతరులకు బోధించడానికే ఈ జన్మలో ఆ దివి నుంచి ఈ భువికి దిగివచ్చారు.
----------------------------------------
 దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ “మనంకూడా దివి నుంచి భువికి దిగి వచ్చిన ఆత్మలం” అని తెలుసుకుంటారు. సుఖమయప్రాణాయామం ద్వారా మరి అభ్యాస వైరాగ్యాల ద్వారా సూక్ష్మంలో మోక్షాన్ని పొందుతారు.
----------------------------------------
 ఇలా అభ్యాస వైరాగ్యాల ద్వారా గత అనేకానేక జన్మలుగా ఎంతెంతో ధ్యానసాధన చేసిన మాస్టర్లంతా ఒక్కొక్క జీవిత ప్రణాళికతో .. ప్రపంచంలోని ఒక్కొక్క ప్రాంతంలో పుట్టి తాము నేర్చుకున్న ఆత్మవిద్యను అందరికీ బోధిస్తూ ఆధ్యాత్మిక ఉద్యమాలను నిర్వహిస్తున్నారు.
----------------------------------------
 తమ దివ్యచక్షువుతో ఉన్నత లోకాలను దర్శిస్తూ అక్కడి మాస్టర్లతో సజ్జనసాంగత్యం చేస్తూ తమ “జ్ఞానచక్షువు”ను ఉత్తేజితం చేసుకుంటారు. అప్పుడే వాళ్ళకు “యుక్త అవబోధ” కలిగి ఇతరులకు ఆత్మసత్యాలను సరిఅయిన విధంగా బోధించగలిగే అర్హత వస్తుంది.
----------------------------------------
 సకల రాజరికపు సంపదలతో తులతూగుతూన్న బుద్ధుడు తన అంతర్వాణి ప్రబోధంతో సంపదలన్నీ వదిలివేసి .. ప్రపంచానికి దుఃఖ నివారణా మార్గం కనుగొనడానికి బయలుదేరాడు. ఆనాపానసతి ధ్యానసాధన చేసి తన దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని .. తన గతజన్మ పరంపరను చూసుకుని .. కర్మసిద్ధాంతాన్ని అవగతం చేసుకుని “బుద్ధుడు” అయ్యాడు.
---------------------------------------
“బుద్ధుడి”గా అయిన తక్షణమే అతడు తాను కనుక్కున్న సత్యాన్ని అందరికీ తెలియజేయడం మొదలుపెట్టాడు. మరి తన వాక్కును అద్భుతంగా వినియోగించుకుంటూ లోకోద్ధరణకు నడుము కట్టాడు.
----------------------------------------
 అందుకే మనస్సును నిగ్రహించుకుని సత్యదర్శనం చేసిన ఒకానొక ధ్యానయోగి మాటకే అంతటి విలువ వస్తుంది కనుక “అర్జునా! నువ్వు ధ్యానయోగివికా నాయనా!” అని సూచించాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో! అందుకు అర్జునుడు
----------------------------------------
_*“చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవద్ధృడమ్*_
_*తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్”*_
                          (భ.గీ.6-34)
----------------------------------------
 “ఈ మనస్సు చాలా చంచలమైంది. బాగా ప్రమాద స్వభావం కల్గినదీ, దృఢమైనదీ మరి ఎంతో బలమైంది. దీనిని నిగ్రహించడం అంటే గాలిని ఆపడంలా ఎంతో దుష్కరం” అని వాపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ..
----------------------------------------
_*“అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్*_
_*అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చగృహ్యతే”*_ 
                          (భ.గీ.6-35)
----------------------------------------
“నిస్సందేహంగా మనస్సు చంచలమైందే మరి దానిని వశపరచుకోవడం చాలా కష్టం! కానీ కౌంతేయా! .. అభ్యాస వైరాగ్యాల ద్వారా దానిని వశపరచుకోవడం సాధ్యమే! అని తెలియజేశాడు శ్రీకృష్ణుడు.  “అభ్యాసం” + “వైరాగ్యం” ..
----------------------------------------
రోజులో కాస్సేపు చర్మచక్షువులను మూసేసుకుని కర్మేంద్రియ చాపల్యాలన్నింటినీ లోపలికి ముడుచుకుని .. కూర్చోవడాన్ని “వైరాగ్యం” అంటాం! మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యడాన్ని “అభ్యాసం” అంటాం. ఇలా అభ్యాస వైరాగ్యాల ద్వారా ఇంద్రియాలతో కూడిన మనస్సును అదుపులో ఉంచుకున్న వారే మహేంద్రులు. వారి దగ్గరికే అక్షయపాత్ర .. కామధేనువు .. కల్పవృక్షం .. చింతామణి .. వజ్రాయుధం .. ఐరావతం.. ఇలాంటివి అన్నీ వచ్చి చేరుతాయి.
----------------------------------------
 కాబట్టి, మనస్సు పట్ల జాగ్రత్త! మాట పట్ల జాగ్రత్త! మరి చేసే కర్మల పట్ల జాగ్రత్త వహించాలి! వారికే మాట శాంతంగా ఉంటుంది .. మనస్సు శాంతంగా ఉంటుంది .. మరి వారు చేసే కర్మలు ప్రశాంతంగా ఉంటాయి! ఇలా ప్రజలు అందరూ యోగులుగా మారితే భూలోకం అంతా కూడా శాంతిమయం అవుతుంది.
----------------------------------------
*🙏🏻భగవద్గీత కు జేజేలు! వేదవ్యాసుల వారికి సహస్రకోటి ప్రణామాలు!!🙏🏻*      **************************************************
మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి  గీతా జయంతిగా పాటించబడుతుంది. ఈరోజునే కురుక్షేత్ర సంగ్రామ సందర్భంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఈ భగవద్గీత మోక్ష ప్రాప్తికి సాధనం గనుకే గీతా జయంతికెంతో పవిత్రత. శత్రువుతో పోరాడమని, తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించమనీ భగవానుని ఆదేశం. ఈ పర్వదినాన్ని మోక్షదా ఏకాదశి అనీ అంటారు. గీతా పఠనం ద్వారా జన్మ రాహిత్యం లభిస్తుందని కూడా పెద్దలంటారు. గీతాచార్యుని బోధ శిరోధార్యం. 'గీతా' ప్రకారం మానవుడు మహాభావుడు, అమరుడు, అనంతశక్తి భాండారం వంటివాడు. 'భగవద్గీత' ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక పర్యాయం మహాత్మాగాంధి ఇలా ప్రవచించాడు: “నా ఆలోచనా ద్వారా నేను ఏదయినా సమస్యను పరిష్కరించ లేకపోతే, స్ఫూర్తికోసం గీతను ఆశ్రయిస్తాను. "గీతోపదేశసారం,” కర్మణ్యేవాధికారస్తే, మాఫలేషుకథాచన" అంటే దాని అర్థం- "కర్మ ఆచరించు, కానీ దాని ఫలంగురించి ఆశించకు”
---------------------------------------
పూజా విధానం
---------------------------------------
ఒక పూలహారం, ఒకదీపం, మిఠాయిలతో తయారైన ప్రసాదం-ఇవీ పూజా సామగ్రి, గీతను పూజించాక, గీతా పఠనం, హారతి ఇవ్వడం జరుగుతాయి. అసలు ఈ పండుగ ఉద్దేశం-గీత సిద్దాంతాలు, ఉపదేశాలు, ఆత్మానుభవంలోకి తెచ్చుకుని, జీవితాన్ని ఆ ప్రకారం తీర్చిదిద్దుకోవాలి. అదే 'భగద్గీత' కు నిజమైన ఆరాధన.                                     **************************
*గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు.*                                  ---------------------------------------    ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం *          ----------------------------------------   *మార్గశిర శుద్ధ ఏకాదశి* --------------------------------------    రోజుజరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.
----------------------------------------
*గీకారం త్యాగరూపం స్యాత్*
*తకారమ్ తత్వబోధకమ్*
*గీతా వాక్య మిదమ్* *తత్వం*
*జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:*
----------------------------------------
*గీత* అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. *"గీ"* అనే అక్షరం త్యాగాన్ని ను బోధించుచున్నది. *"త"* అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ , బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ *రహస్యాన్నే గీతాశాస్త్రము* ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము *మార్గశిర శుద్ధ ఏకాదశి.* ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం ప్రారంభించండి.
----------------------------------------
*సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|*
*పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||*
----------------------------------------  ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన *బ్రహ్మవిద్య భగవద్గీత.* అందుకే అంటారు , *సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా , అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా , ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి , ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే , మరోపక్క లోకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట.* అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి , ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో , అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు , మన *వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః.*  అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.
 ---------------------------------------
*వాసాంసి జీర్ణాని యథా విహాయ*
*నవాని గృర్ణోతి నరో పరాణి*
*తథా శరీరాణి విహాయ జీర్ణా*
*న్యన్యాని సంయాతి నవాని దేహీ*
---------------------------------------    చిరిగిపోయిన పాతబట్టలను విడిచి మనుషులు ఇతర కొత్తబట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహియనే ఆత్మా కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు.
----------------------------------------
*నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః*
*న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః*
----------------------------------------
ఈ ఆత్మను ఆయుధములేవీ కూడా ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు , నీరు తడుపజాలదు , గాలి ఎండింపజాలదు.
----------------------------------------
*కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన*
*మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గో స్త్వకర్మణి*
----------------------------------------
అర్జునా ! నీకు కర్మను చేయటంలోనే అధికారము వుంది. కర్మఫలాలను ఆశించుటలో ఏనాడూ కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు అవ్వకు. మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగకుండుగాక.
----------------------------------------
*యదా యదా హాయ్ ధర్మస్య గ్లానిర్భవతి భారత*
*అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్*
----------------------------------------
ఓ అర్జునా ! ఎప్పుడెప్పుడు ధర్మమూ క్షీణించి , అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో , అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను.
----------------------------------------
*పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్*
*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే*
------------------------------------
సాదు , సజ్జనులను సంరక్షించటం కోసం , దుర్మార్గులను వినాశం చేయడానికి , ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. ----------------------------------------
*కృష్ణుడంటాడు "ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం..."* అని , అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు. భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని , ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు. ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు , చెడు లక్షణాలను , చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము. 
----------------------------------------
నిజమైన దేవుడు ఆయనను నమ్మినా , నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు , ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతికిరణం , ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు , అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా , కొద్దిగా గంగాజలం త్రాగినా , కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. వారికి మోక్షం లభిస్తుంది.                                    **************************
 *భగవాన్ ఉవాచ..*
*************************
రణసీమలో గీతను బోధించిన పరమాత్మ చివరకు ‘కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ! త్వయైకాగ్రేణ చేతసా / కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనుంజయ!’...  చెప్పినదంతా జాగ్రత్తగా విన్నావా? అజ్ఞానం వల్ల ఏర్పడ్డ భ్రమ తొలగిందా? అని అర్జునుడిని అడిగాడు.  ఫలానా పని చెయ్యమని గానీ, వద్దని గానీ చెప్పలేదు కృష్ణ పరమాత్మ. ఏది మంచో, ఏది చెడో విడమరిచి చెప్పాడంతే.
--------------------------------------
‘చెప్పాల్సిందంతా చెప్పాను... ఇక నీ ఇష్టం’ అన్నాడు. ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగితే మనిషి మహనీయుడవుతాడు. జ్ఞానం... సాధనతోనే సాకారమవుతుంది. భగవానుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని, ఆదేశాలుగా భావించి పాటిస్తే జీవితం ధన్యమవుతుంది. దానికోసం మరో ముహూర్తమెందుకు?ఈ రోజే మొదలుపెడితే సరి..
----------------------------------------
ఆదిశంకరాచార్యులు తన భజగోవిందంలో ‘గేయం గీతా నామ సహస్రం’; ’భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికా పీతా...’
----------------------------------------
గీతా శ్లోకం ఒక్కటి పారాయణ చేసినా గంగా జలాన్ని తాగినంత పుణ్యం వస్తుందంటూ కొనియాడారు.
----------------------------------------
‘యే యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహమ్‌’ (కర్మ సన్యాసయోగం).
----------------------------------------
ఎవరు ఏ దృష్టికోణంతో చూస్తారో వారికి అలాగే కనిపిస్తానంటాడు పరమాత్మ. జరుగుతున్న సంఘటనలపై నీ దృష్టికోణం మార్చుకోమంటుంది భగవద్గీత. జరిగిన సంఘటన నేరుగా ఏ ఫలితాన్నీ ఇవ్వదు. నీ మనసు చేసే మాయాజాలమే ఆనందం, విచారాలు. అందుకే జరిగినదాన్ని ఓ పాఠంగా భావించు. మంచి మాత్రమే స్వీకరించు.
----------------------------------------
‘ఆశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే/ గతాసూనగతాంసూశ్చ నాను శోచంతి పండితాః’ (సాంఖ్యయోగం)
----------------------------------------
అనవసరమైన ఆలోచనలు మన బుద్ధిలో వేగాన్ని మందగింపజేస్తాయి. సరైన ఆలోచనల్ని అడ్డుకుంటాయి. గతాన్ని తలచుకుంటూ బాధపడటం మానేసేి భవిష్యత్తులో సాధించాల్సిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకో.
----------------------------------------
‘ధూమేనావ్రియతో వహ్ని ర్యథాదర్శోమలేన చ’ (కర్మయోగం)
---------------------------------------
అద్దం మురికి పడితే తన ప్రకాశాన్ని కోల్పోతుంది. మన మనసు కూడా అలాంటిదే. ఆకర్షణలనే మాయ పొరలు మనసును కమ్మితే ఇక చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలేస్తాం. ఏది మంచో ఏది చెడో విచక్షణతో ఆలోచించాలి. లేదంటే కోల్పోయేది బుద్ధి మాత్రమే కాదు.. భవిష్యత్తు కూడా.
----------------------------------------
‘అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ’ (భక్తియోగం)
----------------------------------------
సమస్త ప్రాణులపై ద్వేషం లేకుండా ప్రవర్తించాలని గీత బోధిస్తుంది. సమాజం నుంచి తాను ఏం కావాలని కోరుకుంటాడో సమాజానికి తాను కూడా దాన్ని అందించాలి. ప్రకృతికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఓర్పు, దయ, శాంతి, సహనం, క్షమతోనే అద్భుతమైన జీవితం సాధ్యమవుతుంది.
----------------------------------------
‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌... స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే’ (శ్రద్ధాత్రయ విభాగయోగం)
----------------------------------------
ఇతరులకు బాధ కలిగించకుండా వారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేలా మాత్రమే మాట్లాడాలి. ఇది కూడా తపస్సే అవుతుంది. ఎప్పుడైతే పరుషమైన పదం మన నోటి నుంచి రాదో అప్పుడు మనల్ని ద్వేషించేవారెవ్వరూ ఉండరు. అంతిమంగా మనకు ఏవిధమైన అశాంతి కలగదు.
----------------------------------------
‘ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిదీయతే’
‘క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత’ (క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం)
----------------------------------------
దేహాన్నే క్షేత్రం అంటారు. దీన్ని తెలుసుకున్నవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఎన్నో నియమాలు పాటిస్తూ, జీవితకాలమంతా తపస్సు చేసి, ఏ భగవంతుడిని దర్శించటానికైతే మనస్సు తహతహలాడిపోతుందో ఆ దేవుడు మనలోనే ఉంటాడు. మనలో ఉన్న దైవత్వాన్ని అంగీకరించి, సాటి ప్రాణుల్లో ఉన్నది కూడా ఆ పరతత్త్వమేనని గుర్తించగలగాలి. దాన్ని మోక్ష సాధన అంటారు.
----------------------------------------
‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా’ (కర్మ సన్యాసయోగం)
----------------------------------------
అభ్యాసం జీవితకాల ప్రక్రియ.నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి.. నేర్చుకోవాలనుకున్న వ్యక్తి గురువు దగ్గరకు వినయంతో వెళ్లాలి. శరీరం, మనస్సు, బుద్ధి... మూడింటిలోనూ విధేయతను ప్రకటించాలి. గురువును శరణాగతి పొంది జ్ఞానాన్ని ఆర్జించాలి.
----------------------------------------
‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ఠ పరంతప’ (సాంఖ్యయోగం)
----------------------------------------
మనిషి విజయానికి మనసే మూల కారణం.ధైర్యం లేని మనసు ఏ ప్రయత్నాన్ని చెయ్యలేదు. ఏ విజయాన్ని సాధించలేదు. అన్యాయాన్ని ఎదుర్కోలేదు. అందుకే పరమాత్మ బోధించినట్లు మనోదౌర్బల్యాన్ని విడిచిపెట్టాలి. సాహసాన్ని శ్వాసగా చేసుకోవాలి.
----------------------------------------
వరాహ పురాణంలో గీతామహాత్మ్యాం విస్తృతంగా వర్ణించారు. దీంతోపాటు గీతకు ప్రత్యేకంగా 18 పేర్లను ఈ పురాణం సూచిస్తుంది. అవి గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్థమాత్ర, చిదానంద, భవఘ్ని, భయనాశిని, వేదత్రయి, పర, అనంత, తత్త్వార్థ జ్ఞానమంజరి.                                **************************

No comments:

Post a Comment