Tuesday, December 10, 2024

దివ్యమైన జీవితం!

 🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏 శివాయ గురవే నమః 🙏

*దివ్యమైన జీవితం!*
             

*మనం జీవించాల్సింది ‘దీర్ఘ’ జీవితం కాదు ‘దివ్య’ మైన జీవితం !*
```
చాలా మంది ఆరోగ్యం కోసం పొద్దున్నా సాయంత్రం నడవడం చేస్తుంటారు, కొంతమంది వ్యాయామశాలకి వెళ్లి రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు, కొంతమంది ఆసనాలు అవీ వేస్తుంటారు, కొంత మంది అలాటివి ఏమీ చేయకుండా రకరకాల ఖరీదైన పళ్ళు, పళ్ళ రసాలు, ఇంకా ఏవేవో ఎవరి స్థాయికి తగ్గవి వాళ్ళు తిని తాగుతూ ఉంటారు.

ఇలా రకరకాలుగా ఆరోగ్యం కోసం ఏవేవో చేస్తుంటారు. ఇలా ఎవరు ఏమి చేసినా ఆరోగ్యం తో దీర్ఘమైన జీవితం గడుపుదామనే తప్ప వాళ్ళు కోరుకునే ఆ ఆరోగ్యం.. ఆ దీర్ఘమైన జీవితం ఎందుకోసమో వాళ్ళకే తెలియదు.

అటువంటి కార్యక్రమాలు అన్నీ కొంతమంది ఆరోగ్యం కోసం శ్రద్ధ తో చేస్తారు, కొంత మంది శారీరక ఆకర్షణ కోసం చేస్తారు, కొంత మంది సరదాకోసం చేస్తారు, కొంతమంది అలవాటుగా చేస్తారు, కొంతమంది అవతల వాళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళని చూసి చేస్తారు, కొంత మంది ఆడంబరం కోసం చేస్తారు .. కాని ఎవరు అలా రకరకాలు గా వ్యాయామాలు చేసి ఆరోగ్యవంతమైన శరీరం తో ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటున్నారో వాళ్ళు అలా ఆరోగ్యంతో బ్రతికున్నంత కాలం ఏమి చేయాలని అనుకుంటున్నారో అన్నది చాలా ముఖ్యం.

ఆరోగ్యంతో ఎక్కువ కాలం బ్రతకాలి అనుకునేవాళ్లు ఆ దీర్ఘాయుషుని మంచి, మానవత్వంతో, నిరంతరం సత్కార్యాలు చేస్తూ తోటి మానవాళికి….      తనకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ నిస్వార్ధంగా ఉంటూ సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ ఆరోగ్యానికి ఆ జీవితానికి ఒక పరమార్ధం సిద్ధిస్తుంది.

మనం ఆరోగ్యంగా ఎన్ని ఏళ్ళు బ్రతికాము అన్నది కాదు కావాల్సింది ఉన్నన్నాళ్ళు పదిమందికి ఆదర్శంగా బ్రతికామా లేదా అన్నది కావాలి.

లేకపోతే మనతో పాటు ఆకులు అలములు తింటూ దీర్ఘమైన జీవితం గడిపే జంతువులకి మనకి పెద్ద తేడా ఏమీ ఉండనట్టే లెక్క.

అందుకే మనం ఆరోగ్యం కాపాడుకునేది భోగవంతమైన దీర్ఘజీవితం గడపడం కోసం కాదు ఆదర్శవంతమైన ఒక ‘దివ్యమైన జీవితం’ గడపడం కోసం!

🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏

No comments:

Post a Comment