*భగవంతుడిచ్చిన కానుక భగవద్గీత*
*భగవద్గీతను ఆదర్శంగా తీసుకొంటే మనిషికి ఆత్మగౌరవం, స్వేచ్ఛ పెంపొందడంతో పాటు సమత్వ భావన వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన దేశానికి కావలసింది ఇదే. గీతా ఆదర్శం ప్రపంచంలో అందరినీ ఉత్తేజపరుస్తోంది. ఈ అనుష్ఠాన వేదాంతాన్ని ప్రపంచానికి మొట్టమొదటి సారిగా స్వామి వివేకానంద తెలిపారు. శ్రీకృష్ణుడు గీతను అనుష్టాన వేదాంతంగానే అందించాడు. మనం మాత్రం దీనిని కేవలం పవిత్ర గ్రంథంగా భావించి, పూజగదికి పరిమితం చేశాం. మనిషి పరిపూర్ణుడవడానికి కావలసిన అంశాలు భగవద్గీతలో ఉన్నాయన్న అవగాహన ఇప్పుడిప్పుడే మొదలైంది. ఆ ఆశయాలను పాటిస్తే వ్యక్తి సౌశీల్యవంతుడవుతాడు; జాతి ఔన్నత్యాన్ని సాధిస్తుంది. దేశం ప్రగతి పథంలో ముందుంటుంది.*
*వేదాలు అనే కామధేనువు నుంచి శ్రీకృష్ణుడనే గోవులకాపరి పితికిన 'పాలు' - భగవద్గీత. ఆ పాలు కేవలం పూజలో పెట్టి పూజించడానికి కాదు; అవి మనం తాగడానికి ఉద్దేశించబడినవి. అప్పుడే శక్తి వస్తుంది. అనేక వందల సంవత్సరాల నుంచి ఆ పాలను పూలతో పూజిస్తున్నాం కానీ తాగలేదు. అందువల్లే మనం భౌతికంగా, మానసికంగా, సాంఘికంగా బలహీనులుగానే ఉన్నాం. వాటిని తాగడం మొదలు పెడితే జాతి నూతన జవసత్త్వాలను సంతరించు కుంటుంది; శక్తిమంతంగా తయారవుతుంది.*
*భారతీయ వేదాంతాన్ని బోధించే ఉపనిషత్తుల సారమే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనే మూడింటినీ కలిపి ప్రస్థానత్రయం అని పిలుస్తారు. సనాతన ధర్మానికి చెందిన మూలగ్రంథాలు ఇవే. భగవద్గీత ప్రపంచ మేథావులందరూ ఆరాధించిన మహత్తర గ్రంథం. ఇదొక సమగ్రమైన ధర్మశాస్త్ర, వేదాంత సిద్ధాంత గ్రంథం. మానవాళి సందేహాలన్నీ తీర్చిగలిగే ఒకే ఒక గ్రంథం భగవద్గీత.*
*భగవద్గీత సన్యాసాన్ని చెప్పదు. యుద్ధమూ చెప్పదు. కాలాన్ని బట్టి, సామాజిక స్థాయిని బట్టి ప్రతివారూ పాటించాల్సిన కర్తవ్యాన్ని మాత్రమే చెబుతుంది. మనిషికి ఇహమూ, పరమూ రెండింటిని గురించి చెబుతుంది. ఇహము అంటే ఈ లోకంలో కర్తవ్యం. ధర్మబద్ధంగా నడుచుకోవడం. పరము అంటే అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమేదో తెలుసుకోవడం. మనిషి తన ధర్మాన్ని సరిగా నిర్వహిస్తూ ఎలా మోక్షాన్ని అందుకోవాలో గీత చెబుతుంది.*
*గీత అంటే పాడబడ్డది అని అర్థం. గానమంటే పాట అని మనకు తెలుసు. మన ప్రాచీన గ్రంథాలలో వేదాంత విషయాల్ని చాలా ఉదాత్తమైన స్థాయిలో చెప్పినపుడు దాన్ని గీత అనే సంప్రదాయం ఉంది. ఉద్ధవగీత, దత్తాత్రేయగీత, అష్టావక్రగీత, పరాశరగీత, శ్రుతిగీత, అనుగీత లాంటివెన్నో మన ఇతిహాసాలలో, స్మృతులలో, పురాణాలలో ఉన్నాయి. మహాభారత యుద్ధం తరువాత కృష్ణుడు, అర్జునుడు మధ్య జరిగిన సంభాషణ అనుగీత. ఇందులోని విషయాలే అక్కడా. ఉన్నాయి. కానీ ఆ సందర్భంలో అర్జునుడికి యుద్ధం కర్తవ్యం కాదు. అందుకని యుద్ధం చేయాలని చెప్పలేదు.*
*గీతలో బోధించేవాడూ, వినేవాడూ ఇద్దరూ గృహస్థులే. ఇద్దరూ రాజవంశంలోని వారే. కార్యశూరులే. సంభాషణా స్థలం యుద్ధభూమి. అర్జునుడికి వచ్చిన సందేహం తన ధర్మాన్ని గూర్చి పాండవులు, కౌరవుల మధ్య యుద్ధానికి ముందు దౌత్య వ్యవహారం జరిగింది. కృష్ణుడి రాయబారం విఫలమైంది. ఇరువర్గాల వారూ యుద్ధానికి సన్నద్ధులై వచ్చినవాళ్లు యుద్ధం చేయబోతూ సందేహంలో పడిన సందర్భమిది. కృష్ణుడు చేసిందల్లా. అర్జునుడి మానసిక స్థితిని విశ్లేషించడం. ధర్మపు విస్తార రూపాన్ని వివరించడం. అర్జునుడి మనసులో కలిగిన శోకం. మోహం అనే సంక్షోభాన్ని తొలగించడం.*
*ప్రస్తుత తరుణంలో మనం ముందుకు వెళ్ళడానికి ఆచరణీయ వేదాంతం కావాలి. మన పాదాల వద్ద ఉన్న ప్రమిదలోని జ్ఞానజ్యోతి వెలుగును మెదడు వరకు ప్రసరింప చేయాలి. ధైర్యశాలి అయిన అర్జునుడికి, ధీశాలి అయిన శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం గీత. అంటే, ధైర్యశాలురైన ప్రజలకు మరింత ధైర్యం కోసం గీత అన్న ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రపంచం అంతటా కోట్లాది? వదీనిని శతాబ్దాలుగా చదువుతూ పరమోత్కృష్ట ప్రయోజనాన్ని పొందారు; పొందుతున్నారు; ఆలోచనా పరిధిని విస్తరించు కుంటున్నారు.*
*┈┉┅━❀꧁ॐ🌹ॐ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం ఆనందం*
🪷🌺🪷 🙏🕉️🙏 🪷🌺🪷
No comments:
Post a Comment